అపరిశుభ్ర హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ కొరడా

హైదరాబాద్‌లో అపరిశుభ్ర హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ కొరడా ఝళిపిస్తోంది.ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించని హోటళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Update: 2024-05-27 02:00 GMT
ఓ హోటల్ కిచెన్ లో తనిఖీలు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ (ఫొటో : ఫుడ్ సేఫ్టీ విభాగం సౌజన్యంతో)

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోని హోటళ్ల దుస్థితి ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలైంది. గత 40 రోజులుగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సాగిస్తున్న ఆకస్మిక తనిఖీలతో పలు షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి.

- హైదరాబాద్ నగరంలో వందకు పైగా ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేయగా వాటి కిచెన్లు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయని తేలింది. ప్రముఖ హోటళ్లు సైతం కాలం చెల్లిన, కల్తీ ఆహార పదార్థాలను కూడా వాడుతున్నారని తనిఖీల్లో వెల్లడైంది.
- ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006, 2011 రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం నిబంధనలు పాటించని వందకు పైగా హోటళ్లకు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న మరికొన్ని హోటళ్ల యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
- హోటళ్లే కాదు బేకరీలు, ఫ్రూట్ జ్యూస్ స్టాల్స్, ఐస్ క్రీం పార్లర్లు, పండ్ల దుకాణాలు ఇలా ఒకటేమిటి ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకునేందుకు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కదిలింది.

ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డి హరిచందన, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ ల ఆదేశాలతో హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలతో హోటళ్ల యజమానులను హడలెత్తిస్తున్నారు. ప్రతీ రోజూ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ విధులకు హాజరుకాగానే ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఏ ప్రాంతంలో ఏ ఏ హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు చేయాలో ఫోనులో ఆదేశాలు జారీ చేస్తున్నారు. అత్యంత పకడ్బందీగా హోటళ్లపై సాగుతున్న ఆకస్మిక తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి.

ఆకస్మిక తనిఖీలతో హడల్
హైదరాబాద్ నగరంలో వందకు పైగా హోటళ్లపై తాము తనిఖీలు చేసి, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటల్ యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బాలాజీరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఏప్రిల్ 16వతేదీన ఆకస్మిక తనిఖీలు ప్రారంభించి గత 40 రోజులుగా కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ తనిఖీల్లో హోటళ్ల బండారం బయటపడటంతో నగరంలోని ప్రముఖ హోటళ్లతో పాటు చిన్న హోటళ్లలోనూ తినాలంటేనే వినియోగదారులు భయపడుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ పదార్థాలతో వండిన వంటకాల వల్ల ప్రజలకు పలు అనారోగ్యాలు వాటిల్లుతున్నాయని హైదరాబాద్ నగరానికి చెందిన ఆశ్రిత హాస్పిటల్ డాక్టర్ ఎ రామమోహన్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హోటళ్లలో తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు, కేన్సర్లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా హోటళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు కట్టుదిట్టం చేయాలని వినియోగదారుల సంఘం ప్రతినిధి బీవీ రమణ డిమాండ్ చేశారు.

ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటళ్లు ఎన్నో...
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటళ్లు ఎన్నో ఉన్నాయని తేలింది. ఈ తనిఖీల్లో జూబ్లీహిల్స్ లోని బాబీలాన్ బార్ అండ్ కిచెన్,గౌరాంగ్ కిచెన్,ఆశ్రిత హోటల్స్, ఎర్తన్ బార్ అండ్ కిచెన్, ఔరా కేఫ్ అండ్ ఇన్ ఫ్యూజన్ బార్, జీరో 40 బ్రేవింగ్, నవమి పట్టేసెరి, చర్లపల్లిలోని శ్రీ బేవరేజెస్, పంజాగుట్టలోని షాన్ బాగ్ హోటల్ డీలక్స్, ఛట్నీస్ రెస్టారెంట్, కొంపల్లిలోని మనిర్వా హోటల్, బర్కాస్ ఇండో అరబిక్ రెస్టారెంట్, బేగంపేటలోని ఐటీసీ కాకతీయ, మేరిగోల్డ్, కూకట్ పల్లిలోని టీజీఐ ఫ్రైడేస్, పద్మారాగ గ్రూప్ ఆఫ్ హోటల్స్, క్రుతుంగా రెస్టారెంట్, ఉప్పల్ లోని పిస్తాహౌస్, హోటల్ సాయి బృందావన్, మాస్టర్ చెఫ్ రెస్టారెంట్, మెక్ డోనాల్డ్, కాఫీట్రీ, కొత్తపేటలోని ఎస్ఎస్ బీ బనానా ఫ్రూట్ కంపెనీ, షేక్ ఖయ్యూమ్ ట్రేడింగ్ కంపెనీ, చింతల్ కుంటలోని అమరావతి, మెక్ డోనాల్డ్, జీవీకే వన్ లోని అహ దక్షిణ్, సిజ్లింగ్ జో, బంజారాహిల్స్ లోని రోస్టరీ కాఫీ హౌస్, రోస్ట్, శరత్ సిటీమాల్ లో ని రీజాయ్ ఎంటర్ ప్రైజెస్, ఎయిర్ లైవ్ పబ్, టాకో బెల్, బాసిక్ హోస్పిటాలిటీ, మొజాంజాహీ మార్కెట్ లోని బిలాల్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, జాంబాగ్ లోని జనతా ఫ్రూట్ షాప్, వహీద్ ఫ్రూట్ షాప్, హిమాయత్ నగర్ లోని ప్లాటినం బిజినెస్ హోటల్స్, క్రీమ్ స్టోన్ కాన్సెప్ట్, కోఠిలోని గోకుల్ ఛాట్, ఆబిడ్స్ లోని శ్రీనర్సింగ్ భేల్పూరి అండ్ జ్యూస్ సెంటర్, అమీర్ పేటలోని అథంటిక్ అరోమాస్ ఫైవ్ స్టార్ హోటల్, రత్నదీప్ రిటైల్, రిక్కీ న్యూట్రింట్స్, కేఎఫ్ సీ, సైఫాబాద్ లోని కామత్ హోటల్, హోటల్ సుఖసాగర్, రాయలసీమ రుచులు, షాగోస్ మల్టీకుషన్ రెస్టారెంట్, సోమాజీగూడలోని సుప్రీత్ బిజినెస్ ఎంటర్ ప్రైజెస్, క్రుతుంగా రెస్టారెంట్, యమ్ రెస్టారెండ్ ఇండియాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఫైవ్ స్టార్ తోపాటు ప్రముఖ హోటళ్లకు తాము షోకాజు నోటీసులు జారీ చేశామని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బాలాజీరావు వివరించారు.

కల్తీ కేసుల్లో హైదరాబాద్‌దే అగ్రస్థానం
దేశంలోనే అత్యధిక ఆహార కల్తీ కేసులతో హైదరాబాద్ అగ్ర స్థానంలో నిలచిందని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో వెల్లడించింది. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో 291 శాంపిళ్లు కల్తీవని తేలంగా అందులో అధికభాగం అంటే 246 కల్తీ కేసులు హైదరాబాద్ నగరంలోనే వెలుగుచూశాయి. దేశంలో నమోదైన కల్తీ కేసుల్లో 84 శాతం కేసులు మన హైదరాబాద్ లో నమోదయ్యాయంటే దేశంలో కల్తీ ఏ స్థాయిలో ఉందో విదితమవుతోంది.

సింథటిక్ ఆహార రంగుల వినియోగం
హైదరాబాద్ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. హోటళ్లలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఆహార నాణ్యత సూచీలో దేశంలో తెలంగాణ 15వ స్థానంలో ఉందంటే మన హోటళ్ల దుస్థితి ఏమిటో తెలుస్తుంది. హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో తెలంగాణ ఆహార భద్రతా విభాగం జరిపిన తనిఖీల్లో అపరిశుభ్రత కనిపించింది. టాస్క్ ఫోర్స్ బృందం లేబుల్ చేయని ఉత్పత్తులను కనుగొంది. ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవని తనిఖీల్లో తేలింది. బెంగళూరు నుంచి వచ్చిన ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్ లో సింథటిక్ ఆహార రంగులను గుర్తించారు. కేఫ్ స్టోర్ రూంలో బొద్దింకలున్నాయి.

