‘ఈటల మాటలు వ్యక్తిగతమా.. బీజేపీ వైఖరా?’
లాజిక్ అన్న విషయాన్ని కవిత మర్చిపోయారా?
కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. గిన్నీస్ రికార్డ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మను వినియోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆయన పిలుపు ఇవ్వడం.. ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అంటూ ఆరోపించారు. బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మను చింతమడక నుంచి లండన్ వరకు తీసుకెళ్లిన అనుభవం తనదని చెప్పారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మాత్రం గిన్నీస్ రికార్డ్ కోసం బతుకమ్మను అవమానపరచడం సరైనది కాదని అన్నారు. బతుకమ్మ నిమజ్జనంలో సీఎం పాల్గొనడం స్వాగతించదగ్గ విషయమని చెప్పారు.
ఈటల మాటలు సరైనవి కావు..
బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇంతలోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. దీంతో సర్పంచ్ అభ్యర్థులకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక సూచనలు చేస్తూ మంగళవారం ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ పోటీ చేయొద్దని ఈటల పిలుపునివ్వడం ఆయన బాధ్యతారాహిత్యమేనని విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేకుంటే బీజేపీ వైఖరా? అని ప్రశ్నించారు. ‘‘మహారాష్ట్రలో జరిగినట్లే తెలంగాణలో కూడా ఎన్నికలు రద్దవుతాయని ఈటల అనడం.. కోర్టులను ప్రభావితం చేసే ప్రయత్నేమే. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేసినా, వర్గీకరణ వారీగా రిజర్వేషన్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’’ అని అన్నారు కవిత.
స్థానిక ఎన్నికలపై క్లారిటీ లేదు..
‘‘స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. అక్టోబర్ 8న బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టులో వచ్చే తీర్పు ఆధారంగా మా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ పనులను ప్రభుత్వం చేపట్టడం స్వాగతించదగ్గ పరిణామం. బీసీ హక్కుల కోసం బీఆర్ఎస్ ఉద్యమిస్తే మంచిదేనని చెప్పారు’’ అని కవిత వివరించారు.
కవిత ఈ లాజిక్ మిస్సయ్యారా..?
ఇదిలా ఉంటే ఈటల వ్యాఖ్యలపై కవిత చేసిన ఆరోపణలను రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. రోజురోజుకు కవిత.. లాజిక్ అనే విషయాన్ని మిస్ అవుతున్నారని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయొద్దని అసలు ఈటల ఎలా చెప్తారు? అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు చెప్పారంటే ఒక అర్థం పర్థం ఉందని, అలా కాకుండా ఎంపీగా ఉన్న ఈటల.. ఇలాంటి పిలుపు ఎలా ఇస్తారు? ఒకవేళ ఈటల ఈమేరకు పిలుపు ఇచ్చినా.. దానిని బీజేపీనే చాలా సీరియస్‌గా పరిగణిస్తుంది కదా? అధ్యక్షుడు చేయాల్సిన పనిని నువ్వెలా చేస్తావ్ అని ప్రశ్నిస్తుంది? యాక్షన్ తీసుకుంటుంది కదా? అని విశ్లేషకులు అంటున్నారు.
అంతేకాకుండా మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో కూడా స్థానిక ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి సర్పంచ్ అభ్యర్థులు దావత్‌లు అవీ ఇవీ అని ఖర్చులు పెట్టుకోవద్దని ఈటల సూచించారు. ఇప్పుడు కవిత కూడా స్ఠానిక ఎన్నికలపై క్లారిటీ లేదంటూ అవే పలుకులు పలికారు కదా? మరి ఈటల అన్నదాంట్లో ఏం తప్పుందని కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.