పోలింగ్ రోజు ఆంధ్రా, తెలంగాణలో వర్షాలు..ఓటింగ్ శాతం ప్రభావితమవుతోందా?

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మే 13వతేదీన సోమవారం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయా? అంటే అవునంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు.

Update: 2024-05-10 09:01 GMT
పోలింగ్ రోజు ఆంధ్రా, తెలంగాణలో వర్ష సూచన

పార్లమెంట్ ఎన్నికల పర్వంలో కీలకమైన మే 13వతేదీ... పోలింగ్ రోజు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. తెలంగాణలో పోలింగ్ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం అంచనా వేసింది.

- మే 13వతేదీ సోమవారం తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
- పోలింగ్ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది.
- రాజస్థాన్ నుంచి వస్తున్న ద్రోణి ప్రభావం వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, హన్మకొండ, జనగామ, నిర్మల్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, కొమురం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, వనపర్తి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త రవీందర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

తగ్గిన ఉష్ణోగ్రతలు
ఇటీవల కురిసిన వర్షాల వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గతంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో 47 డిగ్రీలకు పెరిగిన ఉష్ణోగ్రతలు ఇటీవల కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్ కు లోపు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉష్ణోగ్రత 36.1 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయింది. వర్షపాతం వల్ల ఎండవేడిమి ప్రభావం తగ్గింది. శుక్రవారం కూడా మరిన్ని వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్‌ అంచనా వేసింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత నాగర్‌కర్నూల్‌లో 33.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. హైదరాబాద్, ఖైరతాబాద్‌లో కూడా ఉష్ణోగ్రత 36.1 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది.

ఓటింగ్ శాతాన్ని వర్షాలు ప్రభావితం చేస్తాయా?
తెలంగాణలో పోలింగ్ రోజున వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం అంచనా వేయడంతో దీనివల్ల రాష్ట్రంలోని ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలో వేడిగాలుల పరిస్థితుల కారణంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక గంట పొడిగించింది. వర్షాలు కురిసినా గంట పోలింగ్ సమయం పెంచడం వల్ల ఓటర్లు వర్షం తెరిపి ఇచ్చినపుడు వచ్చి ఓట్లు వేయవచ్చని బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి తిగుళ్ల పద్మారావు చెప్పారు. ఓ మోస్తరు వర్షం కురిసినా పోలింగ్ ప్రక్రియ ఆగదని ఆయన పేర్కొన్నారు.

నేడు పలు జిల్లాల్లో వర్షాలు
వేడి ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ప్రభావం వల్ల ఈ వేసవిలో రుతుపవనాలకు ముందు శుక్రవారం తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త రవీందర్ ‘ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. శుక్రవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు
పోలింగ్ రోజు మే 13వతేదీన రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్టణం వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బుధవారం ఏర్పడిన ద్రోణి ఈశాన్య రాజస్థాన్ నుంచి దక్షిణ కర్నాటక వరకు వెళ్లినట్లు ఐఎండీ అధికారులు చెప్పారు. ఈ ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తేదీ మే 13న రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.
- పోలింగ్ రోజు
కోస్తా ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర కోస్తా ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం తెలిపింది. శుక్రవారం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం,రాయలసీమలోని పలు ప్రదేశాలలో గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.రాయలసీమ-నంద్యాల, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాలతో సహా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయి.
- ఆంధ్రాలో అత్యల్ప ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని ఐఎండీ అమరావతి సీనియర్ శాస్త్రవేత్త ఎస్ కరుణసాగర్ చెప్పారు. గత మూడు రోజులుగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సగటున 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఆయన తెలిపారు.


Tags:    

Similar News