జగన్‌కు పుండుమీద కారంలాంటి పరిస్థితి!

అప్పట్లో జగన్‌పై, వైఎస్ కుటుంబ నేపథ్యంపై జేసీ బ్రదర్స్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. అసలు వైఎస్ కుటుంబీకులు సరైన రెడ్లు కాదని, తాము పెద్ద రెడ్లమని చెప్పారు.

Update: 2024-07-29 10:18 GMT

రాయలసీమలో ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి మరో సంచలనానికి తెరతీశారు. ఇవాళ హైదరాబాద్‌లో వైఎస్ విజయమ్మను ఇంటికి వెళ్ళి మరీ కలిసి ఫోటోలు దిగి మీడియాకు విడుదల చేశారు. ఇది జగన్‌కు పుండు మీద కారంలాంటి పరిస్థితే అని చెప్పుకోవచ్చు.

రాయలసీమలో జగన్‌‍ను సై అంటే సై అంటూ ఎదుర్కొన్న నేత ఎవరైనా ఉన్నారంటే అది జేసీ బ్రదర్సే. వాస్తవానికి ఈ వైరం ఇప్పటిది కాదు. వైఎస్ రాజారెడ్డి నుంచి కొనసాగుతున్నది. కడపజిల్లాలో మైనింగ్, సారాయి వ్యాపారాలను చేసే రాజారెడ్డి అప్పట్లో అనంతపురానికి విస్తరించటానికి ప్రయత్నించినప్పుడు జేసీ బ్రదర్స్ అడ్డుపడ్డారు. 



2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పడు, గత వైరం గురించి తెలిసినా జేసీ దివాకర్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దానికి కారణం అప్పటికి వైఎస్‌కు పార్టీపైన పూర్తి స్థాయిలో కమాండ్ రాకపోవటమే. హైకమాండ్ ఎలా చెబితే అలా చేశారు. అయితే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే సమయానికి పార్టీపైన పూర్తి కమాండ్ రావటంతో దివాకర్ రెడ్డిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. దీనిపై దివాకర్ చాలా గింజుకున్నారు. వైఎస్‌కు దగ్గరవ్వటానికి ప్రయత్నించారు. ఇంతలోనే వైఎస్ మరణించారు. తదనంతర కాలంలో కాంగ్రెస్ పరిస్థితి కుదేలవటంతో జగన్ పెట్టిన వైసీపీలో చేరదామని బ్రదర్స్ ప్రయత్నించారు. కానీ జగన్ సుముఖత చూపించలేదు.

2014 ఎన్నికలముందు జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరారు. అప్పట్లో జగన్‌ను, అతని తండ్రి, తాత, వారి కుటుంబ నేపథ్యంపై దివాకర్, ప్రభాకర్ తీవ్రమైన పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. అసలు వైఎస్ కుటుంబీకులు సరైన రెడ్లు కాదని, తాము మాత్రమే పెద్ద రెడ్లమని కూడా చెప్పుకొచ్చారు. ఇదంతా మనసులో పెట్టుకున్న జగన్, అధికారంలోకి వచ్చాక తన ప్రతాపాన్ని చూపారు. 2019 తర్వాత వైసీపీకి దగ్గరవుదామని జేసీ బ్రదర్స్‌‌ సంకేతాలు ఇచ్చినా దగ్గరకు రానీయలేదు. 2019 ఎన్నికల్లో దివాకర్ రెడ్డి కొడుకు పవన్ అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. వైసీపీ హయాంలో జేసీలకు ప్రధాన వ్యాపారమైన ట్రావెల్స్‌లోని పలు లొసుగులు బయటపడ్డాయి, కేసులు నమోదయ్యాయి. ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి కొంతకాలం జైలులో గడపాల్సివచ్చింది. అయితే ఆ పరిస్థితిలోనూ వారు దీటుగా వైసీపీకు ఎదురు నిలిచారు.

ఇటీవలి ఎన్నికల్లో జేసీ కుటుంబానికి తెలుగుదేశం ఒక్క టికెట్ ఇచ్చింది. అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి రోజులు రావటంతో ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, జగన్ ప్రభుత్వంలో తాము పడ్డ కష్టాలు చెప్పుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారు. తమను దొంగలలారా అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేశారని, తిండి కూడా పెట్టలేదని ఆరోపించారు. పేర్నినానిని, ఐపీఎస్ సీతారామాంజనేయులును దుయ్యబట్టారు.

ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఇవాళ విజయమ్మను కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయమ్మ ఇప్పటికే ఇటీవలి ఎన్నికల్లో షర్మిలను గెలిపించాలంటూ సరిగ్గా పోలింగుకు ముందు వీడియో విడుదల చేయటం తెలిసిందే. ఆ వీడియో ఓటర్లపై చాలా ప్రభావం చూపిందని వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. సొంత తల్లి, చెల్లికే న్యాయం చేయలేనివాడు సమాజానికి ఏం చేస్తాడంటూ ప్రత్యర్థులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇటువంటి సమయంలో విజయమ్మ తనకు బద్ధ శత్రువులాంటి జేసీ ప్రభాకర్ రెడ్డిని కలవటం జగన్‌కు మింగుడు పడని విషయమే.

అయితే ప్రభాకర్ రెడ్డి మాత్రం తాను విజయమ్మను ఎందుకు కలిసిందీ వివరించలేదు. కానీ, విజయమ్మ పుట్టినిల్లు తాడిపత్రి నియోజకవర్గమేనని, ఆమె పుట్టినింటివారికి, జేసీ బ్రదర్స్‌కు దూరపు బంధుత్వం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ బంధుత్వంతో విజయమ్మ ఎలా ఉన్నారని పరామర్శించటానికి మాత్రమే ప్రభాకర్ రెడ్డి వెళ్ళారని చెబుతున్నారు. మరోవైపు జగన్‌ను ఉడికించటానికే ఆయన ఆమెను కలిసిఉంటారని కూడా అంటున్నారు. దీనిపై ప్రభాకర్ ఏమి వివరణ ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News