జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election)మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ఆయా పార్టీలు మద్యం, మనీని (Money, liquor flow) విచ్చలవిడిగా రంగంలో దించాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం మూడు ప్రధాన పార్టీల నేతలు విచ్చలవిడిగా డబ్బు, మద్యాన్ని వెదజల్లుతున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు పోలీసులు 48 కేసులు నమోదు చేశారు. మరో 29 నియమావళి ఉల్లంఘన కేసులను పెట్టారు. ఎన్నికల నామినేషన్ల దాఖలు సమయంలో ర్యాలీల పేరిట రాజకీయ పార్టీల అభ్యర్థులు డబ్బును వెదజల్లుతున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయపరిశీలకు అప్రమత్తమై నిఘా పెట్టారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు సాగుతోంది.మూడు పార్టీలు ఈ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్కంగా తీసుకోవడంతోపాటు ముగ్గురు అభ్యర్థులు బలమైన అభ్యర్థులు కావడంతో డబ్బు వెదజల్లుతున్నారు.జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గుండెపోటుతో మరణించడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ నవంబరు 11వతేదీన జరగనుంది. తెలంగాణలో అధికారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మరణించిన తాజా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణ మాగంటి సునీత, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి బరిలో నిలిచారు. అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్ పార్టీ, సానుభూతి నినాదంతో బీఆర్ఎస్, గేమ్ ఛేంజర్ నినాదంతో బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డారు.
రూ.88.45 లక్షల డబ్బు సీజ్
ఎన్నికల్లో మద్యం, మనీ పారకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్పెషల్ స్క్వాడ్లు, పోలీసు, ఎక్సైజ్ బృందాలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఈ నెల 7 వతేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బును తరలిస్తుండగా ప్రత్యేక అధికారుల బృందాలు పట్టుకున్నాయి. ఈ నెల 7వతేదీ నుంచి 14వతేదీ వరకు రూ.88.45 లక్షల డబ్బును సీజ్ చేశారు. అంటే మనీ ప్రవాహం ఎన్నికల్లో ఎలా ఉందనేది విదితమవుతుంది.టోలిచౌకీలో రూ. 10 లక్షల నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది.
ఎన్నికల్లో ఓటర్ల కోసం ఉంచిన మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గత వారం రోజుల్లో 255.56 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. మద్యం, మనీనే కాకుండా ఈ ఎన్నికల సందర్భంగా డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో డ్రగ్స్ కూడా పట్టుకున్నారంటే పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మత్తు పదార్థాలను సైతం ఎరగా వేస్తున్నారని విదితమవుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మూడు రాజకీయ పార్టీల నేతలు బిర్యానీతోపాటు మందు బాటిళ్లను పంపిణీ చేస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రినివాసరెడ్డి ఆరోపించారు.
పోలీసులకు ఎన్నికల అధికారి ఫిర్యాదు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ముగ్గురు సినీతారల ఫొటోలతో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూసుఫ్‌గూడ సర్కిల్–19 అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మధుర నగర్ పోలీసులు ప్రాథమిక విచారణ తర్వాత భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 336(4), 353(1)(C) కింద క్రైమ్ నంబర్ 686/2025ను నమోదు చేశారు. స్వేచ్ఛాయుతమైన ఎన్నికల నిర్వహణను ప్రతికూలంగా ప్రభావితం చేసే వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటరు కార్డులను ఓటర్లకు పంపిణీ చేశారని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జి.రజనీకాంత్ రెడ్డి ఫిర్యాదుపై మధురా నగర్ పోలీసులు కేసు పెట్టారు. మధురానగర్ లో ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారని వచ్చిన వార్తలపై పోలీసులు, ఎన్నికల అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 170, 171,174 , ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్ 123 (1) ప్రకారం నవీన్ యాదవ్ పై కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ లో అభివృద్ధి పనులకు ఈసీ బ్రేక్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా వాటిని ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది. షేక్ పేట్, రహమత్ నగర్, యూసుఫ్ గూడ ప్రాంతాల్లో చేపట్టిన పలు నిర్మాణ పనులు ఎన్నికల వల్ల నిలిపివేశారు. రోడ్లు, డ్రైనేజీ, వరద కాలువలు, శ్మశానవాటికలు,కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం లాంటి 300 ప్రాజెక్టులు ఆగిపోయాయి.
