తెలంగాణలో 94 వేల మందిని కాటేసిన వీధి కుక్కలు
ఒక్కో కుక్కపై రూ.1500/- బల్దియా ఖర్చు పెడుతోంది
ప్రస్తుతం దేశంలో వీధి కుక్కల `సీజన్` నడుస్తోంది!. కుక్కకాట్లు పెరుగుతున్నాయి. అయినా వీధి కుక్కల్ని చంపొద్దంటారు జంతు ప్రేమికులు. జనాల మధ్య నుంచి దూరంగా తరిమేయాలని మరి కొందరు అంటారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి జాతీయ సమస్యగా మారింది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఇటీవల వీధి కుక్కను పార్లమెంటు ప్రాంగణంలోకి తేవటంపై కొందరు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆమె వినూత్నంగా స్పందించారు. అయితే ఈ వీధి కుక్కల దాడులు రోడ్డు ప్రమాదాలతో పోటీ పడుతున్నాయి. దాడులు జరగని వీధులు లేవు. ముఖ్యంగా పసి పిల్లలు చాలా మంది మరణిస్తున్నారు. బాధితుల కుటుంబాలు ఆసుపత్రుల పాలై ఆర్థికంగా చితికిపోతున్నారు. కుక్క కాటు బాధితులకు తగిన సంఖ్యలో వైద్యం, మందులు అందుబాటులో లేవు.
నారాయణగూడలోని ఐపీఎం (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)కు ప్రతి రోజూ కుక్క కాట్లతో దాదాపు వంద మందికి పైగా బాధితులు క్యూ కడుతున్నారంటే కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. "ఈ ఏడాది నవంబర్ 30 వరకు 94వేల మందికి పైగా కుక్క కాటుకు గురైనట్లు రికార్డులు" చెబుతున్నాయి. "ఘనత వహించిన 'జీహెచ్‌ఎంసీ' వీధి కుక్కల నియంత్రణను గాలికి వదిలేసింది. తూతూ మంత్రంగా నియంత్రణ చర్యలు చేపడుతుంది," అని కుక్కకాటుకు గురైన వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజుల వ్యవధిలో హయత్‌నగర్‌లో బాలుడు ప్రేమ్‌చంద్.. యూసుఫ్‌గూడ - లక్ష్మీ నరసింహనగర్‌లో మాన్వీత్ నందన్ అనే రెండేండ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలు చిన్నారుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్నారులను మొదలుకొని మహిళలు, వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక చోట జనాలు కుక్క కాటుకు బలవుతున్న పరిస్థితి. పదుల సంఖ్యలో జీహెచ్‌ఎంసీ టోల్‌ఫ్రీ నంబరుకు రోజూ ఫిర్యాదులు వస్తునే ఉన్నాయి.
"జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయని అధికారుల వద్ద సరైన లెక్కలు లేవు. అందుకు సర్వే చేయకపోవడమే కారణం. 2023లో బ్లూ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన లెకల ప్రకారం సుమారు 4 లక్షలు అని చెబుతున్నారు తప్ప, కచ్చితమైన లెక్కల్లేవనే విమర్శలున్నాయి. దీంతో పాటు వీధి కుక్కల నియంత్రణ, వ్యాక్సినేషన్ పేరుతో కోట్ల రూపాయలను స్వచ్ఛంద సంస్థలకు కట్టబెడుతున్నా.. ఫలితం లేకుండా పోతున్నదని," తెలంగాణా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు భూపాల్ ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
వీధి కుక్కల నియంత్రణ కోసం "ఒక్కో కుక్కపై రూ.1500/- బల్దియా ఖర్చు పెడుతోంది. ఇంత ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నా, కుక్క కాట్లు పెరుగుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్కల నియంత్రణకు ‘కంట్రోల్ ఆఫ్ స్ట్రే యానిమల్స్’ హెడ్ పేరుతో ప్రతి ఏడాది నిధులు కేటాయిస్తున్నారు. స్టెరిలైజేషన్స్, వ్యాక్సినేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇతర జంతువుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ప్రతి ఏడాది 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక కూకట్‌పల్లి జోన్ పరిధిలోనే రూ.8.50 కోట్లు ఖర్చుచేశారు," అని భూపాల్ చెప్పారు.
గత ఏడాది 2024 డేటా పరిశీలిస్తే, వీధి కుక్కల నియంత్రణ ప్రక్రియపై పలు సందేహాలు వస్తున్నాయని షమీమ్ సుల్తానా చెబుతున్నారు. "చార్మినార్ జోన్ పరిధిలో ఉన్న వీధి కుక్కలతో పోలిస్తే, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో మూడో వంతు మాత్రమే ఉన్నాయి. స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ కూడా సగమే జరిగినప్పటికీ, ఖర్చు మాత్రం శేరిలింగంపల్లి జోన్ లో మూడు రెట్లు అధికంగా జరిగింది. జోన్ల మధ్య ఇంత తేడా ఉండడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తున్నది. వీధి కుక్కల నియంత్రణ పేరుతో జీహెచ్‌ఎంసీలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలి," అని కోరుట్ల యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు షమీమ్ సుల్తానా డిమాండ్ చేశారు.
