నిండా మునిగిన తెలంగాణ: ఎకరం సాగునీటికి రూ.11.45లక్షల ఖర్చు

బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకల బాగోతం. షాకింగ్ వాస్తవాలు బయటపెట్టిన శ్వేతపత్రం

Update: 2024-02-18 05:44 GMT
Medigadda

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రంలో ప్రాజెక్టు నిర్మాణ లోపాలతోపాటు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. 2014వ సంవత్సరం నుంచి 2023వరకు గడచిన పదేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై 1.81 లక్షల కోట్లరూపాయలను ఖర్చు చేశారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కేవలం 15.81 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకువచ్చారు. అంటే ఒక ఎకరానికి సాగునీరందించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.11.45 లక్షలు వెచ్చించింది. గతంలో 2014వ సంవత్సరం వరకు కేవలం 54,234 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 57.79 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారు. అంటే ఒక్కో ఎకరానికి కేవలం 93వేల రూపాయలతోనే సాగు నీరు అందించగలిగారని తెలంగాణ నీటిపారుదల రంగంపై విడుదల చేసిన శ్వేత పత్రంలో సర్కారు తెలిపింది.

కుంగిన బ్యారేజీ రోడ్డు...పిల్లర్ పగుళ్లు

మేడిగడ్డ బ్యారేజీ రోడ్డు కుంగిపోయింది. 20వ నంబర్ పిల్లర్ పగుళ్లు ఇవ్వడంతో బ్యారేజి దెబ్బతిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చిచెప్పింది. మేడిగడ్డ బ్యారేజ్ ప్లానింగ్, డిజైన్, నాణ్యత లోపం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు సంబంధించిన సమస్యలతోనే దెబ్బతిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. నిర్మాణంలో నాణ్యత లోపం వల్లనే బ్యారేజీ కదిలి పగుళ్లు వచ్చాయని ఎన్డీఎస్ఏ నిపుణులు తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్ లో లోపాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. 2019-20వ సంవత్సరంలో మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించినప్పటి నుంచి డ్యామ్ అధికారులు సిమెంట్ కాంక్రీట్ బ్లాక్ లు, లాంచింగ్ అప్రాన్లను తనిఖీ చేయలేదని, దీనికితోడు ఆనకట్ట నిర్వహణ లోపాల వల్ల పగుళ్లు వచ్చిందని తేల్చారు.

బ్యారేజీలో నీరు నింపితే ప్రమాదమే...

బ్యారేజీలో ఒక బ్లాక్ లో ఏర్పడిన దుస్థితి వల్ల బ్యారేజీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపనుంది. వర్షాకాలంలోగా బ్యారేజీని తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ తనిఖీలు చేయాలని ఎన్డీఎస్ఏ సూచించింది. దెబ్బతిన్న బ్లాక్ ను పునరుద్ధరించాలని సూచించింది. ప్రస్థుతం రిజర్వాయర్ లో నీరు నింపితే బ్యారేజీ మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.

అన్నారం బ్యారేజీలోనూ లీకేజీలు

మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఒకే విధమైన డిజైన్ తో నిర్మించారని అవి కూడా దెబ్బతినే ప్రమాదముందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు హెచ్చరించారు. ఎన్డీఎస్ఏ బృందం గత ఏడాది నవంబర్ 2వతేదీన సందర్శించి పరిశీలించగా నీరు లీక్ అవుతుందని గుర్తించారు. బ్యారేజీలో నీటి లీకేజీ వల్ల ఇసుక బస్తాలతో రింగ్ బండ్ ఏర్పాటు చేశారని వారు పేర్కొన్నారు. బ్యారేజీలో సీసీ బ్లాక్ లు స్థానభ్రంశం చెందాయని వెల్లడించారు. సీసీ బ్లాక్ ల కింద ఉన్న ఫిల్టర్ కొట్టుకుపోయిందని నిపుణులు నివేదించారు.కాంక్రీట్ క్రీప్ కారణంగా డ్యామ్ లోతులో నిలువు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.

నిర్వహణ పనులేవి? ప్రశ్నించిన విజిలెన్స్

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులు నిర్దేశిత సీక్వెన్షియల్ పద్ధతిలో చేయలేదని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తేల్చారు. బ్లాక్ 7 సంబంధించిన పనులు మెజర్‌మెంట్ బుక్ ప్రకారం చేయలేదని తేలింది. 2019వ సంవత్సరం జూన్ 19వతేదీన ప్రారంభించిన బ్యారేజీని అప్పటి నుంచి ఎలాంటి నిర్వహణ పనులు చేపట్టలేదని విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో ఏర్పడిన కాపర్ డ్యాంతో పాటు షీట్ పైల్స్ ను తొలగించలేదు. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదు.



నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి

బ్యారేజీ పనులు పెండింగులో ఉన్నప్పటికీ, కాంట్రాక్టు ఏజెన్సీకి బ్యాంకు గ్యారంటీలను రామగుండం చీఫ్ ఇంజినీర్ విడుదల చేశారని, అందువల్ల అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సూచించింది. ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్ లు, ఆర్సీసీ నిర్మాణాలను పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. బ్యారేజీ వైఫల్యానికి కారణాలను గుర్తించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది.

ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంచారు... కాగ్ రిపోర్ట్ ఆక్షేపణ

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం కంటే నిర్మాణ వ్యయాన్ని గణనీయంగా పెంచారని కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) తన నివేదికలో ఆక్షేపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.81,911.01 కోట్లు కాగా, నిర్మాణ వ్యయాన్ని 1,47,427.41 కోట్లకు పెంచారు. ప్రాజెక్టు బెనిఫిట్ కాస్ట్ రేషియో కూడా పెంచారు. ప్రాజెక్టుపై ఖర్చు చేసే ప్రతి రూపాయికి 0.52 పైసలు మాత్రమే వస్తుంది. దీంతో ఈ ప్రాజెక్టు లాభదాయకం కాదని కాగ్ తేల్చింది.

కాగ్ అక్షింతలు

తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కారుకు కాగ్ అక్షింతలు వేసింది. పంపులు, మోటార్లు కొనుగోలులో కాంట్రాక్టర్లకు రూ.2,684.73 కోట్ల మేర అనవసర ప్రయోజనం కల్పించారని వెల్లడైంది. ప్రాజెక్టు పనుల మంజూరులో తొందరపాటు చూపించారని, డీపీఆర్ ఆమోదానికి ముందే రూ.25,049.99 కోట్లతో పనులు చేశారు. ఈ ప్రాజెక్టుకు ప్రతి సంవత్సరం కరెంటు ఛార్జీల కింద రూ.10,374.56 కోట్లు అవసరమవుతాయి. అదనంగా వార్షిక నిర్వహణ ఖర్చు రూ. 272.7 కోట్లు. నీటిపారుదల శాఖ వివరణాత్మక భూకంప అధ్యయనాలు నిర్వహించకుండానే రూ.6,126.80 కోట్లతో శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్‌ అతిపెద్ద రిజర్వాయర్‌ను నిర్మించిందని కాగ్ పేర్కొంది.

Tags:    

Similar News