రేపు, ఎల్లుండి కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య హైఓల్టేజ్ వార్
కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రేపు, ఎల్లుండి హైఓల్టేజ్ వార్ జరగబోతోందా అంటే అవునంటున్నారు రెండు పార్టీల నేతలు. రెండు పార్టీల మధ్య జలయుద్ధం ఆసక్తికరంగా మారింది.
అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రేపు, ఎల్లుండి హైఓల్టేజ్ వార్ జరగబోతోందా అంటే అవునంటున్నారు రెండు పార్టీల నేతలు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు ప్రధాన పార్టీలు పోటాపోటీగా శ్వేతపత్రం విడుదల,మేడిగడ్డ సందర్శన, నల్డొండలో కేసీఆర్ బహిరంగసభలతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా మారింది. సోమవారం అసెంబ్లీలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన బాగోతంతోపాటు నీటిపారుదల శాఖపై అధికార కాంగ్రెస్ పార్టీ శ్వేత పత్రాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభ్యులు ఎవరికి వారు తమ వాదనను వినిపించేందుకు ఆదివారమే సన్నాహాలు చేసుకున్నారు.
ప్రజాభవన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ
శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో ఆదివారం ప్రజాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమై శ్వేతపత్రంపై చర్చించారు. దీంతోపాటు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంపై తెలంగాణ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ జరిపి మధ్యంతర నివేదికను కూడా సమర్పించింది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు గణనీయంగా పెంచడంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక కూడా ఉంది.
మేడిగడ్డ బాగోతంపై కాంగ్రెస్ విమర్శల వర్షం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ రంగంలో జరిగిన అక్రమాలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కుపెట్టి విమర్శల వర్షం కురిపిస్తోంది. తాము నీటిపారుదల శాఖలో జరిగిన అక్రమాలపై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. నీటిపారుదల శాఖపై అధికార కాంగ్రెస్ ప్రవేశపెట్టనున్న శ్వేత పత్రాన్ని తిప్పికొట్టేలా ప్రస్థుత అధికార పార్టీని లక్ష్యం చేసుకుంటూ తమ వాదన వినిపించాలని మాజీ మంత్రి హరీష్ రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. దీంతో సోమవారం అసెంబ్లీ వేధికగా అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాద ప్రతివాదనలు వాడివేడిగా సాగవచ్చని ఓ సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు.
13న రెండు పార్టీల మధ్య జలయుద్ధం
మరో వైపు మంగళవారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య జలయుద్ధం జరగనుంది. శాసనసభ్యులను మేడిగడ్డ బ్యారేజీ వద్దకు తీసుకువెళ్లి ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, మంత్రులు, శాసనసభ్యులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సందర్శించనన్నారు. మేడిగడ్డ విమర్శల వర్షాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నల్గొండలో కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు సమాయత్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించారని, దీనిని నిరసిస్తూ తమ గళాన్ని వినిపించేందుకు కేసీఆర్ సమాయత్తమయ్యారు.
వేడెక్కిన తెలంగాణ రాజకీయాలు
మేడిగడ్డ సందర్శన, బీఆర్ఎస్ సభతో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. నల్గొండ సభకు భారీగా జనసమీకరణ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని బీఆర్ఎస్ హైదరాబాద్ నగర ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చెప్పారు. రేపు, ఎల్లుండి తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ జల యుద్ధం తీవ్రతరం కానుంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.