బధిరుల కోసం సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్న కరీంనగర్ కలెక్టర్

బాలికల కోసం పాటలతో కలెక్టర్ పమేలా ప్రయోగం

Update: 2025-10-16 06:14 GMT
బాలికలపై పాట పాడుతున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ జిల్లా కలెక్టర్ (Karimnagar Collector) పమేలా సత్పతి (Pamela Satpathi)వినూత్న కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఆడపిల్లలను కాపాడుకుందాం అంటూ కలెక్టర్ పాట పాడి (sings for girls)అందరినీ ఆకట్టుకున్నారు. ఓ చిన్నారి బాలిక ఒడిలోకి తీసుకొని జోలపాట పాడి మురిపించారు.బధిరుల సమస్యలను సులభంగా తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు వీలుగా కలెక్టర్ సైగల భాషను నేర్చుకున్నారు.(learns sign language) కలెక్టరేట్ లో సందర్శకుల సమయం వృథాకాకుండా వారి కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. సైనసైటీస్ సమస్యతో బాధపడుతున్న పమేలా సత్పతి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకొని ప్రజారోగ్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించారు. ఇలా ఒకటేమిటి? జిల్లాలో ప్రజల అభ్యున్నతికి కలెక్టర్ పమేలా సత్పతి తనదైన వినూత్న కార్యక్రమాలతో ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు.




 సామాజిక బాధ్యతగా సత్పతి...

2015వ ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన పమేలా సత్పతి 51 ర్యాంకు సాధించారు. గతంలో భద్రాచలం జిల్లా సబ్ కలెక్టరుగా, వరంగల్ మున్సిపల్ కమిషనరుగా, యాదాద్రి జిల్లా కలెక్టరుగా పనిచేసి కరీంనగర్ జిల్లాకు బదిలీపై వచ్చారు. కరీంనగర్ జిల్లా కలెక్టరుగా వచ్చాక పమేలా సత్పతి వినూత్న కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. కలెక్టరుగానే కాకుండా సామాజిక బాధ్యతగా, ఉద్యోగాన్ని ఒక సేవగా భావిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ జిల్లాను సమాచార హక్కు చట్టం అమలులో అగ్రస్థానంలో నిలిపారు. బధిరుల కోసం భాష నేర్చుకోవడం నుంచి బాలికల సాధికారత కోసం పాట పాడడం వరకు ఎన్నో వినూత్న కార్యక్రమాలకు కలెక్టర్ పమేలా సత్పతి రూపకర్తగా నిలిచారు. కలెక్టరుగా పమేలా సత్పతి తీసుకున్న చొరవ అధికార యంత్రాంగానికి ప్రేరణగా, ప్రజల హృదయాలకు స్పూర్తిగా మారుతోంది. ఇలా పాలనకూ, ప్రజల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తూ, ‘కలెక్టర్’ అనే పదానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు పమేలా సత్పతి.



 పమేలా సత్పతి ప్రత్యేక వీడియో సాంగ్

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పుట్టబోయే ఆడపిల్లలను వదిలించుకోవద్దు...వారిపై వివక్ష చూపించొద్దు అంటూ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ‘‘ఓ చిన్ని పిచ్చుకా...చిన్నారి పిచ్చుకా...కిరణాలను తుంచి...ఆ నింగి నుంచి రావమ్మా మా ఇంటికి’’ అంటూ సాక్షాత్తూ కలెక్టర్ పాట పాడి వీడియోను చిత్రీకరింపజేశారు. ఆడపిల్ల పుట్టడం అదృష్ణమని, వారిని పురిట్లోనే చంపుకోవద్దంటూ ప్రజలను చైతన్యపరుస్తూ కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసిన వీడియోలను ఈ పాటలో పొందుపర్చి వీడియో ఆల్బమ్ చేశారు. బాలికలను రక్షించండి అంటూ తీసిన వీడియో ఆల్బంను కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. ఈ పాటను మొదట గీత రచయిత స్వానంద్ కిర్కిరే హిందీలో రాసి పాడారు, దీనిని రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు నంది శ్రీనివాస్ తెలుగులోకి అనువదించారు.

జోలపాట పాడిన కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీకి వెళ్లిన పమేలా సత్పతి ఓ చిన్నారి బాలికను ఎత్తుకొని, ఆమెను ఓలలాడిస్తూ జోలపాట పాడి ఆమెను మురిపించారు. పరిణీత చిత్రంలోని ‘పియు బోలే’ హిందీ పాటను తన గాత్రంతో పాడి తన గాన ప్రతిభను నిరూపించారు. చిన్నారి బాలికకు జోల పాట పాడిన వీడియో గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కలెక్టర్ మేడమ్ పాడిన పాటలకు నెటిజన్లు ఫిదా అయ్యారు.