తనిఖీల్లో వెలుగుచూసిన షాకింగ్ వాస్తవాలు
తెలంగాణ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం మసాబ్ ట్యాంక్ ప్రాంతంలోని రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించగా పలు షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి. మసాబ్ ట్యాంక్‌లోని ప్రముఖ ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ లో సింథటిక్ రంగులున్నాయి. వంటగదిలో నిల్వ చేసిన ఆహార పదార్థాలు, సరైన లేబులింగ్ లేదా కవర్ లేని ముడి ఆహార పదార్ధాలు దొరికాయి. చిచా అస్లీ హైదరాబాదీ ఖానా వద్ద వంటగదిలో నిల్వ చేసిన సింథటిక్ ఆహార రంగులను కనుగొన్నారు.

ప్రముఖ హోటళ్లకు షోకాజ్ నోటీసులు
ప్రముఖ హోటల్ అయిన ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ హ్యాండ్లర్లు హెయిర్ కవర్లు, గ్లోవ్స్ పెట్టుకోలేదు. ఫుడ్ టాస్క్ ఫోర్స్ బృందం హైదరాబాద్‌లోని గిడ్డంగులు, రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. కొండాపూర్ లోని మసీదు బండాలో ఉన్న పెద్ద బాస్కెట్ గిడ్డంగిని అధికారులు పరిశీలించారు. గడువు ముగిసిన చికెన్ మసాలా, చికెన్ సాసేజ్‌లు, పిజ్జా చీజ్, పన్నీర్, ఐస్ క్రీం, బాదం ఫడ్జ్, ఎలిడబుల్ ఆయిల్ లీకేజ్, కలుషితమైన ఆహార పదార్థాలను కనుగొన్నారు. బిగ్ బాస్కెట్ గిడ్డంగి లైసెన్స్‌ను రద్దు చేశారు. బాహుబలి వంటగదిలో బొద్దింకలను గుర్తించారు. వంటగది అపరిశుభ్రంగా ఉంది.

కిచెన్లు...అపరిశుభ్రతకు నిలయాలు
టాస్క్ ఫోర్స్ బృందం క్రితుంగా,పాలెగర్ వంటకాల రెస్టారెంట్, హోటల్ సాయి బృందావన్, మాస్టర్ చెఫ్ రెస్టారెంట్, రెస్ట్ ఓ బార్,కెఎఫ్‌సితో సహా అగ్రశ్రేణి రెస్టారెంట్ల తనిఖీలు చేశారు. ఈ హోటళ్లలో అపరిశుభ్రంగా ఆహార నిల్వ చేశారని, గడువు ముగిసిన ఆహారాన్ని ఉంచారని తేలింది. ఈగలు ప్రవేశించకుండా ఉండటానికి సరైన మెష్ లేకుండా వంటగది ఉంది. మాస్టర్ చెఫ్ వద్ద అధికారులు సింథటిక్ ఆహార రంగుల వాడకాన్ని కనుగొన్నారు.

కాలం చెల్లిన ఆహార పదార్థాలు
గడువు ముగిసిన నాలుగు విజయ పాల ప్యాకెట్లు, 65 కిలోల లేబుల్ చేయని అల్లం వెల్లుల్లి పేస్ట్,బేకరీ వస్తువులు దొరికాయి. రిఫ్రిజిరేటర్ అపరిశుభ్రమైన స్థితిలో ఉంది. హెయిర్‌క్యాప్స్, గ్లోవ్స్, ఆప్రాన్స్, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేని ఫుడ్ హ్యాండ్లర్లు కనిపించారు. శాఖాహారం, మాంసాహార ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో కలిపి నిల్వ చేశారు. సింథటిక్ ఆహార రంగుల వాడకం కనుగొన్నారు.


Tags:    

Similar News