ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ అంత్యక్రియలు పూర్తి

కుటుంబసభ్యులు మెత్తబడి పోస్టుమార్టమ్ కు అంగీకరించారు

Update: 2025-10-15 11:14 GMT
IPS Officer Puran kumar

ఈనెల 7వ తేదీన అనుమానాస్పద స్ధితిలో మరణించిన ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ అంత్యక్రియలు బుధవారం పూర్తయ్యాయి. హర్యానా(Haryana)లో రోహతక్ రీజియన్ ఐజీగా పనిచేసిన పూరణ్(IPS Officer Puran kumar) మరణం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈనెల 7వ తేదీన తన అపార్ట్ మెంట్ కింద బేస్ మెంట్లోని ఒక కుర్చీలో తుపాకితో కాల్చుకుని పూరణ్(Puran Suicide) ఆత్మహత్య చేసుకున్న విషయం కలకలంరేపింది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఈ ఐపీఎస్ అధికారిని కొందరు సహచరులతో పాటు పై స్ధాయిలోని మరికొందరు ఉన్నతాధికారులు కులంపేరుతో బాగా వేధించినట్లు ఆత్మహత్య తర్వాత బయటపడ్డ లేఖలో ఉన్నది. తనను వేధించిన సహచరుల, ఉన్నతాధికారులు ఎనిమిదిమంది పేర్లను కూడా ఐపీఎస్ అధికారి లేఖలో ప్రస్తావించారు.

ఐపీఎస్ అధికారి ఆత్మహత్య హర్యానాలో పెద్ద వివాదంగా మారింది. పూరణ్ ఆత్మహత్య సమయంలో ఐపీఎస్ అధికారి భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారి అమ్నీత్ పీ కుమార్ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీతో జపాన్ యాత్రలో ఉన్నారు. విషయం తెలియగానే వెంటనే అమ్నీత్ హర్యానాకు తిరిగి వచ్చేశారు. అమ్నీత్ ఇంటికి వచ్చిన తర్వాత పూరణ్ డెబ్ బాడీని పోలీసులు పోస్టుమార్టమ్ కు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే భార్యా, పిల్లలు అడ్డుకున్నారు. పూరణ్ ను వేధింపులకు గురిచేసిన అందరిపైనా కేసులు నమోదుచేసి అరెస్టుచేసేంతవరకు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించేందుకు లేదని, అంత్యక్రియలు జరిపేందుకు అంగీకరించమని కుటుంబసభ్యులు తెగేసిచెప్పారు. దాంతో గడచిన వారంరోజులుగా పూరణ్ మృతదేహనికి పోస్టుమార్టమ్ జరగలేదు. సహచరుల్లో ఒకరిపై ప్రభుత్వం కేసు నమోదుచేసి బదిలీచేసిందంతే.

మృతదేహానికి పోస్టుమార్టమ్ జరిపేందుకు అభ్యంతరాలు చెబుతున్న పూరణ్ కుటుంబసభ్యులపై పోలీసులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు అమ్నీత్ కు నోటీసులు జారీచేసింది. పోస్టుమార్టమ్ కు అంగీకరించాలని లేకపోతే చాలా సమస్యలు వస్తాయని హెచ్చరించింది. ఇదేసమయంలో ప్రభుత్వం కూడా పూరణ్ ఆత్మహత్యకు సంబందించి విచారణ మొదలుపెట్టింది. దాంతో కుటుంబసభ్యులు మెత్తబడి పోస్టుమార్టమ్ కు అంగీకరించారు. చివరకు పోస్టుమార్టమ్ అయిపోయిన తర్వాత బుధవారం మధ్యాహ్నం రోహతక్ లో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

పూరణ్ నేపధ్యం

ఏపీకి చెందిన పూరణ్ హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటిలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదివారు. 1973లో పుట్టిన పూరణ్ 2001లో ఐపీఎస్ అధికారి అయ్యారు. హర్యానాలోని అంబాలా, రోహతక్ రీజియన్లకు ఐజీగా పనిచేశారు. చనిపోయేనాటికి సునరియా లోని పోలీసు శిక్షణా కేంద్రంలో ఐజీగా పనిచేస్తున్నారు. పూరణ్ గతంలో రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్(రా)లో కూడా పనిచేశారు. అమ్నీత్ ను యూపీఎస్సీ శిక్షణలో కలుసుకున్నారు. ఇద్దరిదీ ప్రేమ వివాహం. అమ్నీత్ కూడా 2001 ఐఏఎస్ అధికారిణి.

అమ్నీత్ అరెస్టుకు డిమాండ్

పూరణ్ ఆత్మహత్య వ్యవహారం ఇలాగుండగా రోహతక్ ఏఎసై సందీప్ కుమార్ కూడా మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. సందీప్ మరణానికి పూరణ్ కుమార్ భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారి అమ్నీత్ పీ కుమారే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అమ్నీత్ పై కేసు నమోదుచేసి వెంటనే అరెస్టుచేయాలని సందీప్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లంచం తీసుకున్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి గన్ మెన్ ఇటీవలే అరెస్టయ్యాడు. ఈ అరెస్టుకు సంబంధించి సందీప్ ను హింసించారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తనను వేధిస్తున్నట్లు సందీప్ తమతో చెప్పినట్లు కుటుంబసభ్యులు ఆవేధనతో చెప్పారు. ఒకవైపు పూరణ్ ఆత్మహత్య, తర్వాత పరిణామాలు సంచలనంగా మారితే తాజాగా సందీప్ ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

Tags:    

Similar News