హైదరాబాద్ లో మెస్సీ మేనియా

ఈనెల 13న ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి మ్యాచ్ పై పెరుగుతున్న ఆసక్తి

Update: 2025-12-10 12:34 GMT
CM Revanth Reddy Foot ball Practice

ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఫీవర్ పెరిగిపోతోంది. ఈ నెల 13న మెస్సీ హైదరాబాద్ కు వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ జట్టుతో జరగబోతున్న  ఎగ్జిబిషన్ మ్యాచ్ చూడటానికి దేశ, విదేశాల నుంచి సెలబ్రిటీలు రానున్నారు. ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 


ది గోట్‌ ఇండియా టూర్‌ పై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని అడ్వైజర్ పార్వతీ రెడ్డి మీడియాకు తెలిపారు. 13న సాయంత్రం మ్యూజిక్‌ కాన్సెర్ట్ ఉంటుందని,  రాత్రి ఏడు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్  గంటసేపు జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత చిన్నారులకు మెస్సీ ఫుట్‌బాల్ టెక్నిక్కులు చెబుతారని చెప్పారు. మెస్సీతో పాటు మరో ఇద్దరు అంతర్జాతీయ స్టార్లు కూడా హైదరాబాద్‌కు రాబోతున్నట్లు పార్వతీ రెడ్డి తెలిపారు.


ప్రాక్టీసు చేస్తున్న సిఎం

ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ జట్టుతో మ్యాచ్ ఆడేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిరోజు రాత్రి సీరియస్ గా ఎంసీహెచ్ఆర్డీ గ్రండ్ లో  ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎంతో బిజీగా ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రిపూట  ప్రాక్టీసు చేస్తున్నారని అధికారవర్గాలు తెలిపాయి. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్)ఇండియా టూర్ 2025పేరుతో ఈవెంట్ జరగనుంది. భారత్  పర్యటనలో హైదరాబాద్‌ను చేర్చినట్టు మెస్సీ తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు. మెస్సీ 14ఏళ్ల తర్వాత భారత్ వస్తున్నారు.


మెస్సీ జట్టుతో రేవంత్ రెడ్డి టీమ్ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడటంపై బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం చర్చనీయాంశమైంది. ‘ఎవడికి కావాలి నీ ఫుట్ బాల్ మ్యాచ్, సోషల్ మీడియాలో అంతా మెస్సీ vs మేస్త్రి అని నడుస్తోంది’ అని  కెటీఆర్ వ్యాఖ్యానించారు.

మెస్సీ మేనియా


ఫుట్‌బాల్ ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసిన మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టనుండటంతో దక్షిణాదిన మెస్సీ మేనియా నెలకొంది. మెస్సీ హైదరాబాద్ కు వస్తుండటంపై అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047లో భాగంగా, రాష్ట్రంలో క్రీడలను, ముఖ్యంగా ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సిద్దమైంది. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో, రాష్ట్ర ప్రభుత్వం ‘ది గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా, లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనకు ఒప్పందం కుదుర్చుకుంది. 


రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్లేయర్

క్రీడల పట్ల ఎంతో ఆసక్తి కనబరిచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫుట్ బాల్ ప్లేయర్. ఉప్పల్ స్టేడియంలో ఆరోజు  సాయంత్రం  5 గంటల నుంచి  హైదరాబాదీ ర్యాప్ సాంగ్స్, ప్రముఖ సింగర్లతో మ్యూజికల్ కాన్సర్ట్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటలకు లియోనెల్ మెస్సీ స్టేడియంలోకి ప్రవేశించి, ఎంపిక చేసిన చిన్నారులకు ఫుట్‌బాల్‌లో మెళకువలు నేర్పుతూ ‘ఫుట్‌బాల్ క్లినిక్’ నిర్వహిస్తారు. అనంతరం మెస్సీ, రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఓ స్నేహపూర్వక మ్యాచ్ జరుగుతుంది.

భారీగా అమ్ముడైన టికెట్లు


సీఎం ప్రచారకర్తగా ఈ ఈవెంట్‌కు అప్పుడే విపరీతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే 30,000కు పైగా టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యాయని నిర్వాహకులు తెలిపారు.క్రీడల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న ఆసక్తి, ఆయన ఫిట్‌నెస్ కారణంగా ఆయనే ఈ ఈవెంట్‌కు తెలంగాణ తరఫున బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తున్నారని పార్వతి రెడ్డి అభివర్ణించారు.  ఫుట్‌బాల్‌ను ప్రమోట్ చేయడానికి మెస్సీ  భారత్ కు రావడం గొప్ప అవకాశం అని ఆమె అన్నారు. ‘‘ ఇది అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తెస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ గేమ్‌లో పాల్గొనడం, యువతకు గొప్ప స్ఫూర్తినిస్తుంది.” ది గోట్ టూర్ సలహాదారు పార్వతి రెడ్డి అన్నారు. ఈ మ్యాచ్‌లో పలువురు అంతర్జాతీయ, జాతీయ స్టార్ క్రీడాకారులు కూడా పాల్గొననున్నారని, ఆ వివరాలను ఒకటి, రెండు రోజుల్లో వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్ అనంతరం, విజేత జట్టుకు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి ‘గోట్ కప్’ను అందజేస్తారు.

Tags:    

Similar News