కోడ్ అమలుకు ప్రత్యేక ఎన్నికల అధికారుల బృందాలు ప్రభుత్వ కార్యాలయాల్లో నుంచి ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలను తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాల గోడలపై రాజకీయ ప్రకటనల రాతలు, పోస్టర్లను తొలగించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై కొరడా ఝళిపించేందుకు 9 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు,తొమ్మిది స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 9వీడియో సర్వైలెన్స్ బృందాలు, రెండు వీడియో వీక్షణ బృందాలు , రెండు అకౌంటింగ్ బృందాలను ఎన్నికల అధికారులు రంగంలోకి దించారు. దీంతో పాటు ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం సీ విజిల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.వాహనాలను తనిఖీ చేయడానికి పోలీసులు స్టాటిక్ నిఘా బృందాలను కూడా ఏర్పాటు చేశారు.జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మోడల్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాాలపై ఉన్న 1967 రాజకీయ పోస్టర్లు, గోడలపై రాతలు, బ్యానర్లను తొలగించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వంతంత్రంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఐమాక్స్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి ముసుగు వేశారు. మోతీనగర్ లోని మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి గుడ్డను కప్పారు. ఐమాక్స్ రోటరీలోని మాజీ ప్రధాని పీవి, బోరబండలోని మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి విగ్రహాలకు ముసుగు వేశారు.
వివాహ షాపింగ్ లకు ఆటంకం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటం వివాహాలు చేసుకునే కుటుంబాలకు ఆటంకంగా మారింది. ఈ నెలలో పెళ్లి ముహుర్తాలు ఉండటంతో నగరంలో 30వేలకు పైగా వివాహాలు జరగనున్నాయని నగరానికి చెందిన పూజారి వీరభద్ర శర్మ చెప్పారు. పెళ్లి కోసం బంగారం కొనుగోలుతోపాటు షాపింగ్ చేయాలంటే ఈసీ నియమావళి నిబంధనలు ఆటంకంగా మారాయని వెడ్డింగ్ ప్లానర్లు లబోదిబో అంటున్నారు. రూ.50వేల నగదు దాటితే దానికి రుజువు పత్రాలు, వివాహ ఆహ్వాన పత్రాలను తీసుకు రావాలని అధికారులు సూచించారు.
ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి
ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, మద్యం, మనీ పంపిణీ చేసినా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా ఎన్నికల అధికారులకు లేదా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబరు 1950కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘిస్తే డయల్ 100 లేదా 112కు కాల్ చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.
ఓటర్లే తీర్పు చెప్పాలి : సోమ శ్రీనివాసరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ధనం, మద్యం ప్రవాహం పెరిగింది. కానీ ఎన్నికల తీర్పు ఓటర్ల చేతుల్లోనే ఉంది. ప్రలోభాలకు లొంగి ఓటును అమ్ముకోకుండా, భవిష్యత్తును నిర్మించడమే లక్ష్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ’’ అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి కోరారు. ఎన్నికల సంఘం దాడులు చేస్తోంది, కేసులు పెడుతోంది, కానీ అసలైన మార్పు ప్రజల ఓటు నైతికతలోనే ఉంది.ఓటు ఒక బాధ్యత. ఆ బాధ్యతను నమ్మకంగా వినియోగించినప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓటర్ల ముందు ఉన్న ప్రశ్న ఒక్కటే...నోట్ల కోసమా, నైతికత కోసమా?. ఓటర్లే నిర్ణయించుకోవాలి.