ఖమ్మంలో నామ, రఘురామాల మధ్య బిగ్ ఫైట్
కాంగ్రెస్ కంచు కోట అయిన ఖమ్మం ఖిల్లాలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామ, కాంగ్రెస్ అభ్యర్థి రఘురామాల మధ్య బిగ్ ఫైట్ సాగుతోంది.ఇద్దరూ ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు.
By : The Federal
Update: 2024-05-06 01:23 GMT
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో సిట్టింగ్ బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.బీఆర్‌ఎస్ మరోసారి సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావును బరిలోకి దించగా, కాంగ్రెస్ పార్టీ చివరి క్షణంలో వరంగల్ జిల్లాకు చెందిన బడా పారిశ్రామికవేత్త రామసహాయం రఘురాంరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది.
- భారత రాష్ట్ర సమితి 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం అనంతరం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
- మరో వైపు వామపక్షాల సహాయంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ‘చే’జిక్కించుకోవాలనే నమ్మకంతో ముగ్గురు మంత్రులతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు.
- ఖమ్మంలో ప్రధానంగా అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య బిగ్ ఫైట్ సాగుతుండగా, నియోజకవర్గంలో అంతగా ఉనికి లేని భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.
- కొత్తగూడెం జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రచారానికి ఊపు తీసుకువచ్చారు.
సిట్టింగ్ ఎంపీ నామ అభివృద్ధి నినాదం
ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు రెండు సార్లు ఎంపీగా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేశారు. తాను చేసిన అభివృద్ధి నినాదంతో నామ ఓటర్ల ముందుకు వచ్చారు. మూడో సారి హ్యాట్రిక్ సాధించేందుకు రంగంలోకి దిగిన నామ తన హయాంలో వేల కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి పనులు, భద్రచలం-కొవ్వూరు కొత్త రైల్వేలైన్ నిర్మాణం, జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు తన తండ్రి నామ ముత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో తన సొంత నిధులతో చేసిన సేవా కార్యక్రమాలను ఓటర్లుకు వివరించి చెబుతూ ఖమ్మం ప్రగతి కోసం, ప్రజల పురోగతి కోసం తనలాగా పనిచేసే ఎంపీకి పట్టం కట్టండి అని కో్రుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపు ధీమా
కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన ఖమ్మంలో ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల బలం ఉంది. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. మహబూబాబాద్, వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు. దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రముఖ టాలీవుడ్ నటుడు దగ్గుబాటి వెంకటేష్‌ల వియ్యంకుడు. వెంకటేష్ కుమార్తె ఆశ్రిత రఘురామ్ పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డిని వివాహం చేసుకోగా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె స్వప్ని రఘురామ్ రెండవ కుమారుడు అర్జున్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవడం ఖాయమని ధీమాగా ఉంది.
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు, మంత్రుల బలం
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన సీసీఐ క్లీన్ స్వీప్ చేసింది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆరు స్థానాలను కైవసం చేసుకోగా, సీపీఐపోటీ చేసిన ఏకైక కొత్తగూడెంను గెలుచుకుంది.కాంగ్రెస్, సీపీఐ అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు అయ్యారు. మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మంత్రులు అయ్యారు.
బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని, బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని పొంగులేటి గతంలో కేసీఆర్ కు సవాలు చేశారు. ప్రస్థుతం ఖమ్మం లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతను పొంగులేటి తీసుకున్నారు. అధికారాన్ని కోల్పోయి, పలువురు నేతల ఫిరాయింపులతో వరుస పరాజయాలను చవిచూసిన బీఆర్‌ఎస్ కష్టాల్లో కూరుకుపోతోంది. ఖమ్మంలో ఒక్క బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో నాగేశ్వర్‌రావు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖమ్మం మేయర్ పి.నీరజ, సర్పంచ్‌లతో సహా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు.
ఉనికి లేని బీజేపీ
ఖమ్మం నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి ఉనికి లేదు. ఆ పార్టీకి ఒక్క సర్పంచ్ కూడా లేరు. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఏడు సెగ్మెంట్లలో బీజేపీ, దాని మిత్రపక్షమైన జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ ట్రెండ్ భిన్నంగా ఉంటుందని బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు చెబుతున్నారు. మోడీ హవాతో తాను పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తానని పేర్కొంటున్నారు.
నామకు గతంలో 1.68 లక్షల ఓట్ల మెజారిటీ
2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన నామ నాగేశ్వరరావు 1.68 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరిపై విజయం సాధించారు. నామాకు 5,67,459 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి వాసుదేవరావు కేవలం 20,488 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.
ఖమ్మం సీటు కాంగ్రెస్‌కు కంచుకోట
1952వ సంవత్సరంలో ఖమ్మం నియోజకవర్గం ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. పీడీఎఫ్, సీపీఐలు గెలుపొందిన తొలి రెండు ఎన్నికల్లో మినహా ఇప్పటి వరకు 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, ఆయన సోదరుడు జె.కొండల్‌రావు తలా రెండుసార్లు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి నాదెండ భాస్కర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి పీవీ రంగయ్యనాయుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక్కోసారి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో రేణుకా చౌదరిని నామా నాగేశ్వరరావు ఓడించడంతో ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ తొలి విజయం సాధించింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పలు సాంస్కృతిక,సామాజిక సారూప్యతలను పంచుకునే ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాలో గెల్చిన పొంగులేటి తరువాత బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు.
తెలుగు తమ్ముళ్ల ఓట్ల వేటలో నామ
ఖమ్మం జనాభాలో గణనీయమైన భాగం కమ్మ సామాజిక వర్గం ఉన్నారు. 2022లో ఖమ్మంలో జరిగే బహిరంగ సభతో తెలంగాణలో టీడీపీని పునరుజ్జీవింపజేయాలని టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు కానీ, ఆయన ప్రణాళికలు విఫలం కావడంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయలేదు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ కమ్మ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడుఎన్.టి. రామారావు విగ్రహాన్ని తానే పార్లమెంటులో, జిల్లా వ్యాప్తంగా పలు విగ్రహాలు పెట్టించాని నామ చెబుతున్నారు. ఏకంగా ఖమ్మంలో టీడీపీ కార్యాలయానికి నామ వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి తెలుగుతమ్ముళ్ల మద్ధతు కోరారు.
కమ్మ ఓటర్లు ఎటువైపు
కమ్మ సామాజికవర్గానికి చెందిన నామ నాగేశ్వరరావు తమ వర్గ ఓట్లను పొందాలని యత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కమ్మ సంఘం మద్దతు ఇచ్చినందున,వారి మద్దతు కొనసాగుతుందని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో పాటు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అధికంగా ఉన్న ఎస్సీ,ఎస్టీ ఓటర్లు, ముస్లిం మైనారిటీలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు.
మొత్తం మీద ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో నామ, రఘురామాల మధ్య బిగ్ ఫైట్ సాగుతోంది. ఈ పోరులో ఎవరికి వారు ముమ్మర ప్రచారంతో ఖమ్మం జిల్లాను ఉష్ణోగ్రతల్లోనే కాకుండా ఎన్నికల ప్రచారంతో హీటెక్కిస్తున్నారు. నువ్వా? నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఎవరు ఖమ్మం ఖిల్లా విజేత అవుతారనేది జూన్ 4వతేదీ ఓట్లలెక్కింపులో తేలనుంది.