అక్షరాస్యతలో తెలంగాణ దేశ సగటు కంటే వెనుకబడి ఉంది: సెస్ రిపోర్ట్

రాష్ట్రం విద్యలో సమ్మిళిత విధానాలు రూపొందించాలి అంటున్న విద్యావేత్తలు

Update: 2025-12-10 17:11 GMT

రాష్ట్రంలో 41 యూనివర్సిటీలు వాటికి అనుబంధంగా 2,700 ఉన్నత విద్యాసంస్థలు వున్నాయి. అయితే యివి ప్రైవేట్ రంగంలో అందునా హైదరాబాద్ చుట్టు ప్రక్కల వున్నాయి. దీని వలన రాష్ట్రంలో ఉన్నత విద్యలో రాష్ట్ర స్థూల నమోదు నిష్పత్తి (gross enrolment ratio) 40 శాతం (2020-21) వున్నా విద్యారంగంలో అనేక సమస్యలు వున్నాయి.

ఈ పరిస్థితిలో ప్రాంతాల మధ్యన అసమానతలు వున్నాయని సెస్ (Centre for Economic and Social Studies) నిర్వహించిన “ఉన్నత విద్యలో తెలంగాణ-వాస్తవాలు గణాంకాలు” (Higher Education in Telangana- Facts and Figures) రిపోర్ట్ పై జరిగిన చర్చలో విద్యావేత్తలు పేర్కొన్నారు. అక్షరాస్యతలో 20వ శతాబ్దం లో కేవలం మూడు శాతం వున్న హైదరాబాద్ 1951 నాటికి కూడా 12 శాతమే అక్షరాస్యులు వున్నారు. తెలంగాణలో ని చాలా జిల్లాలు ఎనిమిది శాతం కంటే తక్కువ అక్షరాశ్యత కలిగి వున్నాయి. వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం 1980, 1990 ల నుండి విద్యలో ముందడుగు వేసి 21 వ శతాబ్దంలో అడుగుపెట్టింది.

అఖిల భారత ఉన్నత విద్యా సర్వే 2025 డైరెక్టరీ ప్రకారం రాష్ట్రంలో 2,200 ఉన్నత కాలేజీలు, 500 విడి కాలేజీలు వున్నాయి. ఇందులో 1,000 సాధారణ డిగ్రీ కాలేజీలు మిగిలినవి వృత్తి విద్యా కోర్సుల కాలేజీలు.

ప్రతి లక్ష మంది కాలేజీ విద్యార్థులకు సరాసరి అందుబాటులో వుండే ఉన్నత విద్యా సంస్థలలో రాష్ట్రం మూడవ స్థానం లో వుంది. కర్ణాటక, పుదుచ్చేరి మొదటి రెండు స్థానాల్లో వున్నాయి.

అయితే 2023-24 నాటికి ఏడు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో అక్షరాశ్యతా జాతీయ సగటు 81 శాతం. తెలంగాణలో 77 శాతం మాత్రమే. ప్రతి నలుగురిలో ఒకరు నిరక్షరాస్యులే. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు విద్యపైన తగినంత ఖర్చు చేయకపోవడమే. ఉమ్మడి రాష్ట్రం లో విద్య పైన ఖర్చు 15 శాతం నుండి రాష్ట్రం ఏర్పడిన తరువాత 6 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వల్పంగా పెరిగి 7.6 శాతానికి చేరింది. విద్యపై రాష్ట్రాలు సరాసరి తమ జీడీపీలో మూడు శాతం ఖర్చు పెడుతుండగా తెలంగాణ కేవలం రెండు శాతమే పెడుతోంది. బడ్జెట్లో రాష్ట్రాలు సరాసరి 20 శాతం ఖర్చుచేస్తుండగా తెలంగాణా 15 శాతం కంటే తక్కువ కేటాయిస్తోంది. విద్యలో ప్రైవేట్ పాత్ర పెరిగి దాదాపు 80 నుండి 90 శాతానికి చేరింది. దీని మూలంగా కులాల, ప్రాంతాల మధ్యన అసమానతలు పెరుగుతాయని సెస్ (Centre for Economic and Social Studies) చేసిన అధ్యయనం తేల్చింది. రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థలలో ఎక్కువ భాగం హైదరాబాద్ చుట్టు ప్రక్కనే వున్నాయని, సెస్ ప్రొఫెసర్ వెంకటనారాయణ మోతుకూరి, సెస్ డైరెక్టర్ గా బాధ్యత వహిస్తున్న ఈ. రేవతి తమ రిపోర్ట్లో బయట పెట్టారు.