బ్లూక్రాస్ అమలకు జూబ్లిహిల్స్‌లో 3 ఎకరాల స్థలం ఇచ్చారు. అయితే అక్కడ ఎన్ని కుక్కలకు ఆశ్రయం ఇస్తున్నారని సుల్తానా నిలదీస్తున్నారు. తాను గత 20 ఏళ్లుగా ప్రతి రోజు 300 కుక్కలు, పిల్లులకు ఆహారం ఇవ్వడంతో పాటు వాటి సంరక్షణ కోసం పనిచేస్తున్నప్పట్టికీ ప్రభుత్వం కనీసం సెంట్ భూమి కేటాయించ లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. కొంత భూమి కేటాయిస్తే వీధి కుక్కల్ని జనాలకు దూరంగా తరలించి వాటిని సంరక్షిస్తామని షమీమ్ సుల్తానా ఫెడరల్‌తో చెప్పారు.
"మేల్ వీధి కుక్కలకే సర్జరీలు చేస్తున్నారు. ఫిమేల్ వీధి కుక్కలకు సర్జరీ చేయకపోవడం వల్లే కుక్కల జనాభా పెరిగిపోతోంది. వీధి కుక్కలకు ఏబీసీ (యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్), రేబిస్ నివారణ టీకాలను వేయడంలో జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వహిస్తోంది. ఏబీసీ ఆపరేషన్లు పెంచేందుకు మూడు జోన్లలో జంతు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారు," అని షమీమ్ సుల్తానా చెప్పారు.
హోటళ్లు, ఇండ్లలోని వ్యర్థాలను రోడ్ల పక్కన పడేస్తుండడం, వాటిని తిన్న వీధి కుక్కలు కనిపించిన వారిపై దాడికి దిగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. "సర్కారు ఆసుపత్రిలో ఉచితంగా లభ్యం కావాల్సిన 'రేబిస్ టీకా' కోసం ప్రైవేటుకు పరుగెత్తాల్సిన దుస్థితి. ప్రైవేటు ఆసుపత్రుల్లో 600 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అని జివికె బంజారా హాస్పిట్ కన్సల్టెంట్ డాక్టర్ శంకర్ నాయక్ ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు.
రాష్ట్రంలో కుక్క కాటుకు గురై, కోతులు కరిచిన బాధితులు నిత్యం వందల సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు. రేబిస్ వ్యాధి సోకకుండా ఉండాలంటే కరిచిన వెంటనే ఏఆర్‌వీ ఇప్పించాలి. సాధారణంగా మూడు డోసులు, తీవ్రతను బట్టి ఎక్కువ డోసులు తీసుకోవాలని డాక్టర్ శంకర్ నాయక్ సూచించారు.
జిల్లాల్లో సర్కారు దవాఖానాలకు వ్యాక్సిన్లు పంపే సెంట్రల్ మెడికల్ స్టోర్ (సీఎంఎస్)లలో రేబిస్ వ్యాక్సిన్ నిల్వలు దాదాపు అడుగంటాయి. వేల సంఖ్యలో ఉండాల్సిన వయల్స్ పదుల సంఖ్యలోనే అందుబాటులో ఉన్నాయి. సీఎంఎస్ నుంచే ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలకు వ్యాక్సిన్లను సరఫరా చేయాలి. కానీ సీఎంఎస్‌లలోనే టీకా వయల్స్ సరిపడా లేకపోవడంతో సరఫరా అరకొరగా ఉంటోంది.
హైదరాబాద్ జిల్లాకు సరఫరా చేసే సీఎంఎస్‌లో ఏఆర్‌వీ వయల్స్ కొద్ది మొత్తంలోనే ఉందని డాక్టర్ శంకర్ నాయక్ చెప్పారు. తెలంగాణాలో 20 లక్షల ఎకరాల అటవీ భూమి పట్టాలు గిరిజనులకు పంచారు. ఆ భూముల్లో వ్యవసాయం చేస్తున్నారు. అడవిలో ఉండే పండ్ల చెట్లు ఇప్పుడు లేకపోవడంతో కోతులు ఊళ్లపై పడ్డాయి. ఇటీవల కోతులు కరిచిన కేసులు కూడా ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్ శంకర్ చెప్పారు.
వీధి కుక్కల నిర్వహణ చేపట్టిన కాంట్రాక్టు ఏజెన్సీల్లో ఎక్కువ భాగం జంతు ప్రేమికుల సంఘాలవే. ఈ సంఘాలు వీధి కుక్కల నుంచి మనుషులను కాపాడడం కంటే, వీధి కుక్కల రక్షణ మీదనే దృష్టి పెడుతూ నిధులన్నీ కాజేస్తున్నారని ప్రజా సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. మరో పక్క వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు.