తెలంగాణలో దిగివస్తున్న బియ్యం ధరలు...ఎందుకంటే?

తెలంగాణలో యాసంగి పంట వరి ధాన్యం మార్కెట్‌లోకి వస్తుండటంతో ఆకాశాన్నంటిన బియ్యం ధరలు దిగివస్తున్నాయి. బియ్యం ధరలు 7 శాతం తగ్గడంతో వినియోగదారులు సంతోషపడుతున్నారు.

Update: 2024-04-21 08:32 GMT
paddy procurement centre

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజను నుంచి వచ్చిన వరి ధాన్యంతో బియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. యాసంగిలో కొన్ని జిల్లాల్లో సన్నబియ్యం దిగుబడి రావడంతో మార్కెట్ లో అనూహ్యంగా పెరిగిన బియ్యం ధరలు తగ్గుతున్నాయి. ఖరీఫ్ సీజనులో దిగుబడి అయిన వరి ధాన్యాన్ని మిల్లర్లు, బియ్యం వ్యాపారులు మిల్లింగ్ చేసి మార్కెట్ లోకి విడుదల చేశారు.

- యాసంగి వరి ధాన్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా గోదాముల్లోని ఖరీఫ్ సీజనులో వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ కు తరలించారు. దీంతో ధరలు దిగివచ్చాయని మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట రావడంతో ఏప్రిల్‌లో బాస్మతీయేతర బియ్యం ధరలు 7 శాతం వరకు పడిపోయాయి.

యాసంగి వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్
తెలంగాణ మార్కెట్‌లో యాసంగి (రబీ) వరిధాన్యం రాక పెరుగుతుండడంతో బియ్యం ధరలపై ప్రభావం పడింది. తెలంగాణ రాష్ట్రం రబీ వరి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. తెలంగాణ తర్వాత తమిళనాడు,ఒడిశాలలో రబీ పంట వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నెల రోజులలోపే ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు వ్యాపారులు 10 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రంలోని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు నాన్ బాస్మతి రకం సోనా మసూరి గత నెలలో కిలో ధర రూ.62 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో ఇప్పుడు రూ.58కి తగ్గింది. మొత్తం మీద కిలో బియ్యం ధర సగటున రూ.5 నుంచి 10 రూపాయల దాకా తగ్గింది. రబీ ధాన్యం రాకతో బియ్యం ధరలు తగ్గాయని మేడ్చల్ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్ భధ్రయ్య ‘ఫెడరల్ తెలంగాణ’ చెప్పారు.

కోటి టన్నుల వరిధాన్యం ఉత్పత్తి
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి(రబీ) పంట 51.33 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. యాసంగిలో కోటి టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరగవచ్చని అధికారులు అంచనా వేశారు. దీంతో ఈ ఏడాది యాసంగి రబీ ధాన్యం 75.4లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసేందుకు 7,150 కొనుగోలు కేంద్రాలను తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిందని ఆ శాఖ అదికారులు చెప్పారు.
నిజామాబాద్‌ జిల్లాలో 1.35 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిని అధికారులు కొనుగోలు చేశారు.ఈ నెలాఖరు నాటికి మార్కెట్‌లో వరిధాన్యం రాక ఆశించిన స్థాయిలో పెరగడంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మిల్లర్లు చెబుతున్నారు. భారత ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ శాఖ 2023-24లో రబీ పంట కోసం రాష్ట్రాలు వరి ధాన్యం సేకరణను 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి కోటి మెట్రిక్ టన్నుల వరకు అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అంచనాలో 60 శాతానికి చేరుకోవాలని చూస్తోంది.

వరి ధాన్యం సంచులు 

యాసంగి వరి ధాన్యంతో ధరలపై ప్రభావం
కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ,గోదావరి బేసిన్‌లోని కడెం ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడేకు మార్గం సుగమం చేయడం, నీటి కొరత కారణంగా యాసంగిలో వరిసాగు ఐదు లక్షల ఎకరాలు పడిపోయింది. కానీ రాష్ట్రంలో రబీ వరి ఉత్పత్తి అంచనా 102.91 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది.తెలంగాణ నుంచి వచ్చిన యాసంగి వరి ధాన్యం ధరపై ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిల్లర్లు మిర్యాలగూడ, నల్గొండ నుంచి సంవత్సరానికి అవసరమైన వరి ధాన్యాన్ని తీసుకుంటున్నామని ఆంద్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రధాన బియ్యం ఎగుమతిదారు చెప్పారు. తెలంగాణలోని రైస్ మిల్లర్ల వద్ద గత సీజన్ల నుంచి వరిధాన్యం నిల్వలున్నాయి. ఈ సారి కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కూడా వరి ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి. దీంతో తెలంగాణ వరి ధాన్యానికి డిమాండ్ తగ్గింది.

దిగివస్తున్న బియ్యం ధరలు
గత కొన్ని వారాలుగా పెరిగిన బియ్యం ధరలు ప్రస్థుతం రబీ ధాన్యం రాకతో క్రమంగా దిగి వస్తున్నాయి. బియ్యంపై 20 శాతం ఎగుమతి పన్ను గణింపునకు కస్టమ్స్ అధికారులు కొత్త విధానం ప్రవేశపెట్టడంతో బియ్యం ఎగుమతుల ఒప్పందాలు తగ్గాయి.యాసంగి సీజన్ కొత్త బియ్యం మార్కెట్ లోకి రావడంతో బియ్యం ధరలు తగ్గుతున్నాయని రైస్ మిల్ రిపోర్టర్ చీఫ్ ఎడిటర్ షేక్ బాజీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. యాసంగి కింద నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, కామారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో సన్న బియ్యం పండించి నందున ఆయా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం లేదు.


Tags:    

Similar News