తెలంగాణలో కొనసాగుతున్న భారీవర్షాలు, ముగ్గురి గల్లంతు

తెలంగాణలో భారీవర్షాలు సోమవారం కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఆదివారం రాత్రి కురిసిన భారీవర్షంతో హైదరాబాద్ నగరంలో ఒకరు మరణించగా, ముగ్గురు గల్లంతయ్యారు.;

Update: 2025-09-15 00:42 GMT
భారీవర్షాలతో హైదరాబాద్ నగరంలో వెల్లువెత్తిన వరదనీరు

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కూడా భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిిరి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీవర్షాలు కురిసేఅవకాశముందని ఆమె తెలిపారు. నాలుగు జిల్లాల్లో సోమవారం ఆరంజ్ అలర్ట్ ప్రకటించినట్లు ఆమె వివరించారు.


13 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు. 13 జిల్లాల్లో సోమవారం ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు ఐఎండీ సోమవారం ఉదయం తెలిపింది.



 హైదరాబాద్ లో వెల్లువెత్తిన వరదలు

హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, మియాపూర్, బాలానగర్,శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, లింగంపల్లి, హైటెక్ సిటీ, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, సూరారం, నేరేడ్‌మెట్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, కాప్రా, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, అల్వాల్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

ఒకరి మృతి, ముగ్గురు గల్లంతు
హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి కురిసిన భారీవర్షాల వల్ల గోడకూలి ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వరదనీటిలో కొట్టుకుపోయారు.ముషీరాబాద్‌ వినోద్‌నగర్‌లో నాలాలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. పోలీసులు, హైడ్రా బృందాలు వినోద్ నగర్ లోని ఘటనాస్థలికి చేరుకొని గాలిస్తున్నారు.ఆసిఫ్ నగర్‎లో మరో ఇద్దరూ వరదలో గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ మంగారు బస్తీలోని నాలాలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.



 వెల్లువెత్తిన వరదలు...రంగంలోకి దిగిన మేయర్

హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 12 కమాండ్ కంట్రోల్ వద్ద రోడ్డు పై భారీగా వర్షపునీరు నిలిచింది.దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలిసిన వెంటనే వర్షపు వరద నీరు నిలిచిన రోడ్డు వద్దకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వచ్చి వరద నీటిని పంపించే పనులు చేపట్టారు. రోడ్డుపై నిలిచిన వర్షపు వరద నీటిని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు డైవర్ట్ చేశారు. వరద సహాయ పనులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దగ్గరుండి పర్యవేక్షించారు.మోటార్ల సహాయంతో నీటిని లిఫ్ట్ చేయాలని అధికారులకు మేయర్ సూచించారు.

భారీ వర్షాలపై మంత్రి పొన్నం టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై వివిధ విభాగాల అధికారులతో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ , హైడ్రా బృందాలు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల పై నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో ప్రజలు నుండి ఎవరు బయటకు రాకూడదాని ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రదేశాల్లో ఇబ్బందులు ఎదురైతే జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ ల దృష్టికి తీసుకురావాలని సూచించారు.భారీ వర్షాలు కురుస్తుండడంతో మాన్ హోల్స్ వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరారు.




Tags:    

Similar News