చెరకు రైతులకు రేవంత్ సర్కార్ తీపివార్త

తెలంగాణలోని చెరకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపివార్త వెల్లడించింది.మూతబడిన బోధన్,ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలను పునర్ ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించింది.

Update: 2024-05-03 03:54 GMT
sugar factory

దశాబ్దకాలంగా మూతపడిన బోధన్,ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలకు ఎట్టకేలకు రేవంత్ సర్కారు మోక్షం కలిగించనుంది. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్న బోధన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలను 2014వ సంవత్సరం డిసెంబరులో మూసివేశారు.

- మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని డిమాండ్ చేస్తూ చెరకు రైతులు, షుగర్ ఫ్యాక్టరీల కార్మికులు పోరాటాలు సాగించారు. రైతులు ఎన్ని పోరాటాలు చేసినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించలేదు. తాము అధికారంలోకి వస్తే కేవలం 100 రోజుల్లోనే షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని కేసీఆర్ 2014 ఎన్నికల సమయంలో హామి ఇచ్చినా పదేళ్లలో దాన్ని నెరవేర్చలేదు.
- గతంలో షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హామి ఇచ్చినా నెరవేర్చలేక పోయారు. దీంతో చెరకు సాగు విస్తీర్ణం కాస్తా తగ్గింది. పదేళ్లుగా మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల్లో యంత్రసామాగ్రి తుప్పుపట్టినందున వీటి స్థానంలో అధునాతన క్రషింగ్ యంత్రాలను ఏర్పాటు చేయించాల్సి ఉందని, ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని జగిత్యాల జిల్లాకు చెందిన గల్ఫ్ ప్రవాసుల సంఘం ప్రతినిధి, రైతు మందా భీం రెడ్డి చెప్పారు.

నెరవేరుతున్న రేవంత్ సర్కారు హామీలు
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెరకు ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెరకు రైతులకు హామి ఇచ్చారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ముత్యంపేటలో రాత్రి బస చేశారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని హామి ఇచ్చారు. రేవంత్ ఇచ్చిన హామి ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించి షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించేందుకు చర్యలు చేపట్టారు.

బ్యాంకులకు రూ.43కోట్ల విడుదల
పాత బకాయిలే ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ఆటంకమని గుర్తించిన సబ్ కమిటీ బ్యాంకులకు పాత బకాయిలను చెల్లించింది. షుగర్ ఫ్యాక్టరీలకు బ్యాంకుల్లో ఉన్న పాత బకాయిలు రూ.43కోట్లను వన్ టైం సెటిల్ మెంట్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం చెల్లించింది. దీంతో షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. ఈ రెండు షుగర్ ఫ్యాక్టరీలు పునర్ ప్రారంభమైతే చెరకు రైతులకే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందని చెరకు రైతుల పోరాట కమిటీ ప్రతినిధి చెన్నమనేని శ్రీనివాసరావు చెప్పారు.

పెరగనున్న చెరకు సాగు విస్తీర్ణం
మూతబడిన బోధన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలు తెరచుకోనుండటంతో తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో చెరకు సాగు విస్తీర్ణం పెరగనుంది. బోధన్, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్, ఖానాపూర్, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి ప్రాంతాల్లో ప్రస్థుతం 30 వేల ఎకరాల్లో చెరకు సాగు చేస్తుండగా, షుగర్ ఫ్యాక్టరీలు తెరచుకోనున్న నేపథ్యంలో చెరకు సాగు రెట్టింపు అవుతుందని ఖానాపూర్ చెరకు రైతు రాయమల్లు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

పెరిగిన చెరకు దిగుబడి
గతంలో ఎకరానికి 60 నుంచి 70 టన్నుల చెరకు దిగుబడి అయ్యేది. చెరకులో కొత్త వంగడాలు అందుబాటులోకి రావడంతోపాటు చెరకు నాటడం నుంచి కోయడం వరకు యాంత్రీకరణ జరిగింది. దీంతో చెరకు దిగుబడి ఎకరానికి 120 టన్నులకు పెరిగింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో చెరకు రైతులు ఎకరానికి 120 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. దీంతో కొత్త వంగడాలను నాటడం వల్ల చెరకు దిగుబడి పెరగడంతో రైతులకు మేలు జరగనుంది. ఒకసారి చెరకు నాటితే మూడేళ్లపాటు మూడు కోతల చెరకు దిగుబడి వస్తుంది.

చెరకు రైతులకు రూ.1000కోట్ల ఆదాయం
ఎలాంటి పని లేకుండా చెరకు పంట పండుతోంది. రైతులు చెరకు పంట వేసి, దీనికి అనుబంధంగా డెయిరీఫాం, పౌల్ట్రీ ఫాం పెట్టుకొని జీవనం సాగించవచ్చు. చెరకు సాగువిస్తీర్ణంతోపాటు దిగుబడి పెరగనుండటంతో చెరకు రైతులకు ఏటా వెయ్యికోట్ల రూపాయల మేర ఆదాయం లభిస్తుందని, దీని వల్ల తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెరకు రైతుల సంఘం అధ్యక్షుడు చెన్నమనేని శ్రీనివాసరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

చెరకు రైతులు, కార్మికుల హర్షం
బోధన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించడానికి రేవంత్ సర్కారు చర్యలు తీసుకోవడంతో చెరకు రైతులు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డిలకు రైతులు పాలాభిషేకం చేశారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో రైతలతో చెరకు నాట్లు వేయించి, పునర్ ప్రారంభించే షుగర్ ఫ్యాక్టరీల్లో క్రషింగ్ ను ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలనే చెరకు రైతులు, కార్మికుల దీర్ఘకాల డిమాండును తాము నెరవేరుస్తుండటం తనకెంతో సంతోషంగా ఉందని, చెరకు రైతుల జీవితాల్లో తీపి నింపాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్ బాబు వివరించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చెరకు నాట్లు వేయించి, డిసెంబరు నెలలో ప్రారంభం కానున్న క్రషింగ్ కు చెరకు తరలిస్తారు.
షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించేందుకు రేవంత్ సర్కారు చేపట్టిన చర్యలతో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో చెరకు రైతులు, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు అధికార కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ప్రవాసుల సంఘం నాయకుడు మందా భీంరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Tags:    

Similar News