సీఎం రేవంత్ రెడ్డి కల నెరవేరేనా?

సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అంటున్నారు. సీఎం ఆదేశంతో పోలీసులు, టీన్యాబ్ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య డ్రగ్స్ దందా బాగోతాలపై ఈ కథనం.

Update: 2024-02-11 08:57 GMT
Telangana Secretariate

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలలు గన్న డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ సాధ్యమేనా? సీఎం ఆదేశంతో కొత్తగా ఏర్పాటైన యాంటీ నార్కొటిక్స్ బ్యూరో అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి డ్రగ్స్ నియంత్రణపై దృష్టి సారించారు.దీంతో చీకటి దందా అయిన డ్రగ్స్ బాగోతాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. ఒక వైపు డ్రగ్స్ నిరోధానికి దాడులను ముమ్మరం చేయడంతో పాటు యువత డ్రగ్స్ తీసుకోవద్దంటూ వారిలో అవగాహన కల్పించడానికి అధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణ, విక్రయాల బాగోతాల్లో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. 

సంగారెడ్డి డ్రగ్స్  రవాణాకు కేంద్రమా?

సంగారెడ్డి జిల్లా గంజాయి, డ్రగ్స్ కేంద్రంగా మారుతోందా? గత కొన్ని నెలలుగా వెలుగుచూసిన ఘటనలను పరిశీలిస్తే అవునని చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లా గంజాయి వ్యాపారులకు, నిషేధిత డ్రగ్స్ తయారీ దారులకు కేంద్రంగా మారింది. తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్‌గా ఉన్న సంగారెడ్డి..డ్రగ్స్ రవాణకు అనుకూల కేంద్రంగా మారింది. ఒడిశా-ఆంధ్ర సరిహద్దులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు అక్రమంగా సంగారెడ్డి మీదుగా గంజాయిని రవాణా చేస్తన్నారని తాజాగా వెల్లడైంది. సంగారెడ్డి జిల్లాలో గంజాయి, గంజాయి చాక్లెట్లు, గసగసాల స్ట్రా, నోర్డాజెపామ్, అల్ర్పాజోలం, ఇతర రకాల డ్రగ్స్‌ను ఇటీవల పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి పట్టణంలోని ఆర్ సి పురంలో తాజాగా 13 కిలోల గంజాయి పోలీసులకు దొరికింది. కర్ణాటక, మహారాష్ట్రలకు అక్రమంగా రవాణా చేస్తున్న క్వింటాళ్ల కొద్ది గంజాయి సంగారెడ్డి జిల్లాలో పట్టుకున్నారు. ఇటీవల మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 84 కిలోల గంజాయిని ఔటర్ రింగ్ రోడ్డులోని ముత్తంగి టోల్ గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.

దాబాల వద్ద గసగసాల గడ్డి విక్రయం

రాజస్థాన్ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న గసగసాల గడ్డిని దాబాలు కేంద్రాలుగా విక్రయిస్తున్నారని తాజాగా వెలుగుచూసింది. మాదకద్రవ్యాల వ్యాపారులు సదాశివపేట పోలీసు స్టేషన్ పరిధిలోని రెండు దాబాల వద్ద గసగసాల గడ్డిని విక్రయించారు. లారీ డ్రైవర్లే లక్ష్యంగా చేసుకొని జాతీయ రహదారిపై ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ నగరంలోని పురానాపూల్ ప్రాంతం నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకువచ్చి మల్కాపురం గ్రామంలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పారిశ్రామికవాడల్లోని పటాన్‌చెరు, జిన్నారం, హత్నూర, సంగారెడ్డి, సదాశివపేట ప్రాంతాల్లోని పరిశ్రమల కార్మికులకు ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది.

డ్రగ్స్ విక్రయాలపై  పోలీసుల శోధన

సంగారెడ్డిలోని పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ ను ఎరగా వేస్తున్నారని బయటపడింది. దీంతో ఈ డ్రగ్స్ విక్రయాలకు తెర వేయాలని సంగారెడ్డి పోలీసు సూపరింటెండెంట్ చెన్నూరి రూపేష్ ఇటీవల జరిపిన సమావేశంలో జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. రెండు పొరుగు రాష్ట్రాలకు ఎంట్రీ పాయింట్ లాగా ఉన్న సంగారెడ్డికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో శోధించాలని ఎస్పీ రూపేష్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాలతో గంజాయి చాక్లెట్లు విక్రయించే యూనిట్లు గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ విక్రయాల జోరు పెరగడంతో పరిశ్రమలు, కళాశాలల్లో సమావేశాలు నిర్వహించి డ్రగ్స్ వాడి మత్తులో పడొద్దు అంటూ సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి సైతం అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

డ్రగ్స్ దందాలో యువతులు సైతం...