సదస్సు ముఖ్య అతిధి, సెస్ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ యూజీసీ ఛైర్మన్ సుఖదేయో థోరట్ నేటికీ దేశం 1960లలో కొఠారి కమీషన్ చెప్పిన జీడీపీ లో ఆరు శాతం కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇందులో నాలుగు శాతం ప్రాథమిక విద్యకు, రెండు శాతం ఉన్నత విద్యకు యివ్వాలని కమీషన్ చెప్పింది. ఆ కేటాయింపు శాతం 1980 ల వరకే వర్తిస్తుందని చెప్పారు. ఈ పరిస్థితులకు మూల కారణం విద్యకు నిధులు కేటాయించకపోవటమే. ఉన్నత విద్యలోకి విద్యార్థులు రాకపోవటానికి కారణాలను ప్రాథమిక, ప్రాథమికోన్నతలో వెతకాలి. దేశానికి నిధుల కొరత లేదు. విధానాలు రూపొందించే నాయకులే సమస్యకు మూల కారణం. ప్రైవేట్ సంస్థలను వాళ్ళే నడుపుతున్నారు. ఈ విధానాల పైన విమర్శలను వాళ్ళు అందుకే పరిగణలోకి తీసుకోరు. ఎస్టీలకు సబ్ ప్లాన్లు వున్న అవి అమలు కావటం లేదు. ముస్లింలు ఉన్నత విద్యకు రాకుండా స్వయం ఉపాధి వైపే మొగ్గుతున్నారు. దీనికి కారణాలు చూడాల్సివుంది. ఉద్యోగాల కల్పనలో వారి పట్ల వివక్ష కారణమా అనే అధ్యయనం జరగాలి. మహిళలు విద్యలో ముందుకు వస్తున్నా నేటికీ వాళ్ళను ఇంటి పనిలో పెట్టడానికి లేదా వాళ్ళకు పెళ్లి చేయడానికి కుటుంబాలు మొగ్గుచూపుతున్నాయి. కుటుంబాలు త్వరగా పెళ్లి చేయకుండా నివారించటానికి చదువు వైపు మొగ్గుచూపటానికి కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేయాలి,” అని చెప్పారు.

యూనివర్సిటీలలో అధ్యాపకులు లేకపోవటం, మౌలిక సదుపాయాల లేమి, డిజిటల్ సౌకర్యాలు లేకపోవటం విద్యలో మనం వెనుకబడతానికి దారితీస్తోంది. పరిశోధన జరిగితే బోధన మెరుగవుతుంది. కానీ నిధులు లేవు. స్కాలర్షిప్ లు ఇవ్వటం లో కేంద్రం రాష్ట్రం రెండు నిర్లక్ష్యంగా వున్నాయి. విద్యలో నాణ్యత సమస్యే. రాష్ట్రాలు వాళ్ల విద్యాసంస్థలను కేరళతో పోల్చుకోవాలి. యూజీసీ 40 శాతం విద్యను ఆన్లైన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. పేద విద్యార్థులు నష్టపోకుండా కాలేజీలలోనే ఈ సౌకర్యం వుండాలి. చాలా రాష్ట్రాలు విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బంధి నియామకాలు ఆపివేశాయి. 70 నుండి 80 శాతం పోస్టులు భర్తీ చేయలేదు, అన్నారు.

