ఉచిత విద్యుత్ ఇస్తే బీజేపీకి ప్రచారం చేస్తా: మోదికి కేజ్రీవాల్ సవాల్

బీజేపీకి ధైర్యముంటే, వచ్చే నెలలో మహారాష్ట్ర, జార్ఘండ్ రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీలో కూడా ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.

Update: 2024-10-06 13:50 GMT

బీజేపీ అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలలో ఉచిత విద్యుత్‌ను ఇస్తే, ఢిల్లీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ తరపున తాను ప్రచారం చేస్తానని ఆప్ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదికి సవాల్ విసిరారు. బీజేపీకి ధైర్యముంటే, వచ్చే నెలలో మహారాష్ట్ర, జార్ఘండ్ రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీలో కూడా ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.

ఇవాళ ఢిల్లీలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, రాష్ట్రాలలోని బీజేపీవారి డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. హర్యానా, కశ్మీర్ రాష్ట్రాలలో ఆ పార్టీకి శృంగభగం జరిగిందని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలంటే ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం అన్నారు.

కేజ్రీవాల్ తన చేతిలో ఒక స్వీట్ ప్యాకెట్ పట్టుకుని చూపుతూ, తమ ప్రభుత్వం ఉచితంగా ఆరు స్వీట్లు ఇస్తోందని, అవి ఉచిత విద్యుత్, మంచినీరు, మహిళలకు బస్ టికెట్, వృద్ధులకు తీర్థయాత్రలు, వైద్యసేవలు, విద్య అని చెప్పారు. ఈ స్వీట్ ప్యాకెట్‌లను సభకు వచ్చినవారు అందరికీ ఇస్తామని, వీటిని ప్రసాదంగా పరిగణించి, ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ చేసి అందరికీ పంచాలని కోరారు. బీజేపీకి ఓటు వేస్తే ఈ ఆరు పథకాలూ మాయమైపోతాయని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే, ప్రభుత్వ పాఠశాలలు, డీటీసీ బస్సులను, ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేస్తారని ఆరోపించారు.

ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని, లెఫ్టినెంట్ గవర్నర పాలన ఉందని, ఈ ఎల్‌జీ పాలననుంచి ఢిల్లీకి విముక్తి కలిగిస్తానని, త్వరలో రాష్ట్ర హోదా తీసుకొస్తానని అన్నారు. తనకు జైలులో ఇన్సులిన్ ఆపేశారని, తన కిడ్నీలు విఫలమై చనిపోయి ఉండేవాడినని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడుతూ, బీజేపీ వారసులు, బంధువులకు మాత్రమే టికెట్లు ఇస్తుందని, ఆప్ పార్టీ సామాన్యులకు ఇస్తుందని అన్నారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినపుడు, తన భార్యను ముఖ్యమంత్రిగా చేస్తానని బీజేపీ పుకార్లను ప్రచారం చేసిందని, తాను ఒక పార్టీ కార్యకర్తను ముఖ్యమంత్రిని చేశానని చెప్పారు. ఢిల్లీలోని 2 కోట్లమంది ప్రజలే తన కుటుంబ సభ్యులని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రజలకు త్వరలో ఏడో ఉచిత పథకంకూడా ఇవ్వబోతున్నామని చెప్పారు.

Tags:    

Similar News