 సైగల భాష నేర్చుకున్న సత్పతి

బధిరుల సమస్యలను సులభంగా తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు వీలుగా కలెక్టర్ సైగల భాషను నేర్చుకున్నారు.కలెక్టర్ భారతీయ సంజ్ఞా భాషలో జాతీయ గీతాన్ని ఆలపించారు. తాను సైగల భాషను నేర్చుకోవడమే కాకుండా అక్షయ్ ఆకృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్సాహం ఉన్న అధికారులకు సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వారి సర్వీసులో ఒక్క సారైనా అంధులు, బధిరుల పాఠశాలల్లో విధులు నిర్వహించాలని కలెక్టర్ కోరారు. అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాల కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడుతూ దివ్యాంగుల భావాలను అర్థం చేసుకునేందుకు అందరూ సైన్ లాంగ్వేజి నేర్చుకోవాలని కోరారు. ప్రపంచమంతా యూనివర్సల్ గా ఒకే సైన్ లాంగ్వేజీ ఉండాలని ఆమె సూచించారు. బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మరిన్ని స్కిల్స్ లో శిక్షణ ఇస్తామని ప్రకటించారు.



 అనాథ శిశువులను దత్తత ఇచ్చిన కలెక్టర్

కరీంనగర్ శిశుగృహలో పెరుగుతున్న 6 నెలల వయస్సు ఉన్న ఇద్దరు మగ శిశువులను విశాఖపట్నం, మేడ్చల్ మల్కాజిగిరికి చెందిన దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా దత్తత ఇచ్చారు. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు చట్టబద్ధమైన దత్తత మాత్రమే తీసుకోవాలని సూచించారు.



 సైనసైటిస్‌కు సర్కారు దవాఖానాలో సత్పతికి శస్త్రచికిత్స

సైనసైటీస్ సమస్యతో బాధపడుతున్న కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకొని ప్రజారోగ్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించారు. కలెక్టరుకు ప్రభుత్వ ఈఎన్ టీ వైద్యులు శస్త్రచికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచిన కలెక్టరును సీఎం రేవంత్ రెడ్డి, వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, కేంద్రమంత్రి బండి సంజయ్ లు అభినందించారు.

అనాథ యువతికి పెళ్లి చేసిన పమేలా
కరీంనగర్ ప్రభుత్వ బాలసదనంలో ఆశ్రయం పొందిన పూజ అలియాస్ మౌనికకు జిల్లా కలెక్టర్ పెళ్లి జరిపించారు.పూజ అనే బాలిక తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో ఆమెతో పాటు ముగ్గురు చెల్లెళ్లను ప్రభుత్వం చేరదీసి బాలసదనంలో ఆశ్రయం కల్పించింది. ఇంటరు చదివి కంప్యూటర్ శిక్షణ పొందిన పూజ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది.అనాథ యువతి అయిన పూజ పెళ్లీడుకు రావడంతో ఆమెకు నచ్చిన సాయితేజతో కలెక్టరు దగ్గరుండి పెళ్లి చేశారు. పూజకు పెళ్లిలో కావాల్సిన గృహోపకరణాలు, పట్టు పరుపులు, మెట్టెలు, తాళిబొట్టు దాతలు అందించడంతో కలెక్టరు పెళ్లి పెద్దగా ఉండి వైభవంగా పెళ్లి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ అనాథ యువతికి ప్రభుత్వం నుంచి సహాయం చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఓ అనాథ యువతికి తానే అమ్మా నాన్నై దగ్గరుండి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. గతంలో చిన్నారుల కోసం జోల పాట పాడారు. గతంలో ట్రాన్స్ జెండర్లకు బాసటగా నిలిచారు. ఇలా వినూత్న కార్యక్రమాలతో కలెక్టర్ కరీంనగర్ లో వార్తల్లో నిలిచారు.



 ఎన్నెన్నో వినూత్న కార్యక్రమాలు

- కలెక్టరు పమేలా సత్పతి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ జిల్లాలో యువత భవిష్యత్ ను నాశనం చేసే డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించి డ్రగ్స్ రహిత జిల్లాగా చేసేందుకు కలెక్టర్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.
- జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణల్లో ఔషధ మొక్కలు పెంచాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
- న్యూట్రిషన్ మాసోత్సవంలో భాగంగా ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు పోషకాహారం అందించాలని కలెక్టర్ సూచించారు.
- కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి టీచర్ గా మారి, పిల్లలకు పాఠాలు చెప్పారు.
- ఇటీవల సమాచార హక్కు చట్టం అమలులోనూ తెలంగాణలోనే కరీంనగర్ జిల్లాను పమేలా సత్పతి అగ్రస్థానంలో నిలిపి గవర్నర్ నుంచి అవార్డు అందుకున్నారు.


Tags:    

Similar News