రేవంత్ రెండో రోజు పాలన ఎలా సాగిందంటే...

ప్రజా భవన్ జనంతో కిటకిటలాడింది. సచివాలయం సందడి చేసింది. మెరుపు వేగంతో అధికారులు కదిలారు. రేవంత్ రెడ్డి రెండో రోజు పాలన ఎలా సాగిందో ఓసారి చూద్దాం

Update: 2023-12-08 13:32 GMT
ప్రజాభవన్ దగ్గిర రేవంత్ ప్రజాదర్భార్



నేనుండేది బంజారాహిల్స్.. నా మనసు మాత్రం మిడిల్ క్లాస్.. అన్నట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పాలన సాగింది. అందరు ముఖ్యమంత్రులకున్నట్టే కట్టుదిట్టమైన కాన్వాయ్ ల మధ్య ఉదయం 9.45 గంటలకు బంజారాహిల్స్ నుంచి సీఎం రేవంత్ ప్రజాభవన్ గా మారిన ప్రగతి భవన్ వైపు దారి పట్టారు. ప్రమాణ స్వీకారంనాడు చెప్పినట్టే.. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుపకంచెలు తెగిపోయాయి. ప్రజా భవన్ జనంతో కిటకిటలాడింది. సచివాలయం సందడి చేసింది. మెరుపు వేగంతో అధికారులు కదిలారు. రేవంత్ రెడ్డి రెండో రోజు పాలన ఎలా సాగిందో ఓసారి చూద్దాం

1.విన్నపాలు వినవలే..

మబ్బులు కమ్మిన ఆకాశం, పున్నాగపూల సువాసనలు, వాహానాల రోదలు, కమ్మేసిన మంచు తెరల మధ్య తెలతెలవారుతుండగానే ప్రజా భవన్ వైపు దారుల వెంట జనం పోగవుతున్నారు. పొద్దు పొద్దున్నే పైట చెంగు నెత్తిన వేసుకుని కొందరు, చక్రాల కుర్చీల్లో మరికొందరు, రయ్ రయ్ అంటూ ఇంకొందరు, సిటీబస్సుల్లో మరి కొందరు ప్రజాభవన్ లోకి పరుగుపరుగున వచ్చారు. వీళ్లందర్నీ వరుస క్రమంలో నిలబెట్టి అందర్నీ తయారుగా ఉండమని పోలీసులు చెబుతున్న సమయంలో సరిగ్గా పదిన్నర గంటలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వచ్చారు.ప్రజా దర్బార్‌ పెట్టారు. క్యూలో నిలబడిన ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి అర్జీలు తీసుకున్నారు. ఓపిగ్గా విన్నపాలు విన్నారు. వినతిపత్రాలు తీసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రేవంత్ కి తోడుగా సీతక్క, పొంగులేటి..

ప్రజా దర్బార్ కి సహచర మంత్రులు సీతక్క, పొంగులేటి కూడా వచ్చారు. రేవంత్ పాటు ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఇంతలో రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దాంతో ఆయన హుటాహుటిన సచివాలయానికి వెళ్లారు. సీతక్క, పొంగులేటి ప్రజాదర్బార్ ను కొనసాగించారు. సుమారు రెండున్నర గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది.

ఈ అర్జీలను ఏం చేస్తారంటే...

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాభవన్ లో 18 డెస్క్ లు ఏర్పాటవుతున్నాయి. ఆన్ లైన్ లో ప్రతి అర్జీని నమోదు చేస్తారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను పరిశీలిస్తారు. ఎన్ని పరిష్కరించారో మరెన్ని పెండింగ్ లో ఉన్నాయో సీఎం దృష్టికి తీసుకువెళతారు.

అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపారు.

2.విద్యుత్ శాఖపై సమీక్ష...

మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సచివాలయానికి వెళ్లారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు వచ్చారు.


విద్యుత్ పరిస్థితిపై అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థల స్థితిగతులు, డిమాండ్‌, కొనుగోళ్లు, బకాయిలను చర్చించారు. విద్యుత్ బకాయిలు పేరుకుపోవడానికి గల కారణాలను సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

2.ఏ. విద్యుత్ పై శ్వేత పత్రాన్ని విడుదల చేస్తారా?

విద్యుత్ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. వాస్తవాలను చెప్పకుండా గత ప్రభుత్వ పాలకులు ఎందుకు దాచారో తప్పుపడుతూ.. ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యుత్‌ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని రేవంత్‌ అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యుత్‌ సంస్థలకు ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులున్నట్లు సీఎంకు అధికారులు చెప్పారని సమాచారం.

3.మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై ఆదేశాలు..

అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి మరో రెండు గ్యారంటీలపైనా సమీక్ష చేశారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సదుపాయం, రూ.10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసే అంశాలపై అధికారులతో మాట్లాడారు.

2023 డిసెంబర్ 9 నుంచే స్త్రీలకు ప్రయాణం

డిసెంబర్ 9. సోనియా గాంధీ పుట్టిన రోజు. ఆ రోజు నుంచే తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుట్టింది రేవంత్ ప్రభుత్వం. డిసెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించ వచ్చు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి.

పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రయాణికుల ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది.

4. మహిళలు ఎలా ప్రయాణించవచ్చంటే..


తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్థానికత గుర్తింపు కార్డు చూపించి బస్సు ఎక్కవచ్చు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకం ప్రారంభిస్తాం. మహిళా మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజా రవాణా వ్యవస్థలో చరిత్రాత్మక నిర్ణయం ఇది. ఈ పథకం ద్వారా ప్రజా రవాణాకు మేలు జరుగుతుంది. మహిళా సాధికారతకు దోహద పడుతుంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల మహిళలకు రక్షణ ఉంటుంది. ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది.

ఏయే బస్సులు ఎక్కవచ్చంటే..

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఏదో ఒక స్థానికత ధ్రువీకరణ గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ ఇస్తారు. 5.. 6 రోజుల తర్వాత ఎలక్ట్రానిక్‌ మిషన్‌ ద్వారా జీరో టికెట్‌ ప్రింటింగ్‌ చేస్తారు. ప్రస్తుతం 7,200 సర్వీసులను మహాలక్ష్మి పథకం కోసం ఉపయోగిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ చెప్పారు.

5. రెండు బ్రేకింగ్ వార్తలు..

విద్యుత్ పై సమీక్ష జరుగుతున్న సమయంలోనే సీఎం రేవంత్ దృష్టికి రెండు బ్రేకింగ్ న్యూస్ వచ్చాయి. వాటిలో ఒకటి మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకు తుంటి ఎముక విరిగిందని, యశోదా ఆస్పత్రిలో ఉన్నారని సమాచారం వచ్చింది. వెంటనే ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించడంతో పాటు తనకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. కేసీఆర్ ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ఇక రెండో బ్రేకింగ్.. తక్షణమే తాను ఢిల్లీకి రమ్మని పార్టీ పెద్దల ఆదేశం.

6. స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి ప్రయాణం..

మధ్యాహ్నం 1 గంటకు సమీక్ష ముగించి సచివాలయంలో కార్యక్రమాలను వాయిదా వేసి రేవంత్ ఢిల్లీకి బయలుదేరారు. రెండు గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు.

7. ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ..

ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ సాయంత్రం చాలా బిజీబిజీగా గడిపారు. పార్టీ ఇంచార్జీలతో భేటీ అయ్యారు. మంత్రి వర్గ కూర్పు, శాఖల కేటాయింపులు వంటివి చర్చించారు. సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతారని సమాచారం.

7.ఏ. ఎంపీగా రేవంత్ రాజీనామా..

ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పార్లమెంటులో భేటీ అయ్యారు. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ మల్కాజిగిరి లోక్ సభ సీటు నుంచి కాంగ్రెస్ ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

8. క్యాబినెట్ లోకి మరో 7,8 మంది...

ప్రస్తుతం రేవంత్ టీమ్ లో 11 మంది ఉన్నారు. మరో ఏడెనిమిది మందిని చేర్చుకుంటారని సమాచారం. వీరిలో ఏయే సామాజిక వర్గాలకు చోటివ్వాలి, ఎవరెవర్ని తీసుకోవాలి అనే అంశాలను పార్టీ అధిష్టానంతో చర్చిస్తారు. తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన పార్టీ అగ్రనేతలకు కృతజ్ఞతలు చెబుతారు. రాత్రికి తిరిగి హైదరాబాద్ వస్తారు.

9. అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్..


కొత్తగా ఎన్నికైన ఎమ్మెల ప్రమాణ స్వీకారం, ప్రజా సమస్యలపై చర్చ వంటి వాటిని చర్చించేందుకు తెలంగాణ అసెంబ్లీ శనివారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశానికి నోటిఫికేషన్ ఇచ్చింది. నాలుగైదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.

10. ప్రొటెం స్పీకర్ గా ఒవైసీ..


నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ప్రొటెం స్పీకర్ ను నియమించడం ఆనవాయితీ. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన కేసీఆర్ సీనియర్ ఎమ్మెల్యే. అయితే ఆయన ఆస్పత్రిలో ఉండడం, మిగతా సీనియర్లు ముందుకు రాకపోవడంతో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

రేవంత్ సెకండ్ డే  ఆలా గడిచింది. 

Tags:    

Similar News