పోలీసులకే సవాలుగా నిలిచిన ఐబొమ్మ
దెబ్బకు పైరసీల బెడద వదిలిపోయిందని అనుకునేంతలోగా మరోసవాలు ఎదురైంది
సినిమాల పైరసి కాపీలను నియంత్రించటం పెద్ద సమస్యగా మారిపోయింది. తెలుగు సినీపరిశ్రమ పెద్దలు పోలీసులను ఎన్నిసార్లు కలిసి విజ్ఞప్తులు చేస్తున్నా పైరసీల(Piracy Movies)ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. పైరసీ సీడీలను కంట్రోల్ చేయటానికి పోలీసులు తమంతట తాముగా ఎన్ని ప్రయత్నాలుచేస్తున్నా పెద్దగా ఉపయోగం కనబడటంలేదు. ఈనేపధ్యంలోనే మూడురోజుల క్రితం హైదరాబాద్(Hyderabad) కమీషనర్ గా పనిచేసిన సీవీ ఆనంద్(CV Anand) నాయకత్వంలో దాడులు చేసి అతిపెద్ద పైరసీ సీడీలు తయారుచేసే ముఠాను పట్టుకున్నారు. ఈ దెబ్బకు పైరసీల బెడద వదిలిపోయిందని అనుకునేంతలోగా మరోసవాలు ఎదురైంది. విషయం ఏమిటంటే ఐబొమ్మ(బప్పంటీవీ.ఓఆర్జీ)(iBOMMA) అనే పైరసీ వీడియో కంటెంటును ఆన్ లైనులో ఉంచే ఈ సంస్ధ పోలీసులకు పెద్ద సవాలు విసిరింది. తమజోలికి వస్తే తామేంటో చూపిస్తామని చిత్రపరిశ్రమ(Telugu Film Industry) పెద్దలతో పాటు హైదరాబాద్ పోలీసులకు తమ వెబ్ సైట్ ద్వారా ఏకంగా సవాలు విసరటం ఇపుడు సంచలనంగా మారింది. నిజానికి ఈ వార్నింగ్ చాలారోజుల క్రితం ఇచ్చింది. కాని పైరసీల కేసులు, గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అప్పటి లేఖ ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అతిపెద్ద పైరసీ ముఠాను సీవీ ఆనంద్ బృందం పట్టుకున్న విషయం తెలిసిందే. అందుకనే ఇపుడు హైదరాబాద్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్(VC Sajjanar) ఏమిచేస్తారో అని సినీపరిశ్రమ చూస్తోంది.
తమను నియంత్రించాలని చూస్తే అందుకు పోలీసులు ప్రతిచర్య ఎదుర్కోక తప్పదని వెబ్ సైట్లో గతంలో పోలీసులను హెచ్చరించింది. తెలుగుసినిమాలు రిలీజ్ అవ్వటం ఆలస్యం లేకపోతే ఓటీటీలో రిలీజైన రోజే కొన్ని సైట్లు పైరసీ కాపీలను తమ వెబ్ సైట్లో పెట్టేస్తున్నాయి. పైరసీ కాపీలని తెలిసినా జనాలు వాటిని ఫ్రీగా చూసేస్తున్నారు. పైరసీ సినిమాలను రిలీజ్ చేసే వెబ్ సైట్లు 65 ఉన్నాయి. ఇలాంటి వెబ్ సైట్లలో ఐబొమ్మ అన్న సైట్ చాలా పాపులర్. పైరసీ కాపీలను ప్రదర్శించే చాలా వెబ్ సైట్లలో ప్రస్తుతం బప్పంటీవీ.ఓఆర్జీగా మారిన ఐబొమ్మకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఐబొమ్మ సైట్లో సినిమాలు దాదాపు హెచ్ డీ క్లారిటితో ఉంటాయి. అందుకనే జనాలు కూడా ఐబొమ్మ సైట్లో సినిమాలు చూడటానికి ఎగబడతారు. దీనివల్ల సినిమాపరిశ్రమకు కోట్ల రూపాయల్లో నష్టాలు వస్తున్నాయి.
పైరసీ సినిమాలను రిలీజ్ చేసిన ఈ సైట్ అటు చిత్రపరిశ్రమ పెద్దలతో పాటు ఇటు పోలీసులకు కూడా అప్పట్లోనే పెద్ద వార్నింగ్ ఇచ్చింది. ఎంతటి వార్నింగ్ ఇచ్చినా పోలీసులు ఈ సైట్ ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. హైదరాబాద్ పోలీసు కమీషనర్ గా పనిచేసిన ఆనంద్ చెప్పిన ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పైరసీ వల్ల సుమారు రు. 3700 కోట్ల నష్టం వచ్చింది. ఐబొమ్మ మీద పోలీసులు ఫోకస్ చేస్తే తాము కూడా ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామని పోలీసులకే వార్నింగ్ ఇచ్చేంతస్ధాయికి వెబ్ సైట్ ఎదిగిపోయింది. ఎక్కడనుండి ఈ సైట్ నిర్వాహకులు సినిమాలను పైరసీ చేస్తున్నారు ? రిలీజ్ చేస్తున్నారన్న విషయాన్ని పోలీసులు ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. మరెప్పటికి ఈ పైరసీని పోలీసులు నియంత్రిస్తారో చూడాల్సిందే.