రేవంత్ కు బీసీ రిజర్వేషన్ల సెగ పెరిగిపోతోందా ?
బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతుగా ఎక్కడికక్కడ బీసీలు ఉద్యమించాలని ప్లాన్ చేస్తున్నారు
ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డికి బీసీ రిజర్వేషన్ల సెగ బాగా తగిలేట్లుంది. స్ధానికసంస్ధల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లిస్తు ప్రభుత్వం జారీచేసిన జీవో ఎంఎస్ 9 అమలుపై హైకోర్టు స్టే విధించింది. అప్పటివరకు రిజర్వేషన్ల అమలుపై పెద్దగా స్పందించని బీసీ సంఘాలు(BC Reservations) తర్వాత నుండి తీవ్రంగా రియాక్టవుతున్నాయి. 33 బీసీ సంఘాలు కలిసి రిజర్వేషన్ పోరాటానికి జేఏసీగా ఏర్పాటయ్యాయి. ఈ జేఏసీకి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఛైర్మన్ గా నియమితులయ్యారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతుగా ఎక్కడికక్కడ బీసీలు ఉద్యమించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే బీసీ మేథావుల ఫోరం కూడా బీసీ రిజర్వేషన్ సాధన సమితిగా మారింది.
వివిధపార్టీల్లోని బీసీ ప్రజాప్రతినిధులు అందరు బయటకువచ్చి రిజర్వేషన్ల సాధనకోసం పార్టీలకు అతీతంగా పోరాటంలోకి రావాలని జేఏసీ, సాధన సమితి పిలుపిచ్చాయి. ఈనెల 18వ తేదీన జరగబోయే తెలంగాణ బంద్ ను విజయవంతంచేయటానికి బీసీ మేథావుల ఫోరం, జేఏసీతో పాటు అనేక సంఘాలు కృషిచేస్తున్నాయి. రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించటంలో అన్నీపార్టీలను బీసీసంఘాలు తప్పుపడుతున్నాయి. 18వ తేదీ బంద్ విజయవంతం అవటానికి రాష్ట్రంలోని అన్నీ గ్రామాల స్ధాయిల్లో చైతన్యం తీసుకురావాలని జేఏసీ నేతలు పిలుపిచ్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం గతంలో జరిగిన మిలియన్ మార్చ్, తెలంగాణ ఉద్యమం లాంటివే ఇపుడు రిజర్వేషన్ల సాధన కోసం జరగాలని బీసీ మేథావులంటున్నారు.
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేసిన రెడ్డి జాగృతి బుట్టెంగారి మాధవరెడ్డిని పిలిపించుకుని రేవంత్ ఎందుకు మాట్లాడలేదని బీసీ సంఘాల నేతలు నిలదీస్తున్నారు. ఒకవైపు రిజర్వేషన్లకు జీవో జారీచేసి మరోవైపు బుట్టెంగారితో కోర్టులో కేసు వేయించింది రేవంతే అని చాలామంది బీసీ నేతలు మండిపోతున్నారు. బుట్టెంగారి కేసు వెనుక రేవంత్ లేకపోతే తన మంత్రులను పిలిపించి కేసు వాపసు తీసుకునేట్లుగా ముఖ్యమంత్రి ఎందుకు ప్రయత్నించలేదని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీలను రేవంత్ ప్రభుత్వం మోసంచేస్తోందని సోషల్ మీడియాలో చాలామంది ధ్వజమెత్తుతున్నారు.
కొత్తగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిన ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న కూడా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పదేపదే ఆరోపణలతో దాడులు చేస్తున్నాడు. బీసీ సంఘాల్లోని ప్రముఖుల్లో చాలామందికి తీన్మార్ మల్లన్న వ్యవహారశైలి నచ్చకపోయినా ప్రస్తుత వాతావరణంలో ఎంఎల్సీకి మద్దతివ్వక తప్పటంలేదు. 18వ తేదీ బంద్ ను విజయవంతం చేయటంలో భాగంగా బీసీ సంఘాల్లోని చాలామంది నేతలు తమ ఊర్లకు వెళ్ళి గ్రామస్ధాయిలో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు ఏస్ధాయిలో జరుగుతున్నాయంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా బీసీ సంఘాలు దేనికవే రాష్ట్రంలోని అన్నీమండలాలో తిరుగుతు 18వ తేదీ బంద్ విజయవంతం చేయాలని బీసీల్లో చైతన్యం తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాయి.
