రేవంత్ విజయం..చంద్రబాబు బనకచర్లను వదిలేసినట్లేనా ?
బనకచర్ల ప్రాజెక్టులో మార్పులు చేయాలని చంద్రబాబు(Chandrababu) ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విజయంసాధించాడనే చెప్పుకోవాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో రేవంత్ కుమ్మక్కయ్యాడని, ఏపీకి తెలంగాణ జలాలను దోచిపెడుతున్నాడని, తెలంగాణ(Telangana) ప్రయోజనాలను గాలికి వదిలేశాడని రోజులతరబడి రేవంత్(Revanth)కు వ్యతిరేకంగా గోలగోల చేసిన బీఆర్ఎస్(BRS) క్యాంపు ఇపుడు ఏముంటుందో ? తాజా అప్ డేట్ ఏమిటంటే బనకచర్ల ప్రాజెక్టులో మార్పులు చేయాలని చంద్రబాబు(Chandrababu) ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంలో కొన్నిమార్పులు చేయాలని చంద్రబాబు ఇంజనీర్లకు సూచించారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, కర్నాటక నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై ప్రత్యామ్నాయ కార్యాచరణను సిద్ధంచేయాలని ఆదేశించారు.
బనకచర్ల ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ కార్యాచరణను సిద్ధంగా చేయాలని ఆదేశించారని చంద్రబాబు అన్నారంటే దాన్ని రేవంత్ విజయంగానే భావించాల్సుంటుంది. ఎందుకంటే సముద్రంలో కలిసే వృధాజలాలను ఉపయోగించుకుంటాము, వరదజలాలనే వాడుకుంటామంటు చంద్రబాబు ఏదేదో ప్రకటనలు చేశారు. చంద్రబాబు ప్రకటనలను, ప్రయత్నాలను రేవంత్ గట్టిగానే ఎదుర్కొన్నాడు. చంద్రబాబు ప్రతి ప్రకటనకు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంవల్ల తెలంగాణకు జరిగే నష్టాలగురించి కేంద్రప్రభుత్వంలోని జలశక్తి మంత్రిత్వశాఖతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖలకు లేఖల రూపంలో రేవంత్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తంచేసింది. తెలంగాణ అభ్యంతరాలను కాదని ముందుకు వెళితే సుప్రింకోర్టులో కేసులు దాఖలు చేస్తామని రేవంత్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
రేవంత్ హెచ్చరికలు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు కావచ్చు లేదా రెండూ కలిసి వర్కవుటయ్యుండచ్చు. ఫలితంగా బనకచర్లప్రాజెక్టు నిర్మాణానికి ఏపీప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను జలశక్తి మంత్రిత్వశాఖ పాటు సెంట్రల్ వాటర్ కమీషన్, అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖలు తిరస్కరించాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ మనుగడకు చంద్రబాబు మద్దతు కీలకమని తెలిసినా సరే నరేంద్రమోదీ బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తప్పని పరిస్ధితిలోనే వేరేదారిలేక చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టులో మార్పులు చేస్తున్నారు. చంద్రబాబు కొత్తపాట ఏమిటంటే పోలవరం-సోమశిల అనుసంధాన ప్రాజెక్టు. పోలవరం నుండి ప్రకాశం బ్యారేజీకి ఇప్పటికే ఉన్న కాలువకు అదనంగా మరోకాలువ తవ్వుతారు. తాజా ప్రాజెక్టు వ్యయం రు. 58వేల కోట్లుగా అంచనా వేశారు.
కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బహిర్గతంకాలేదు. చంద్రబాబు బుర్రలో ఏముందో తెలీదు కాని తనను ఎంతమాత్రం నమ్మేందుకులేదు. చంద్రబాబే బనకచర్ల ప్రాజెక్టులో మార్పులు చేసుకున్న నేపధ్యంలో రేవంత్ మీద నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు బ్యాచ్ ఇపుడు ఏమంటారు ? తమపోరాటం కారణంగానే చంద్రబాబు బనకచర్లలో మార్పులు చేసుకున్నాడు, రేవంత్ వల్లకాదని చెప్పినా చెప్పగలరు.