తొక్కిసలాట ఘటనపై పోలీసుల మాటేంటి?

తమిళనాడు ప్రభుత్వ అధికార ప్రతినిధి పి. అముధ, ఆరోగ్య కార్యదర్శి పి. సెంథిల్ కుమార్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డేవిడ్సన్ దేవాశిర్వతం ఏమన్నారు?

Update: 2025-10-01 11:38 GMT
Click the Play button to listen to article

తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం కరూర్‌(Karur)లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ నిర్వహించిన ప్రచారసభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. సుమారు 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన తర్వాత తన ఆవేదనను బయటపెట్టారు విజయ్. అదే సమయంలో కొంతమంది పార్టీ నాయకులు.. తొక్కిసలాట వెనక కుట్ర దాగిఉందని ఆరోపిస్తున్నారు. ఇంకొంతమంది తగినంత పోలీసు సిబ్బంది లేకపోవడమే ఘటనకు కారణమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ వార్తలను తిప్పికొడుతూ మంగళవారం పోలీసు ఉన్నతాధికారులు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలను బయటపెట్టారు. తమిళనాడు ప్రభుత్వ అధికారిక ప్రతినిధి పి. అముధ, ఆరోగ్య కార్యదర్శి పి. సెంథిల్ కుమార్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) డేవిడ్సన్ దేవాశిర్వతం ఇందులో పాల్గొన్నారు.

ప్రశ్న: TVK విజయ్ బహిరంగ సభకు ప్రభుత్వం అసురక్షిత వేదిక ఇచ్చిందా?

జవాబు : బహిరంగ సభకు ముందు ఆ పార్టీ నాయకులతో మాట్లాడాం. కరూర్ బస్‌స్టాండ్ సమీపంలో ప్రదేశాలు రద్దీగా ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వేదిక ఏర్పాటుకు తిరస్కరించాం. దాంతో TVK మరో రెండు ప్రదేశాల గురించి మాట్లాడింది. అవి రెండు 40 అడుగుల రోడ్లు ఉన్నవి కావడంతో.. చివరకు 60 అడుగుల రోడ్డు ఉన్న వేలుసామిపురాన్ని ఎంచుకున్నారు. మిగతా వాటితో పోలిస్తే వేలుస్వామిపురం సురక్షితమైనదిగా భావించాం. 500 మంది పోలీసు సిబ్బందిని మోహరించాం. వీరితో పాటు నిర్వాహకులు, వలంటీర్లు పనుల్లో నిమగ్నమయ్యారు.

ప్రశ్న: జనం భారీగా వస్తారని మీరుగాని నిర్వాహకులుగాని ఎందుకు అంచనా వేయలేకపోయారు?

జవాబు : సుమారు 10వేల మంది జనం ఉన్నారని నిర్వాహకులు అంచనా వేసుకున్నారు. అయితే 20వేలకు పైగా వచ్చారు. వీరిలో చాలామంది నామక్కల్, తిరుచ్చి నుంచి విజయ్ కాన్వాయ్‌ను ఫాలో అయ్యారు. నిబంధనల ప్రకారం బహిరంగ సభలు, ప్రచార కార్యక్రమాలకు ప్రతి 20 మంది ప్రజలకు ఒక పోలీసును నియమించాలి. సాధారణ కార్యక్రమాలకయితే ప్రతి 50 మందికి ఒక పోలీసు ఉండాలి. కరూర్‌లో 1,082 మంది పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంచాం. వీరిలో 500 మంది వేదిక వద్ద ఉన్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5:30 వరకు పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ 6 గంటల తర్వాత అదనపు బలగాలను రప్పించారు.

ప్రశ్న: విద్యుత్ కోత తొక్కిసలాటకు కారణమైందా?

విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. విజయ్ ప్రసంగిస్తున్నపుడు లైట్లు ఆపివేయాలని టీవీకే అభ్యర్థించింది. వారు తమ సొంత ఫోకస్ లైట్లను ఏర్పాటు చేసుకున్నారు.

ప్రశ్న: తొక్కిసలాట లాఠీ ఛార్జ్ వల్ల జరిగిందా? అంబులెన్స్‌లు ఏ సమయంలో వచ్చాయి?

జవాబు: విజయ్ ప్రసంగానికి ముందు బారికేడ్లు పడిపోవడంతో తొక్కిసలాట జరిగిందని మాకున్న సమాచారం. సమాచారం అందుకున్న అంబులెన్స్‌లు రావడం ప్రారంభిచాయి. పార్టీ ఏర్పాటు చేసుకున్న ఏడు అంబులెన్స్‌లలో రెండింటిలో బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. 108‌కు సాయంత్రం 7.14 గంటలకు కాల్ వెళ్లింది. 7.14 నుంచి 9.45 గంటల మధ్య 33 అంబులెన్స్‌లు క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించాయి.

ప్రశ్న: రాత్రిపూట పోస్ట్‌మార్టం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు? అది నిజమేనా?

జవాబు: కరూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే చాలా మృతదేహాలు ఉన్నాయి. ముగ్గురు ఫోరెన్సిక్ వైద్యులు మాత్రమే ఉన్నారు. పోస్ట్‌మార్టం ఆలస్యం చేయడం వల్ల కుటుంబాల్లో ఆవేదన మరింత పెరుగుతుంది. కరూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 220 మంది వైద్యులు,165 మంది నర్సులు విధుల్లో ఉన్నారు. అదనంగా సేలం నుంచి మరికొంత వైద్యులు, ఆరు వైద్య కళాశాలల నుంచి సిబ్బందిని రప్పించారు. మొత్తం 114 మంది వైద్యులు, 16 మంది ఫోరెన్సిక్ వైద్యుల ఆధ్వర్యంలో మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు.

ప్రశ్న: జనాన్ని నియంత్రించడంతో ప్రభుత్వం విఫలమైందన్న వార్తలొస్తున్నాయి. దీనిపై మీ సమాధానం?

జవాబు: దురదృష్టం ఏమిటంటే.. మధురైలో ఆగస్టులో జరిగిన టీవీకే సమావేశంలో 34 మంది స్పృహ కోల్పోయారు. వారు సురక్షితంగా డిశ్చార్జ్ అయ్యారు. మధురై, కరూర్, తిరుచ్చి, అరియలూర్, ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కరూర్ జిల్లాలో 1,082 మంది పోలీసులను ఉంచారు. ఊహించని విధంగా జనం తరలిరావడంతో విషాదం నెలకొంది. వేలుసామిపురంలోని వేదిక వద్దకు చేరుకునే ముందు ప్రసంగం చేసి వెనక్కు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా నిర్వాహకులు వినలేదు. 

Tags:    

Similar News