రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు,ఏపీ,తెలంగాణల మధ్య పరిష్కారం కాని వివాదాలు
రాష్ట్ర విభజన జరిగి జూన్ నెల 2వతేదీ నాటికి పదేళ్లు పూర్తి కానుంది. పదేళ్లు గడవనున్నా ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజుకున్న వివాదాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి.
By : Saleem Shaik
Update: 2024-05-20 23:09 GMT
తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు 2014వ సంవత్సరం...జూన్ 2వతేదీ...తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన మరపురాని రోజు...
- తెలంగాణ ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వతేదీకి సరిగ్గా పదేళ్లు పూర్తి కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీని ఆహ్వానించి సత్కరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించాలని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం భారత ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసింది.
- తెలుగు రాష్ట్రాల విభజన జరిగి జూన్ 2వతేదీకి పదేళ్లు గడవనున్నా, ఇప్పటికీ హైదరాబాద్‌తో సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. రాష్ట్ర విభజన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి.
- రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఆస్తుల విభజన, విద్యుత్ బిల్లుల బకాయిలు వంటి అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో అమలు కాని పునర్ విభజన హామీలపై ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం.
తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తెచ్చేదెపుడు?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తుది పరిష్కారం కోసం వేచి చూస్తున్న సమస్యల్లో ఉద్యోగుల బదిలీ అంశం ప్రధానమైంది. ఏపీకి కేటాయించిన 144మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ మే 18వతేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందించామని తెలంగాణ నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం సెంట్రల్-హైదరాబాద్ అధ్యక్షుడు ఎం. జగదీశ్వర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత 144 మంది తెలంగాణ ఉద్యోగులు 2014 నుంచి ఏపీలో పనిచేస్తున్నారు.
హైదరాబాద్ ఆర్టీసీ ఆస్తులపై వివాదం
ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఒక కొలిక్కి రాలేదు. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ కోరిందని, దానికి టీఎస్‌ఆర్‌టీసీ నిరాకరించింది. షీలా భిడే ప్యానెల్ ఇచ్చిన హెడ్‌క్వార్టర్స్ నిర్వచనం ప్రకారం ఆర్టీసీ ఆస్తులు తమకు చెందినవని పేరు చెప్పడానికి ఇష్టపడని టీఎస్ఆర్టీసీ అధికారి ఒకరు చెప్పారు. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ ఆస్తులు తెలంగాణకు చెందినవేనని చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణ గడ్డపై ఉన్న ఆస్తుల్లో ఏపీకి వాటా ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. కాగా ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ఆర్టీసీ ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం వాటా ఇవ్వాల్సిందేనని టీడీపీకి చెందిన శాసనమండలి మాజీ ఛైర్మన్ అహ్మద్ షరీఫ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పూర్తి కాని కార్పొరేషన్ల విభజన
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ రాజధాని నగరం పూర్తిగా తెలంగాణకు చెందుతుంది. అధికారిక వర్గాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో జాబితా చేసిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన, అనేక అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇంకా పూర్తి కాలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు తొమ్మిదో షెడ్యూల్‌లో జాబితా చేశారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలు,కార్పొరేషన్‌లు ఉన్నాయి.
10 షెడ్యూల్ సంస్థల విభజన ఏది?
చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ,ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణా సంస్థలు ఉన్నాయి. రిటైర్డ్ బ్యూరోక్రాట్ షీలా భిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9,10 షెడ్యూల్ సంస్థల విభజనపై సిఫార్సులు చేసినప్పటికీ, ఈ అంశం అపరిష్కృతంగానే ఉంది. విభజన తర్వాత విద్యుత్ సరఫరాకు సంబంధించి బకాయిల చెల్లింపు విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు.
పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని
2014వ సంవత్సరం జూన్ 2వతేదీ నుంచి 10 సంవత్సరాల కాలానికి హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ ఈ ఏడాది జూన్ 2వతేదీ నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ, 2016వ సంవత్సరంలోనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయం, దాదాపు రాష్ట్ర పరిపాలన కార్యాలయాలను ఏపీలోని అమరావతికి మార్చారు. అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ప్రపంచ స్థాయి రాజధానిని అభివృద్ధి చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు.
ఏపీ నుంచి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ స్వాధీనం చేసుకోవాలని సీఎం ఆదేశం
రాష్ట్ర విభజన సమస్యలపై మే 15వతేదీన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ఇచ్చిన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ ప్రభుత్వ అతిథి గృహం వంటి భవనాలను జూన్ 2వతేదీ తర్వాత స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈ ఏడాది మార్చి నెలలో కేంద్రం రెండు రాష్ట్రాలకు భూ కేటాయింపులు చేయడంతో ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌పై వివాదం సద్దుమణిగింది.
పెండింగ్ సమస్యలు పరిష్కరించండి : సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల బదిలీలు, వారిని సొంత రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రక్రియను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను తాజాగా ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న ఇతర అంశాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఇతర సంబంధిత అంశాలపై చర్చించేందుకు మే 18వతేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించినా ఈసీ ఆంక్షల వల్ల దీనిపై చర్చించలేదు.
తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు గడిచిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్య పూర్వకంగా చర్చించుకొని విభజన వివాదాలను పరిష్కరించుకోవాలని తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలు ఇప్పటికైనా పరిష్కారమవుతాయా? లేదా? అనేది వేచిచూడాల్సిందే.