ఓఎస్డీని అరెస్టుచేయకుండా పోలీసులను అడ్డుకున్న మంత్రి కొండా సురేఖ
పోలీసులను మంత్రి అడ్డుకోవటం తెలంగాణ(Telangana)లో సంచలనంగా మారింది.
మాజీ ఓఎస్డీ సుమంత్ ను అరెస్టుచేయటానికి గురువారం ఉదయం వెళ్ళిన పోలీసులను దేవాదాయ, అటవీశాఖల మంత్రి కొండాసురేఖ(Konda Surekha) అడ్డుకోవటం సంచలనంగా మారింది. పోలీసులను మంత్రి అడ్డుకోవటం తెలంగాణ(Telangana)లో సంచలనంగా మారింది. విషయం ఏమిటంటే మంత్రిదగ్గర సుమంత్ ఓఎస్డీగా పనిచేసేవాడు. ఓఎస్డీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగి. మంత్రి పేషీలో ఓఎస్డీగా చేరిన దగ్గర నుండి తనపై అనేక అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. అలాగే సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy)తో కొండాసురేఖకు మొదలైన వివాదానికి కూడా ఓఎస్డీయే కారణమని సమాచారం.
ఈనేపధ్యంలోనే ఓఎస్డీపై ఇరిగేషన్ శాఖ అధికారులు బెదిరింపులు, డబ్బుల వసూళ్ళ ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సుమంత్ ను ఉద్యోగంలో నుండి తొలగించింది. ఎప్పుడైతే సుమంత్ ను బోర్డు ఉద్యోగంలో నుండి తొలగించిందో వెంటనే పోలీసులు సుమంత్ పై కేసులు నమోదుచేశారు. ఫిర్యాదు ఆధారంగా సుమంత్ ను అరెస్టుచేయటానికి పోలీసులు హైదరాబాద్ లోని కొండా ఇంటికి వెళ్ళారు. అయితే సుమంత్ ను అరెస్టుచేయకుండా మంత్రితో పాటు ఆమె కూతురు సుస్మిత అడ్డుకున్నారు. ఎట్టి పరిస్ధితిలోను సుమంత్ ను అరెస్టుచేసేందుకు వీల్లేదని మంత్రితో పాటు కూతురు పోలీసులతో తెగేసిచెప్పారు. సుమంత్ అరెస్టుకు సంబంధించిన ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ కాపీని చూపాల్సిందిగా సుస్మిత పోలీసులను నిలదీశారు.
ఎఫ్ఐఆర్ కాపీని, నోటీసును చూపకుండా సుమంత్ ను అరెస్టుచేసేందుకు లేదని పోలీసులకే సుస్మిత వార్నింగ్ ఇచ్చారు. మఫ్టీలో వచ్చినా పోలీసులకు తాను చాలా మర్యాదగా మాట్లాడుతున్నట్లు వార్నింగ్ కు కూడా ఇచ్చారు. సుమంత్ పై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు విషయమై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడినపుడు తాను ఎవరిపైనా ఫిర్యాదుచేయలేదని చెప్పినట్లు సుస్మిత చెప్పారు. ఎవరు ఫిర్యాదుచేశారో చెప్పాలని, ఆరోపణల కాపీ, ఎఫ్ఐఆర్ చూపనిదే సుమంత్ ను అరెస్టుచేసేందుకు లేదని మంత్రి కూతురు పోలీసులను తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా బీసీ అయిన కారణంగా తమను రెడ్లంతా కలిసి వేధిస్తున్నారంటూ సామాజికకోణాన్ని కూడా తెరపైకి తెచ్చారు. కొండాసురేఖ ఓఎస్డీ అరెస్టు వెనుక కచ్చితంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హస్తంకూడా ఉందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మొత్తానికి పోలీసులు చూస్తుండగానే సుమంత్ ను కారులో కూర్చోబెట్టుకుని కొండాసురేఖ హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళిపోయారు. అయితే తర్వాత వరంగల్ పోలీసులు సుమంత్ ను వరంగల్ లో అరెస్టుచేశారనే ప్రచారం మొదలైంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలీదు.
కొండా సురేఖ కేంద్రంగా మొదలైన తాజా పరిణామాలు పార్టీతో పాటు ప్రభుత్వంలో సంచలనంగా మారింది. తనదగ్గర పనిచేసిన ఓఎస్డీ అరెస్టు కాకుండా పోలీసులను మంత్రే అడ్డుకోవటం గతంలో ఎప్పుడూ జరిగినట్లు లేదు. తాజా పరిణామాలపై రేవంత్ ఎలా స్పందిస్తారు ? చివరకు పోలీసులు ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది.