తెలుగింటి తొలి గాయని బాలసరస్వతి కన్నుమూత
ఒక నాటి ప్రఖ్యాత నేపథ్య గాయని రావు బాలసరస్వతీ దేవి (97) అక్టోబర్ 15న హైదరాబాద్ లో చనిపోయారు. ఈ సందర్భంగా గతంలో రాఘవ చేసిన ఇంటర్వ్యూ...
తెలుగులో తొలి నేపథ్య గాయని అయిన రావు బాలసరత్వతి(97) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తను కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఆమె తనువు చాలించారని వారు చెప్పారు. ఆమె మరణంపై సినీ నటులు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ప్రగాఢ సంతాపం తెలిపారు. బాలసరస్వతి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.
‘‘దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగా, తెలుగు సినిమా రంగానికి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’’ అని రేవంత్ పేర్కొన్నారు.
అసలెవరీ బాలసరస్వతి..
29 ఆగస్టు 1928న మద్రాసులో పార్థసారథి, విశాలక్షి దంపతులకు జన్మించారు బాలసరస్వతి. ఆమె పెద్దగా చదువుకోలేదు. వీరికి గుంటూరులో రత్న మహల్ అని సినిమా థియేటర్ ఉండేది. దాంతో ఆమె తాతయ్య మినహా మిగిలిన వారంతా మద్రాసు నుంచి గుంటూరుకు వచ్చేశారు. గుంటూరులోనే ఆమె అలత్తూర్ సుబ్బయ్య దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఆమె అభ్యాసం మూడు సంవత్సరాలు సాగింది. ఆ తర్వాత ఖేల్కర్, వసంత దేశాయ్ దగ్గర హిందుస్తానీ సంగీతం, కే పిచ్చుమణి దగ్గర వీణ, డానియల్ దగ్గర పియానో వాయిద్యాలను కూడా నేర్చుకున్నారు. ఆమె పాటలు పాడటం ఆరవయేట నుంచే ప్రారంభించారు. ఆరేళ్ల వయసులోనే హెచ్ఎంవీ కంపెనీ ద్వారా ‘‘నమస్తే నా ప్రాణనాథ, ఆకలి సహింపగజాల, పరమపురుష పరంధామ’’ వంటి మరెన్నో పాటలను ఆలపించారు.
ఆ తర్వాత సీ పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘సతీఅనసూయ’ అనే చిన్న పిల్లల సినిమాలో ఆమె గంగ పాత్రను పోషించారు. అదే సినిమాలో ఒక పాట పాడి సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఆతర్వాత 1944లో ఆమె కోలంక జమీందారీకి చెందిన రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్నారు. ప్లేబ్యాక్ సింగర్‌గానే కెరీర్‌ను కొనసాగించారు. ఆమె తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సహా పలు భాషల్లో మొత్తం 2వేల వరకు పాటలు పాడారు. ఆమెను మహాగాయినిగా చూడాలన్నది ఆమె తండ్రి కల. అందుకే చిన్న వయసు నుంచే ఆమెకు పట్టుబట్టి సంగీతం నేర్పించారు. అనుకున్నట్లుగా ఆమె అద్భుత నేపథ్యగాయినిగా నిలిచారు.
రేడియో ద్వారా పరిచయం
బాలసరత్వతి సినీ రంగ ప్రవేశానికి ముందే రేడియో ద్వారా తెలుగువారికి పరిచయం అయ్యారు. 1944లో మద్రాసు ఆకాశవాణి రేడియో కేంద్రంలో, 1948లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ఈమె పనిచేశారు. ఆ రేడియోలో వచ్చే సంగీత కార్యక్రమంతో ఆమె కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ప్రసిద్ధ సంగీత దర్శకులు ఎస్.రాజేశ్వరరావుగారితో కలిసి 1940-50 మధ్య కాలంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, ఆరుద్ర, ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావులు రచించిన ఎన్నో గేయాలు రేడియోలో పాడారు.