తెలంగాణలో మండుతున్న ఎండలతో పాటు పెరిగిన పొలిటికల్ హీట్

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉష్ణోగ్రతలే కాదు పొలిటికల్ హీట్ కూడా పెరిగింది. మండే ఎండలకు నేతల ప్రచారం, వారి డైలాగ్ వార్ తోడవటంతో తెలంగాణ వేడెక్కింది.

Update: 2024-05-02 09:53 GMT
తెలంగాణలో మోదీ, రాహుల్ పోటాపోటీగా ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల ప్రచారపర్వం మరో 9 రోజులతో ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారపర్వంలో దిగారు. తెలంగాణలో పలు జిల్లాల్లో గురువారం ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్షియస్ ను దాటడంతో మండే ఎండలు, వడగాలులతో జనం సతమతం అవుతున్నారు. దీనికితోడు ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీల అధినేతల సుడిగాలి పర్యటనలు, బహిరంగసభలు, వాడి, వేడి విమర్శలు, ప్రతి విమర్శలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.

లోక్ సభ ఎన్నికల ప్రచారం
చివరి దశకు చేరుకుంది. ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమకే ఎడ్జ్ ఉన్నాయని, తెలంగాణ నుంచి ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లు తమకంటే తమకే వస్తాయని చెప్పుకోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది.
కాంగ్రెస్,బీజేపీ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారం చేయడానికి తమ తమ పార్టీల అగ్ర నాయకులను రంగంలోకి దించాయి. మే 13వతేదీన పోలింగ్ జరగనుండగా, ప్రచారానికి మరో 9 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీనికితోడు రాష్ట్రంలో వేసవి తాపంతో అంతా ఉడికిపోతోంది. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మే 11వతేదీన సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వం ముగుస్తుంది.

కాంగ్రెస్ కీలక నేతల ప్రచారం ముమ్మరం
ఇంద్రవెల్లి బహిరంగ సభతో కాంగ్రెస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా సుడిగాలి పర్యటనలు చేస్తూ రోజుకు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పక్షాన ముమ్మర ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ మే 5వతేదీన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లు కూడా ప్రచార రంగంలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ.మల్లికార్జున ఖర్గే చివరిసారిగా ఏప్రిల్ 6వతేదీన తుక్కుగూడలో జరిగిన జనజాతర సభలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

బీజేపీ అగ్రనేతల ప్రచారం
మరో వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభలను ఉద్ధేశించి ప్రసంగిస్తూ రోడ్ షోలలో పాల్గొంటున్నారు. బీజేపీ మే 8,10 తేదీల్లో వరుస ప్రచార కార్యక్రమాల కోసం ప్రధాని మోదీని తెలంగాణకు మళ్లీ తీసుకురానున్నారు. మోదీ మే 8వతేదీన వేములవాడ, వరంగల్‌లో బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు, ఆ తర్వాత మే 10వతేదీన మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో జరిగే సభల్లో పాల్గొంటారు.

కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా సభలు
ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు భావిస్తున్నాయి. గత 2019 ఎన్నికల్లో తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ 4, కాంగ్రెస్‌ మూడు, ఏఐఎంఐఎం ఒకటి, బీఆర్‌ఎస్‌ 9 సీట్లు గెలుచుకున్నాయి. అయితే, ఈ సారి ప్రధాన పోరు కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉంటుందని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎన్నికల్లో కనీసం 14 సీట్లలో విజయం సాధిస్తుందని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరో వైపు తమ పార్టీ 10 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి, కేసీఆర్ ముమ్మర  ప్రచారం 


 కేసీఆర్ ప్రచారానికి బ్రేక్

కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో కేంద్ర ఎన్నికల కమిషన్ అతనిపై 48 గంటల పాటు నిషేధం విధించడంతో ఆయన ప్రచారానికి బ్రేక్ పడింది. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి కేవలం ఒకటి లేదా రెండు స్థానాలకు తగ్గవచ్చని ప్రచారం జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ బాగా దెబ్బతిందని కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి పక్షాన మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, మాజీ మంత్రులు కేటీ రామారావు, టి హరీష్ రావులు ప్రచారం సాగిస్తున్నారు.

- పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పర్వంలో మోదీ, రాహుల్, కేసీఆర్, రేవంత్ రెడ్డి ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ఈ ప్రచారపర్వంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో జూన్ మొదటివారం ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచిచూడాల్సిందే. 

Tags:    

Similar News