నిజానికి బీసీ అనేది పెద్ద విస్తృతపదం. బీసీ అంటే సుమారు 140 ఉపకులాల సమాహారం. వీటిల్లో కూడా యాదవులు, గౌడ్లు, మున్నూరుకాపులు, పద్మశాలీలు, ముదిరాజులే అత్యధిక ఫలాలు అందుకున్నారనే ఆరోపణలు చాలాకాలంగా వినబడుతున్నాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అంటే కేవలం ఐదు ఉపకులాలకు మాత్రమే పదవులు దక్కితే చాలా మిగిలిన 135 ఉపకులాల మాటేమిటి ? అనే ప్రశ్న చాలాకాలంగా ఎదురవుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు బీసీ మేథావుల్లోనే లేరు. అయితే ముందు బీసీలకు రిజర్వేషన్లు వర్తింపచేసుకుంటే తర్వాత ఈ 42శాతంలో ఎవరికి ఎంత వాటా దక్కుతుందనే విషయాన్ని ఆలోచించుకుకోవచ్చని చెబుతున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు అయితే బీసీ వాదన తెలంగాణలో చాలాబలంగా వినబడుతున్నదనే చెప్పాలి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించాలంటే ప్రభుత్వం వల్లమాత్రమే కాదని యావత్ బీసీ సమాజం కదిలితేనే సాధ్యమవుతుందని మేథావులు పదేపదే చెబుతున్నారు.
ప్రత్యేక తెలంగాణ సాధనలో తెలంగాణలోని అనేక వర్గాలు రోడ్లపైకి వచ్చి కదంతొక్కినట్లే ఇపుడు బీసీ రిజర్వేషన్ల సాధనకోసం కూడా అలాగే జరగాలని పెద్దఎత్తున బీసీ సంఘాల నేతలు పిలుపిస్తున్నారు. ఇందులో భాగంగానే ముందుగా 18 బంద్ విజయవంతం చేసేందుకు బీసీ సంఘాలు గట్టిగా కృషిచేస్తున్నాయి. బీసీల్లో ఐక్యత సాధించటంలో భాగంగా వివిధ పార్టీల్లోని బీసీ ప్రజాప్రతినిధులంతా పార్టీలను వదిలేసి బయటకువచ్చి బీసీ జేఏసీకి మద్దతు పలకాలని సంఘాల నేతలు ఒత్తిడి మొదలుపెట్టారు.
బంద్ విజయవంతానికి కేవలం బీసీ సంఘాలు, బీసీలు మాత్రమే పనిచేయటం కాకుండా వివిధ రాజకీయపార్టీలను కూడా మద్దతు కోరుతున్నారు. ఇప్పటికే బంద్ కు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్, బీజేపీ మద్దతు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీలోని ఉపకులాలన్నీ ఏకం అయినపుడే రిజర్వేషన్ల సాధన సాధ్యమవుతుందని సోషల్ మీడియాలో ఇప్పటికే చాలామంది సూచిస్తున్నారు.
కృష్ణయ్యపై వ్యతిరేకత
బీసీరిజర్వేషన్ల జేఏసీకి ఛైర్మన్ గా ఎంపికైన ఆర్ కృష్ణయ్యపై బీసీల్లోని కొందరు నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. ఎందుకంటే కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడే కాకుండా బీజేపీ రాజ్యసభ ఎంపీ కూడా. అలాంటపుడు నరేంద్రమోదీ అపాయిట్మెంట్ కోసం బీజేపీ కేంద్రమంత్రులు+ఆరుగురు ఎంపీలతో ఎందుకు ప్రయత్నించటంలేదని సోషల్ మీడియాలో కొందరు నిలదీస్తున్నారు. రేవంత్ అపాయిట్మెంట్ అడిగితే మోదీ ఇవ్వనపుడు కృష్ణయ్య అయినా ప్రధాని అపాయిట్మెంట్ తీసుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఎంపీ అయ్యుండి కేంద్రంలో రిజర్వేషన్ల సాధనకోసం మాట్లాడకుండా తెలంగాణ బంద్ కు పిలుపివ్వటం ఏమిటని కొందరు బీసీ సంఘాల నేతలు ఆశ్చర్యపోతున్నారు. రిజర్వేషన్లకు మద్దతుగా ఇప్పటివరకు బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీల సమావేశాన్ని పార్టీపరంగా కూడా కృష్ణయ్య నిర్వహించకపోవటాన్ని పలువురు బీసీ నేతలు ఎత్తిచూపుతున్నారు. మొత్తానికి బీసీ వాదనకు బంద్ కు మద్దతుగా సోషల్ మీడియాలో బలమైన ప్రచారం జరుగుతున్నది. చివరకు ఏమవుతుందో చూడాలి.