హైదరాబాద్ జూలో విషాదం, రాయల్ బెంగాల్ టైగర్ అభిమన్యు మృతి
హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని జంతువులకు కిడ్నీ వ్యాధుల ముప్పు పొంచి ఉంది.మీరాలం కలుషిత జలాలు ముంచెత్తుతుండటంతో జంతువులు కిడ్నీ వ్యాధులతో మరణిస్తున్నాయి.
By : Saleem Shaik
Update: 2024-05-15 05:14 GMT
హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో వరుసగా జంతువుల మరణమృదంగం కొనసాగుతోంది. మీరాలం చెరువు కలుషిత జలాలు జూపార్కును ముంచెత్తుతుండటంతో అవి తాగిన జంతువులు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నాయి.
- అత్యంత కలుషిత మైన మీరాలం చెరువు నీరు తాగడం వల్లనే తరచూ జూపార్కు జంతువుల కిడ్నీలు దెబ్బతింటున్నాయని పశువైద్యాధికారుల పరీక్షల్లో తేలాయి. అయినా జూపార్కులో జంతువుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన కలుషిత మీరాలం జలాలు రాకుండా నిరోధించడంలో రాష్ట్ర అటవీశాఖ విఫలమైంది.
- జూపార్కులో కలుషిత జలాలను శుద్ధి చేసేందుకు సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని జూపార్కు క్యూరెటర్ సిఫార్సు చేసినా సర్కారు సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో జూపార్కు జంతువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
- పిల్లల నుంచి పెద్దల దాకా లక్షలాది మంది సందర్శకులను అలరిస్తున్న నెహ్రూ జంతుప్రదర్శన శాలలో జంతువుల మనుగడ మీరాలం జలాల కాలుష్య కాటు వల్ల ప్రశ్నార్థకంగా మారింది. ఇలాగే కలుషిత జలాలు వస్తుంటే భవిష్యత్ లో జూపార్కులో జంతువులు అంతర్ధానం అయ్యే పరిస్థితులు నెలకొంటాయని జంతు ప్రేమికుల సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
జూపార్కు జంతువుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు : చుట్టూ పచ్చని ఎతైన చెట్లు...వివిధ రకాల రంగురంగుల పక్షులు...వాటి కిలకిల రావాలు...వివిధ రకాల జంతువులతో కూడిన జూపార్కు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సందర్శకులు క్యూ కడుతున్న ఈ జూపార్కు మీరాలం ట్యాంకు కలుషిత జలాల వల్ల జంతువుల ప్రాణాలకు ముప్పుగా మారింది.
సందర్శకులకు కనువిందు చేస్తున్న జంతువులు : నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో మొత్తం 2,240 జంతువులున్నాయి. వీటిలో 664 క్షీరదాలు, 97 రకాల 1227 పక్షులు, 38 రకాలకు చెందిన 341 సరీసృపాలు, ఉభయచరాలు 8 ఉన్నాయి. బాతులు, కొంగలు, వివిధ రకాల రంగురంగుల పక్షులు, చిలకలు, ఎతైన జిరాఫీలు, అడవిదున్నలు,చిరుతలు, పులులు, సింహాలు, తాబేళ్లు, కోతులు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి.
కిడ్నీ వ్యాధులతో 60కిపైగా జంతువుల మృత్యువాత : ప్రతీ నెలా ఏదో ఒక జంతువు కిడ్నీ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ మరణిస్తూనే ఉంది. జూపార్కులో ఇప్పటి వరకు అరవైకుపైగా జంతువులు కిడ్నీవ్యాధులతో మరణించాయని జూపార్కు వెటర్నరీ వైద్యాధికారుల గణాంకాలే చెబుతున్నాయి.
కిడ్నీలు ఫెయిల్ వల్లే జంతువుల మృతి...జంతువుల పోస్టుమార్టం రిపోర్టులో తేలిన వాస్తవాలు
జూపార్కులో పలు జంతువులు మీరాలం కలుషిత జలాలు తాగడం వల్ల వాటి కిడ్నీలు ఫెయిల్ అయి మరణించాయని హైదరాబాద్ వెటర్నరీ కళాశాల పశుసంవర్థక శాఖ ప్రొఫెసర్లు వెల్లడించారు. మృత్యువాత పడిన జంతువుల కళేబరాలను పోస్టుమార్టం చేసిన పశుసంవర్ధక శాఖ వైద్యులు కలుషిత నీటిని తాగడం వల్లనే జంతువుల కిడ్నీలు దెబ్బతింటున్నాయని పీఎంఐ రిపోర్టులో తేల్చిచెప్పారు.
తాజాగా రెండు కిడ్నీలు ఫెయిలై తెల్లపులి మృతి : ఈ ఏడాది మే 14వతేదీ హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో మంగళవారం అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన మగ తెల్లపులి అభిమన్యు కిడ్నీ ఫెయిల్ అయి మరణించింది. అభిమన్యు తెల్లపులికి గత ఏడాది ఏప్రిల్ నెలలో నెఫ్రీటీస్ కిడ్నీ సంబంధ వ్యాధి వచ్చినట్లు జూపార్కు పశు వైద్యాధికారుల పరీక్షల్లో తేలింది. దీంతో కిడ్నీ వ్యాధిబారిన పడిన తెల్లపులికి జూ పశువైద్యాధికారులు వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ నెల 12వతేదీ నుంచి అభిమన్యు ఎలాంటి ఆహారం తీసుకోలేదు. దీంతో బలహీన పడిన తెల్లపులిని పరీక్షించగా రెండు కిడ్నీలు పాడైపోయాయని వెల్లడైంది. తెల్లపులి కళేబరాన్ని పశువైద్యులు పోస్టుమార్టం చేయగా రెండు కిడ్నీలు పాడై పోవడం వల్లనే మరణించిందని తేలింది.