దేశంలో విద్యలో బ్రహ్మణీకరణ జరుగుతోంది. యిది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఆర్టికల్ 28 ప్రకారం ఒకే మత ఫిలాసఫీ విద్యలో భాగంగా చెప్పడం నిషిద్దం. గీత, మనుస్మృతి, పురాణాలు, శంకరాచార్యుల గురించి చెప్తున్నారు. ఈ రకమైన విద్య అందుకున్న విద్యార్థుల నైతిక విలువలు వేరుగా వుంటాయి. మతం గురించి ఒక డిపార్ట్మెంట్ పెట్టి చదవచ్చు. కానీ మత విద్యను యివ్వరాదు. ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు రాసిన పుస్తకాలను పాఠ్య ప్రణాళికలో చేర్చారు. బెనారస్ యూనివర్సిటీ లో గీత పైన డిగ్రీ ప్రారంభించారు, అని ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న 2,000 కాలేజీలలో 150 కూడా ప్రభుత్వ రంగంలో లేవు. సుప్రీం కోర్టు ప్రైవేట్ విద్యాలయాలను సమీక్షించమని ప్రభుత్వానికి చెప్పింది. ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలు లేవు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా అసమానతలు వున్నాయి. వెనుకబడిన ప్రాంతాల వారికి విద్యను ఎలా అందుబాటులోకి తేవాలి అనేది ఒక సవాలుగా వుంది, అని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ లో విజిటింగ్ ప్రొఫెసర్ జంధ్యాల బి. జి. తిలక్ అన్నారు.

“గడిచిన 20 ఏళ్లలో విద్యకు బాగా ప్రాధాన్యత పెరిగింది అమ్మాయిలు యిదివరకు ఎన్నడూ లేని స్థాయిలో చదువుకుంటున్నారు. రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టి, బీసీలు, అమ్మాయిలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం ఆహ్వానించాల్సిన విషయమే. విధ్యార్థులు పట్టణాలకు వచ్చి ఉన్నత విద్య కోసం చాలా త్యాగాలు చేస్తున్నారు. చదువుతూ పార్ట్ టైమ్ పనులు చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు బయట వుండి బాడుగ చెల్లించలేక అక్కడ అనధికారికంగా ఉంటున్నారు. వాళ్ల పరిస్థితిని అధ్యయనం చేయాలి. విద్య ప్రయివేటీకరణ ప్రజాస్వామ్య వ్యతిరేకం, వివక్ష పూరితం, పేదలకు వ్యతిరేకం. ఈ సంవత్సరం హైదరాబాద్ లో 70 శాతం పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో చేరారు. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యానేజ్మెంట్ (STEM) రంగాలలో కూడా విద్యార్థులు తగ్గారు. ప్రైవేట్ రంగం చదువుకున్న వాళ్ళకు జాబ్స్ కల్పించలేకపోతోంది. ప్రభుత్వ పాత్ర పెరగాల్సిన అవసరం వుంది,” అని మాజీ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ (National Commission for Protection of Child rights) కమిషన్ ఛైర్మన్ శాంతా సిన్హా అన్నారు.

ప్రైవేట్ రంగంలో లాభాపేక్ష లేకుండా దాతలు విద్యాసంస్థలు నడపచ్చు. ఐరోపా లో చర్చి, దాతలు విద్యాసంస్థలు పెట్టచ్చు కానీ వాటి పాఠ్య ప్రణాళిక మొత్తం ప్రభుత్వమే యిస్తుంది, అని చెప్పారు.

సమావేశం లో సెస్ (CESS) డైరెక్టర్ ఈ. రేవతి రాష్ట్రం లో ఉన్న నిర్దిష్ట పరిస్థితి పై మరిన్ని అధ్యయనాలు చేస్తామని చెప్పారు. సమస్యలు అందరికీ తెలుసు వాటికి పరిష్కారాలు వెతకటానికి అందరితో ఒక రౌండ్ టేబల్ పెట్టి సమాధానాలు వెతకాలి. రాష్ట్రం గత మూడు దశాబ్దాలలో పాఠశాల, ఉన్నత విద్యలో ముందడుగు వేసింది. అయితే పెరుగుతున్న విద్య ప్రయివేటీకరణ, నాణ్యమైన విద్య అందించటం లో ఉన్న సమస్యలను రాష్ట్రం పరిష్కరించాల్సి వుందని అన్నారు.

రిపోర్ట్ రచయిత ప్రొఫెసర్ మోటుకురి వెంకటనారాయణ సభలో పాల్గొన్నారు.

Tags:    

Similar News