‘పింక్ బుక్, రెడ్ బుక్‌లు మాకు తెలీదు’
తన మొదటి ఛాలెంజ్ స్థానిక సంస్థల ఎన్నికలేనన్న డీజీపీ శివధర్‌రెడ్డి.
తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి.. బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తనను ఏ లక్ష్యంతో నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పోలీసు శాఖ ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయని, వాటిని ప్రాధాన్యత పరంగా అధిగమిస్తామన్నారు. ప్రస్తుతం తన ముందు ఉన్న తొలి ఛాలెంజ్ స్థానిక ఎన్నికల సంస్థలను సమర్థవంతంగా నిర్వహించడమేనని అన్నారు. ఆ దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. అంతేకాకుండా మావోయిస్ట్‌లు, పెరుగుతున్న సైబర్ నేరాలు, పింక్ బుక్ వంటి అంశాలపైనా ఆయన స్పందించారు. దీంతో పాటుగా పోలీసు శాఖలో 17వేల ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయడానికి త్వరలో నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. సాంకేతికత సహాయంతో మరింత సమర్థవంతంగా పనిచేస్తామని చెప్పారు.
మా దంతా ఖాకీ బుక్కే..
‘‘సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం. సైబర్ సెక్యూరిటీ, ఈగల్ టీమ్‌కు పూర్తి సహకారం అందిస్తాం. బేసిక్ పోలిసింగ్, విజువల్ పోలిసింగ్ మానిటరింగ్ సిస్టమ్‌ను మరింత ఇంప్రూవ్ చేస్తాం. మాకు ఓన్లీ ఖాకీ బుక్ ఉంది. రెడ్ బుక్, పింక్ బుక్ లాంటివి మాకు తెలీదు. ఇతరుల వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అందులో సందేహం లేదు’’ అని హెచ్చరించారు శివధర్ రెడ్డి.
మావోలకు భయమక్కర్లేదు..
‘‘మావోయిస్ట్ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్.. తాము బయటకు రావాలని అనుకుంటున్నామని, ఆయుధాలు విడిచిపెట్టాలని భావిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేశారు. జనరల్ సెక్రటరీ బసవరాజు ఉన్నప్పుడే ఆ నిర్ణయం జరిగిందని కూడా వేణుగోపాల్ తన ప్రకటనలో తెలిపారు. వేణుగోపాల్ స్టేట్‌మెంట్‌ను జగన్ ఖండించారు. ప్రజా పోరాట పంథా అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదని మావోలే చెప్తున్నారు. ఆయుధాలు వదిలి వస్తే పోలీసులు వేధిస్తారన్న భయం మావోయిస్టులకు అక్కర్లేదు. ఎటువంటి సంశయం లేకుండా వారు జనజీవన స్రవంతిలోకి రావాలి. చాలా మంది ఇప్పటికే బయటకు వచ్చారు. ఇంకా వస్తున్నారు. ఇటీవల సెంట్రల్కమిటీ సభ్యురాలు కవితక్క కూడా లొంగిపోయారు’’ అని వివరించారు ఆయన.