అవయవాల వైఫల్యంతో తాబేలు మృత్యువాత : ఈ ఏడాది మార్చి 15వతేదీన నెహ్రూ జంతుప్రదర్శనశాల ప్రవేశ మార్గంలోనే సందర్శకులకు కనువిందు చేసిన 125 ఏళ్ల వయసున్న అరుదైన గాలాపాగోస్ జెయింట్ తాబేలు మృత్యవాత పడింది. కిడ్నీతో పాటు ఇతర అవయవాల వైఫల్యం వల్లనే తాబేలు మరణించిందని జూపార్కు పశుసంవర్ధక శాఖ వైద్యులు, రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ తేల్చారు. తాబేలు కళేబరానికి పోస్టుమార్టం చేసిన పశువైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు.
కలుషిత జలాల కాటుకు ఎన్నెన్నో జంతువుల మృత్యువాత
మీరాలం ట్యాంకు కలుషిత జలాల వల్ల జూపార్కులో అరవైకిపైగా జంతువులు మరణించాయని జూపార్కు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఆసియా ఆడ సింహం, హిమాలయన్ గోరల్, ఆసియా సింహం అరుణ,హంసలు కలుషిత జలాల వల్ల లివర్ వ్యాధులతో మరణించాయని జూపార్కు పశువైద్యులు చెప్పారు. జూపార్కులో జంతువులు తాగేందుకు తాము శుద్ధి చేసిన మినరల్ వాటర్ అందిస్తున్నా, జంతువులు సఫారీలో తిరిగేటపుడు మీరాలం కలుషిత జలాలు కూడా తాగుతున్నాయని, దీనివల్లనే జంతువుల కిడ్నీలు దెబ్బతింటున్నాయని జూపార్కు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల లోపలకు వెళుతుంటే మీరాలం చెరువు నుంచి ప్రవహిస్తున్న కాల్వలట్యాంక్ నుంచి నెహ్రూ జూ పార్క్ ఛానెల్‌లు,కాలువల గుండా వెళుతున్న నీటిలో భారీ లోహాలు, నైట్రేట్లు ఉన్నాయని తేలింది. మీరాలం ట్యాంకు నుంచి జూపార్కులోకి వస్తున్న కలుషిత జలాల వల్ల అరవైకి జంతువులు మరణించాయని జూపార్కు వెటర్నరీ వైద్యులు చెప్పారు.
మీరాలం ట్యాంకు నీళ్లల్లో కాలుష్య కారకాలెన్నో...ల్యాబ్ పరీక్షల్లో తేలిన నిజం
మీరాలం ట్యాంకు నుంచి జూపార్కులోకి వస్తున్న కలుషిత జలాలను జూపార్కు అధికారులు మూడు వేర్వేరు సంస్థలతో ల్యాబ్ పరీక్షలు చేయించారు. తెలంగాణ భూగర్భ జలశాఖ, వెటర్నరీ కళాశాల, వెటర్నరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రత్యేక నిపుణుల బృందాలను రప్పించి జూపార్కులో నీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ పరీక్షలు చేశారు. ఈ నీటిలో నైట్రేట్లు, బాక్టీరియల్ ఇన్పెక్షన్లు, బాక్టీరియా, కెమికల్స్, వివిధ రకాల మెటల్స్ ఉన్నాయని ల్యాబ్ పరీక్ష నివేదికల్లో వెల్లడైందని, దీనిపై తాము రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, అటవీ మంత్రిత్వశాఖకు నివేదికలు పంపించామని జూపార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
జంతువులు తాగేందుకు ఆర్వో వాటర్ సప్లయి
జూపార్కులో జంతువులు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న నేపథ్యంలో తాము సురక్షితమైన ఆర్వో వాటర్ ప్లాంట్ నీటిని తాగేందుకు అందిస్తున్నామని జూపార్కు ప్రజా పౌర సంబంధాల శాఖ అధికారి షేక్ హనీఫ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జంతువులు కిడ్నీ రోగాల బారిన పడకుండా తమ జూపార్కు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జంతువులు సఫారీలో కలుషిత నీరు తాగుతుండటం వల్ల అనారోగ్యం పాలవుతున్నాయని హనీఫ్ పేర్కొన్నారు.
జంతువులను కాలుష్యం కాటు నుంచి కాపాడండి : డాక్టర్ లూబ్నా సర్వత్
జంతువులను కాలుష్యం కాటు నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ నగరానికి చెందిన పర్యావరణ ప్రేమికురాలు డాక్టర్ లూబ్నా సర్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మీరాలం చెరువు కాలుష్య కారక పరిశ్రమల వల్ల అత్యంత కాలుష్య కాసారంగా మారిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జూపార్కు జంతువులు మరణించకుండా తెలంగాణ అటవీశాఖ అధికారులు మేలుకోవాలని ఆమె కోరారు. మీరాలం చెరువు కాలుష్యాన్ని నివారించేందుకు మున్సిపల్ శాఖ సత్వర చర్యలు తీసుకోవాలని డాక్టర్ లూబ్నా డిమాండ్ చేశారు.