రు.80 వేలకు బంగారం, కిలో వెండి లక్ష: అంతర్జాతీయ పరిస్థితులే కారణం!

ఇజ్రాయిల్‌కు, హమాస్-హిజ్‌బుల్లాకు మధ్య, ఇజ్రాయిల్‌కు, ఇరాన్‌కు మధ్య యుద్ధాలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికా ఎన్నికలు బంగారం ధర పెరగటానికి కారణమవుతున్నాయి.

Update: 2024-10-22 12:41 GMT

బంగారం ధర కొత్త రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం తులం ధర రు.80 వేలు దాటింది. 22 క్యారట్ బంగారం ధర రు. 73 వేలకు చేరింది. మరోవైపు వెండి ధర కూడా దూసుకుపోతోంది. కిలో వెండి ధర ఇవాళ ఒకేరోజులో రు.5 వేలు పెరిగి లక్ష రూపాయల మైలురాయికి చేరుకుంది.

బంగారం, వెండి ధరలు ఇలా విపరీతంగా పెరిగిపోవటంపై ఆభరణాల వ్యాపారులు, వినియోగదారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం కొనుగోళ్ళపై పడి తమ వ్యాపారం తగ్గిపోతుందని వ్యాపారులు వాపోతున్నారు. వాస్తవానికి బంగారంపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తగ్గించటంతో ధరలు 7 శాతం తగ్గాయి, డిమాండ్ పెరిగింది. కానీ అది మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. ధరలు మళ్ళీ పెరిగి కొత్త రికార్డులు సృష్టిస్తుండటంతో డిమాండ్ తగ్గుముఖం పట్టింది.

అమెరికాలో కూడా ఇదే తీరు

ఇక్కడే కాదు అమెరికన్ మార్కెట్‌లో కూడా బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. అక్కడ ట్రాయ్ ఔన్స్(31 గ్రా.లు) బంగారం ధర ప్రస్తుతం 2,700 డాలర్లకు చేరుకుంది. ఈ పెరుగుదల ఇలాగే మూడు నెలలదాకా కొనసాగుతుందని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే మూడు నెలలల్లో 2,800 డాలర్లకు, ఆరు నెలల్లో 3,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికన్ డాలర్ బలహీనపడటం, పెరిగిపోతున్న అమెరికా అప్పు, అక్కడి సెంట్రల్ బ్యాంకులు చేస్తున్న బంగారం కొనుగోళ్ళు ధర పెరుగుదలకు కారణాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో ఈ ఏడాది పెరుగుదల

ప్రపంచం మొత్తంలో చైనా తరువాత బంగారాన్ని ఎక్కువగా ఉపయోగించే దేశం మనదేశమే. ఈ ఏడాది జనవరి 1వ తేదీన మనదేశంలో 24 క్యారట్ బంగారం తులం ధర రు.63,970 గా ఉంది. అంటే ఇవాళ్టి రేటుతో పోలిస్తే దాదాపు రు.16 వేలు పెరిగింది. ఈ పెరుగదల ఈ ఏడాది 37%, రెండేళ్ళ క్రితంధరతో పోల్చుకుంటే 64%గా ఉంది. ఇంతగా పెరగటం గతంలో 2008లో అమెరికాలో మాంద్యం సమయంలోనే జరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. మనదేశంలో అత్యధికశాతం బంగారు కొనుగోళ్ళు భౌతికరూపంలోనే జరుగుతున్నా, ఇటీవల గోల్డ్ ఈటీఎఫ్(ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్)ల రూపంలో కూడా కొనుగోలు చేస్తున్నారు. వెంటనే డబ్బురూపంలోకి మార్చుకునే అవకాశం, తక్కువ ఖర్చులు, తక్కువ పన్నులు, డిజిటల్ ట్రేడింగ్ అవకాశాలు వంటి కారణాల రీత్యా ఈటీఎఫ్‌లపై కొందరు మొగ్గు చూపుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితులు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కల్లోల పరిస్థితులే బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఒకవైపు మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్‌కు, హమాస్-హిజ్‌బుల్లాకు మధ్య జరుగుతున్న యుద్ధం, ఇజ్రాయిల్‌కు, ఇరాన్‌కు మధ్య ఘర్షణ, మరోవైపు రష్యాకు, ఉక్రెయిన్‌కు మధ్య కొనసాగుతున్న యుద్ధం వంటి అల్లకల్లోల పరిస్థితులకు తోడుగా అమెరికా ఎన్నికలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. అమెరికా ఎన్నికలు నవంబర్‌లో జరుగనున్న సంగతి తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారం కొనుగోళ్ళు

ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు ఎప్పుడు చోటు చేసుకున్నా ఇన్వెస్టర్‌లు సురక్షిత మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటారన్నది మార్కెట్‌లో మౌలిక సూత్రం. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోంది. ఇన్వెస్టర్‌లు సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.

వారంలో ధన్ తేరాస్, దీపావళి పండుగలు

ధన్ తేరాస్, దీపావళి పండుగలు వారంరోజుల్లో రానున్నాయి. మనదేశంలో ఈ రెండు పండుగల సందర్భంగా బంగారం కొనుగోలు చేయటం రివాజుగా ఉంది. దీనికి రెండు కారణాలు - కానుకలుగా ఇవ్వటం, పెట్టుబడిగా కొనటం. మరి ధరలు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోళ్ళు ఎలా ఉంటాయో చూడాలి.

మధ్య ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అనిశ్చితి పరిస్థితులు కారణమని షేర్ ఆర్థికరంగ నిపుణుడు సుబ్రమణ్యం అన్నారు. ఈక్విటీ మార్కెట్ పీక్స్‌కు వెళ్ళిపోయి ఆగిపోవటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పూర్తిగా వెనక్కు తీసుకోవటం కూడా కారణాలని చెప్పారు. బంగారంలో పెట్టుబడి పెట్టదలుచుకుంటే కాయిన్స్, బిస్కెట్‌ల రూపంలో కొనుక్కోవటమే మంచిదని సూచించారు. డిజిటల్ బంగారంకంటే భౌతికరూపంలో కొనుగోలు చేయటమే మేలని, డిజిటల్ బంగారంపైన జీఎస్‌టీ వంటి పన్నులు అదనంగా పడతాయని చెప్పారు.

షేర్ మార్కెట్ పడిపోవటం, రూపాయి పతనం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అల్లకల్లోల పరిస్థితులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవటం బంగారం ధరల పెరుగుదలకు కారణమని షేర్ మార్కెట్ నిపుణుడు మణిశర్మ అన్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత నెల రోజులకాలంలో రు.84 వేల కోట్లు షేర్లు అమ్మేశారని తెలిపారు.

చమురు ధరలలో కూడా పెరుగుదల

అంతర్జాతీయంగా నెలకొన్న కల్లోల పరిస్థితులతో బంగారమే కాదు, చమురు ధర కూడా పెరుగుతోంది. ఇరాన్‌లో చమురు ఉత్పత్తి కేంద్రాలపై ఇజ్రాయిల్ దాడిచేయనుందని వార్తలు వస్తుండటంతో చమురు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. బ్యారెల్ చమురు ధర 74 డాలర్లకు చేరుకుంది.

Tags:    

Similar News