పులి సరే, గిరిజన పునరావాస మెక్కడ?

కవ్వాల అభయారణ్యంలో పులుల సంరక్షణ కోసం అటవీ గ్రామాల తరలింపు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. 11 ఏళ్లు గడిచినా గిరిజనుల పునరావాసం పూర్తి కాలేదు

Update: 2024-02-25 08:30 GMT
Tiger (Photo Credit : Facebook)

తెలంగాణ రాష్ట్రంలో తరచూ పులులు జనవాసాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని పులులు సంచరిస్తున్న కవ్వాల ప్రాంతాన్ని పులుల రక్షిత జోన్ అభయారణ్యంగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ 2012వ సంవత్సరంలో ప్రకటించింది. పులుల సంరక్షణకు ప్రాధాన్యమిచ్చిన కేంద్రం దట్టమైన అడవి మధ్యలోని గ్రామాల్లో ఏళ్ల తరబడిగా నివశిస్తున్న గిరిజనుల సంక్షేమాన్ని మరిచింది. అటవీ గ్రామాలను ఖాళీ చేయించి పులులకు ప్రశాంతత కల్పించాలని నిర్ణయించిన కేంద్రం గిరిజనుల పునరావాసంపై తీవ్ర జాప్యం చేస్తోంది.దీంతో అటవీ గ్రామాల గిరిజనులు అభయారణ్యంలోనే జీవనం గడుపుతున్నారు.


పులుల కోసం గ్రామాలు ఖాళీ
అడవి తల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న గిరిజనులు పులుల సంరక్షణ కోసం గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యం టైగర్ జోన్ కోసం రెండు గిరిజన అటవీ గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. కవ్వాల్ ప్రాంతాన్ని పులుల అభయారణ్యంగా గుర్తిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ 2012వ సంవత్సరం ఏప్రిల్ 10వతేదీన ఉత్తర్వులు జారీ చేసింది. 892 కిలోమీటర్లు ఉన్న కవ్వాల్ ప్రాంతాన్ని అభయారణ్యంగా గుర్తించారు. దట్టమైన అడవిలో ఉన్న 21 అటవీ గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలని నిర్ణయించారు.అనంతరం అభయారణ్యంలో ఉన్న రాంపూర్, మైసంపేట్ గ్రామాలను తక్షణం తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం దీని కోసం పునరావాస కమిటీని నియమించింది.


11 ఏళ్లు గడచినా అందని పునరావాసం
ప్రతి కుటుంబానికి పునరావాసం కింద కొందరికి రూ.15లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. పునరావాసం కింద డబ్బు తీసుకునేందుకు 48 కుటుంబాలు అంగీకరించాయి. మరో 94 కుటుంబాలకు ఒక ఇల్లు నిర్మాణంతో పాటు సాగుభూమిని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ భూమితోపాటు ఇల్లు నిర్మించి కాలనీ ఏర్పాటుచేసి వసతులు కల్పించాలని నిర్ణయించారు. 166 చదరపు గజాల్లో ఇల్లు నిర్మించి రెండున్నర ఎకరాల భూమిని ఇవ్వాలని అటవీ గ్రామాల గిరిజనులతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా కడెం మండలంలోని అటవీ ప్రాంతం బయట ఉన్న కొత్త మద్ధిపడగ గ్రామ శివార్లలో ఇళ్లను నిర్మించారు. పులుల ప్రశాంతత కోసమే ఈ అటవీ గ్రామాలను తరలించాలని నిర్ణయించారు. కవ్వాలను అభయారణ్యంగా ప్రకటించి 11 ఏళ్లు గడిచినా ఇంకా పునరావాసం గిరిజనులకు అందని ద్రాక్షగా మిగిలింది.

పునరావాస కాలనీలో పంపిణీకి ముందే ఇళ్లకు పగుళ్లు
అటవీ గ్రామాలను తరలింపు కార్యక్రమం 2013వ సంవత్సరంలో ప్రారంభించి 11 ఏళ్లు దాటినా ఇంకా గిరిజనులకు పునరావాసం కల్పించలేదు. పునరావాసంలో గిరిజనుల నుంచి పలు ఫిర్యాదులు ఉన్నాయి.అధికారులు నిర్మించిన ఇళ్లు పంపిణీకి ముందే పగుళ్లు ఏర్పడ్డాయి. రెండు పడక గదుల ఇళ్లను మొదట్లో రూ.4.5 లక్షలలో నిర్మించినా, దీని వ్యయాన్ని రూ.11 లక్షలకు పెంచారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత సరిగా లేదు. పునరావాసం కోసం అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా ప్రతి కుటుంబానికి 2.32 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే పొరుగున ఉన్న పెత్తూరుపూర్, మాసాయిపేట గ్రామాల ప్రజల నుంచి ఈ భూమి తమదని అంటున్నారు. 2018వ సంవత్సరం అక్టోబరు 22వతేదీన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పునరావాసం కోసం రూ.852 లక్షలను విడుదల చేసింది. దీంతో అప్పటి అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రస్థుత తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జోక్యంతో 2023వ సంవత్సరంలో పునరావాస పనులు ప్రారంభమయ్యాయి.

పునరావాసం కల్పించాకే అటవీ గ్రామాలు ఖాళీ చేయాలి : ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రాథోడ్ రమేష్
కవ్వాల పులుల అభయారణ్యంలోని రాంపూర్, మైసంపేట గ్రామాల గిరిజనులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాకే గ్రామాలను ఖాళీ చేయించాలని ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత రాథోడ్ రమేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పదకొండేళ్లుగా అటవీ గ్రామాల గిరిజనులకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన పేర్కొన్నారు. పునరావాస కల్పన జాప్యం వల్ల గిరిజనులు దట్టమైన అటవీప్రాంతం మధ్య పులుల మధ్య భయం భయంగా జీవనం గడపాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులు పులుల సంరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యం గిరిజనులకు ఇవ్వడం లేదని రమేష్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలో అటవీ గ్రామాలను తరలిస్తాం : రాష్ట్ర అటవీశాఖ చీఫ్ డోబ్రియాల్ 
ప్రతి కుటుంబంలో 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కుటుంబంలోని పురుష సభ్యుడు పునరావాస పథకానికి అర్హుడు. కానీ 18 ఏళ్లు నిండిన తమకు కూడా పునరావాసం కల్పించాలని గిరిజన యువతులు కోరుతున్నారు. పునరావాసం కింద నిర్మించిన ఇళ్ల నిర్మాణం సరిగా లేదని, వ్యవసాయం కోసం కేటాయించిన భూమిని చదును చేయలేదని మైసంపేట గ్రామానికి చెందిన గిరిజన నాయకుడు కోవా ప్రవీణ్
‘ఫెడరల్ తెలంగాణ’
కు చెప్పారు. పునరావాస పథకంలో లొసుగులతో అటవీ గ్రామాల తరలింపు జరగలేదు.పునరావాస గ్రామమైన మద్ధిపడగను తెలంగాణ అటవీశాఖ చీఫ్ డోబ్రియాల్ ఇటీవల సందర్శించారు. రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించిన డోబ్రియాల్ అధికారులు పలు సూచనలు చేశారు. త్వరలో అటవీ గ్రామాల గిరిజనులకు పునరావాసం కల్పించి, రాంపూర్, మైసం పేట గ్రామాలను తరలిస్తామని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్ చెప్పారు.







Tags:    

Similar News