హైదరాబాద్ నగరంలో ఇటీవల డగ్స్ దందా సాగిస్తున్న కొందరు యువతులను సైతం నగర పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ రాకెట్ వెనుక ఉన్న నైజీరియన్లను గుర్తించి వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లోని కిళ్లీ దుకాణాలు, కాఫీ షాపులు, పబ్ లలో మత్తుమందులను విక్రయిస్తున్నారు. హైక్లాస్ పార్టీలకు డెలివరీ బాయ్స్ ద్వారా డ్రగ్స్ చేరవేస్తున్నారు. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల వారి నాడీ వ్యవస్థ, మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆశ్రిత ఆసుపత్రి చీఫ్ డాక్టర్ రామమోహన్ రావు చెప్పారు.

రంగంలోకి డ్రగ్స్‌ను గుర్తించే జాగిలాలు

మాదకద్రవ్యాలను గుర్తించేందుకు తాజాగా తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కొటిక్స్ బ్యూరో అధికారులు శిక్షణ పొందిన జాగిలాలను రంగంలోకి దించారు. డ్రగ్స్ ను ఈ జాగిలాలు సులభంగా గుర్తించి వాటిని పట్టుకుంటాయని యాంటీ నార్కొటిక్స్ బ్యూరో అధికారి ఒకరు చెప్పారు. డ్రగ్స్ తీసుకున్న వారిని సులభంగా గుర్తించేందుకు అధునాతన పరికరాలను సైతం యాంటీ నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా తీర్చిదిద్దండి : సీఎం రేవంత్ రెడ్డి

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా తీర్చిదిద్దాలని సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వ్యవహారం ఎంతటి పెద్ద వారున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణ, విక్రయాలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కొటిక్స్ బ్యూరోను కూడా ఏర్పాటు చేసి, దీనికి డైరెక్టరుగా సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యాను డైరెక్టరుగా నియమించారు. నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులతో సమీక్షించిన సీఎం డ్రగ్స్ మాఫియా భరతం పట్టాలని సాక్షాత్తూ సీఎం ఆదేశించారు.

డ్రగ్స్ తయారీ గుట్టు రట్టు

సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో ఎలాంటి అనుమతి లేకుండా డయాసెరిన్ అనే డ్రగ్ కాంపోనెంట్ నుం తయారు చేస్తున్న రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేశారు. ఈ పరిశ్రమలో రూ.50 లక్షల విలువైన డయాసెరిన్ డ్రగ్ నిల్వలను తొమ్మిది డ్రమ్ముల్లో గుర్తించారు. లైసెన్సు లేకుండా ఈ డ్రగ్స్ ను తయారు చేసి విక్రయిస్తున్నారని డ్రగ్స్ కంట్రోల్ అధికారుల విచారణలో వెల్లడైంది.

డ్రగ్స్ మాఫియా గుట్టును రట్టు చేస్తాం : సందీప్ శాండిల్యా

తెలంగాణ రాష్ట్రంలో హెరాయిన్, ఎల్‌ఎస్డీ, ఎక్స్టసీ పిల్స్, కొకైన్, నల్లమందు, గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాలు, డ్రగ్స్ మాఫియా గుట్టును రట్టు చేసి వాటి ఆట కట్టిస్తామని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా చెప్పారు. దీని కోసం తాము డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించే పరికరాలు, జాగిలాలను సమకూర్చుకున్నామని, దాడులు, ఆకస్మిక తనిఖీల ద్వారా డ్రగ్స్ మాఫియాను పట్టుకుంటామని సందీప్ పేర్కొన్నారు.

డ్రగ్స్ మత్తులో నేరాలు

డ్రగ్స్ మత్తులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా చెప్పారు. హైదరాబాద్ నగరంలోని బిట్స్ క్యాంపస్ లో యాంటీ డ్రగ్ అబ్యూస్ సదస్సు-2024 నిర్వహించి విద్యార్థులను చైతన్యవంతులను చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ వాడకంతో మెదడు నియంత్రణ కోల్పోతుందని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా డ్రగ్స్ జోలికి వెళ్లవద్దని సందీప్ సూచించారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకువచ్చి డ్రగ్స్ వాడకుండా చర్యలు తీసుకుంటున్నామని సందీప్ శాండిల్యా చెప్పారు.

డ్రగ్స్ నిరోధానికి కఠిన చట్టాలు

డ్రగ్స్ నిరోధానికి పీడీ యాక్టుతోపాటు కఠిన చట్టాలను తీసుకువస్తామని సందీప్ శాండిల్యా వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో తెలంగాణ పోలీసు అధికారులు డ్రగ్స్ నియంత్రణపై దృష్టి సారించారు. తెలంగాణలో ఏర్పడిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వ డ్రగ్ ఫ్రీ తెలంగాణ సంకల్పం నెరవేరుతోందా? లేదా అనేది తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News