తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాజయం

తెలంగాణలో ‘కారు’ షెడ్డుకు వెళ్లి పోయింది. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో ప్రభావం చూపించలేక పోయింది.

Update: 2024-06-04 10:59 GMT
kcr

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయింది. సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకోలేక పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి. దీంతో జనం ఆ పార్టీని ఆదరించలేదు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ కు దక్కలేదు. మెదక్ నియోజకవర్గంలో కొన్ని రౌండ్లలో బీఆర్ఎస్ ముందంజలోకి వచ్చినా, ఆ తర్వాత ఓటమి దిశలో పయనిస్తున్నారు.


అక్రమాలే కొంప ముంచాయా?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలే పార్లమెంట్ ఎన్నికల్లో కొంప ముంచాయని రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని పలు విచారణల్లో తేలింది. దీంతోపాటు డిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత జైలు పాలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా బయటపడింది. తెలంగాణలో గొర్రెలు, చేపపిల్లల పెంపకంలోనూ అవినీతి అక్రమాలు వెలుగుచూశాయి. బీఆర్ఎస్ సర్కారు సాగించిన అక్రమాల వల్లనే తెలంగాణ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాల పర్వం వల్లనే ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదని సీనియర్ జర్నలిస్ట్ గోనే రాజేంద్రప్రసాద్ చెప్పారు.

స్థానిక నేతల కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజారిటీ
తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్, నేతల వల్లనే తమ పార్టీ అభ్యర్థులకు భారీ మెజారిటీ లభించిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్ చెప్పారు. బీఆర్ఎస్ అవినీతి పాలనతో విసిగి వేసారిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేశారని ఆయన చెప్పారు. తాము ఓడినా, గెలిచినా తెలంగాణ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని ఆయన పేర్కొన్నారు. తాను ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తానని లక్ష్మారెడ్డి వివరించారు.

కేసీఆర్ బస్సుయాత్ర తుస్
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి సుడిగాలి ప్రచారం చేసినా, ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు దక్కలేదు. బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకొని ఆ పార్టీ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రం మొత్తం బస్సులో తిరిగి ప్రచారం చేసినా కేసీఆర్ కు నిరాశే ఎదురైంది. సొంత రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేని కేసీఆర్ గతంలో తాను ప్రధాని పదవి రేసులో ఉన్నానని ప్రకటించి సంచలనం రేపారు.


Tags:    

Similar News