సర్కారు బడుల్లో అమ్మాయిల ఆత్మ గౌరవానికి భంగం
రాష్ట్రంలో 29,421 పాఠశాలలు ఉంటే 1,752 పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్స్ కరువు;
దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అన్నాడు విద్యా వేత్త కొఠారి.ఇది సాధ్యం కావాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందాలి. కానీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం వల్ల నాణ్యమైన విద్య ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి టాయిలెట్స్ కొరత. ఇటీవల విడుదల అయినా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) 2024-2025 నివేదిక ప్రకారం, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, మరియు వారి విద్యాభ్యాసంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది.యూడైస్ 2024-2025 నివేదిక ప్రకారం, తెలంగాణలో మొత్తం 29,421 కో-ఎడ్యుకేషన్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపు 1,752 పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్స్ లేవు. ఇంకా 1,100 పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నప్పటికీ అవి పనిచేయడం లేదు. ఈ సమస్య కేవలం బాలికలకే పరిమితం కాదు. బాలురకు కూడా ఇదే పరిస్థితి. సుమారు 4,069 పాఠశాలల్లో బాలురకు టాయిలెట్స్ లేవు. 1,400 పాఠశాలల్లో ఉన్నా అవి ఉపయోగపడడం లేదు. ఈ గణాంకాలు ప్రభుత్వ పాఠశాలల పైన ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ లేకపోవడం వలన పాఠశాలలో పాఠశాల సమయంలో నీళ్లు తాగితే టాయిలెట్స్ అవసరం అవుతుందనే భయంతో అనేక మంది విద్యార్థినులు నీళ్లు తాగడం మానేస్తున్నారు. దీని వలన డీహైడ్రెషన్, మూత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలను విద్యార్థినులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బాలికలు యుక్త వయసులో ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు వ్యక్తిగత పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. సరైన టాయిలెట్స్ లేకపోవడం వల్ల వారు పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు.ముఖ్యంగా రుతుస్రావ సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
దీనివల్ల వారు పాఠశాలలకు గైర్హాజరు అవుతున్నారు. ఇది వారి విద్యాభ్యాసానికి పెద్ద అడ్డంకిగా మారుతుంది.ఈ సమస్యను అమ్మాయిలే కాదు పాఠశాలలో పని చేస్తున్న మహిళ ఉపాధ్యాయులు కూడ ఎదుర్కొంటున్నారు.బాలురకు కూడా ఇదే సమస్య. సరైన మరుగుదొడ్లు లేకపోవడం వల్ల అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది, ఇది పిల్లలందరి ఆరోగ్యాన్నిప్రమాదంలో పడేస్తుంది.పాఠశాలలో అమ్మాయిలు డ్రాప్ ఔట్స్ కావడానికి టాయిలెట్స్ లేకపోవడం కూడ ఒక కారణం.
విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భద్రత, భోజనం,ఆరోగ్యం కల్పించాలి. కానీ ఇవేవి రాష్ట్రంలో పాఠశాలలో అమలు కావడం లేదు అని యూడైస్ నివేదికను చూస్తే అర్ధం అవుతుంది.ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల పిల్లలే ఎక్కువగా చదువుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తే ఈ వర్గాల విద్యార్థులకు కూడ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసినట్లే అవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌళిక సదుపాయాలు లేకపోవడానికి ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ లో సరైన నిధులు కేటాయించకపోవడం కూడ ఒక ప్రధాన కారణం. తాము అధికారంలోకి వస్తే విద్యా రంగానికి బడ్జెట్ లో 15శాతం నిధులు కేటాయిస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7.57శాతం మాత్రమే కేటాయించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఎస్సీ,ఎస్టీ, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేసింది.
విద్యాశాఖకు మంత్రిని కేటాయించకుండా తన దగ్గరే పెట్టుకున్న ముఖ్యమంత్రినే పాఠశాలలో ఉన్న సమస్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తే విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం అయినట్లే అని భావిస్తున్న ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే విద్యారంగంలో ఉన్న పూర్తి స్థాయి సమస్యలు పరిష్కారం అయినట్లుగా ప్రభత్వాలు భావించనప్పుడే పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడైన ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అయినప్పుడు ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులను పిలిచి చర్చలు జరిపిన విధంగానే విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేసే విద్యార్థిసంఘాలతో కూడ ప్రభుత్వాలు చర్చలు జరుపాలి అప్పుడే పాఠశాలలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు పాలక వర్గాలకు తెలిసి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది.
పాఠశాలలో టాయిలెట్స్ లేకపోవడం వలన అమ్మాయిల ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుంది. ఇది చాలా బాధాకరం. ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలలో ఆరోగ్య కరమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. పాఠశాలలో టాయిలెట్స్ సమస్యను పరిష్కరించకపోతే, ఇది మన విద్యావ్యవస్థ పైన తీవ్రమైన ప్రతికులా ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చెయ్యడం అంటే భవిష్యత్తు తరాల ఆరోగ్యం మరియు విద్యను నిర్లక్ష్యం చెయ్యడమే అవుతుంది.విద్యార్థి సంఘాలతో పాటు, విద్యావేత్తలు ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అంది, భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారం కోరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోని రావాల్సిన అవసరం ఉంది.