రేవంత్ ప్రభుత్వానికి ఉన్నది ఒకటే మార్గమా ?
ఎన్నికల నిర్వహణ తేదీపై ఎన్నికల కమీషనర్, ప్రభుత్వం మాట్లాడుకుని చెప్పాలని విచారణను రెండువారాలకు వాయిదావేసింది.
తెలంగాణ హైకోర్టు దెబ్బకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది. స్ధానికసంస్ధల ఎన్నికలను(Local body elections) ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు(Telangana High Court) సూటిగా ప్రశ్నించింది. స్ధానిక ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని లాయర్ సురేందర్ కేసు వేశారు. ఆ కేసుపైనే శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు అడిగిన ప్రశ్నకు అడ్వకేట్ జనరల్ సమాధానమిస్తు రెండువారాల గడువిస్తే ఎన్నికలను ఎప్పుడు నిర్వహించబోతున్నదనే విషయాన్ని ప్రభుత్వంతో మాట్లాడి చెబుతానన్నారు. ఎన్నికల నిర్వహణ తేదీపై ఎన్నికల కమీషనర్, ప్రభుత్వం మాట్లాడుకుని చెప్పాలని విచారణను రెండువారాలకు వాయిదావేసింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అక్టోబర్ 9వ తేదీన జరిగిన విచారణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపైన ప్రభుత్వం జారీచేసిన జీవో ఎంఎస్ 9ని మాత్రమే హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎన్నికలను పాత రిజర్వేషన్ల పద్దతిలోనే నిర్వహించుకోవచ్చని ఆదేశాలు ఇవ్వలేదు. అదేవిషయాన్ని ఈరోజు జరిగిన విచారణలో లాయర్ సురేందర్ గుర్తుచేశారు. ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింద్ ధర్మాసనం నోటిమాటగా మాత్రమే చెప్పిందని ఎక్కడా రాతపూర్వక ఆదేశాలను ఇవ్వలేదని లాయర్ చెప్పారు. లాయర్ చెప్పిన విషయాన్ని ధర్మాసనం నోట్ చేసుకున్నది.
ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే బీజీలకు 42శాతం రిజర్వేషన్లతో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించే అవకాశాలు లేవని. గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చన్న హైకోర్టు ఆదేశాలప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిందే తప్ప రేవంత్ ప్రభుత్వానికి వేరేదారిలేదు. పాతపద్దతిలోనే అంటే బీసీలకు 25శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలవుతాయి. అలాకాకుండా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కచ్చితంగా వర్తింపచేయాల్సిందే అని ప్రభుత్వం గట్టిగా పట్టుబడితే అది పార్టీపరంగా సాధ్యమవుతుందే కాని చట్టప్రకారం సాధ్యంకాదు. పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని అనుకుంటే ఇపుడింత గోల అవసరమేలేదు. పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్ల అమలుచేస్తు ఎన్నికలను ఎప్పుడో నిర్వహించేసుండచ్చు. పార్టీపరంగానే అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్లే ఎందుకు ? జనాభా దామాషాలో 56.37 శాతం రిజర్వేషన్లు అమలుచేసినా అడిగేవారు లేరు అడ్డుకునే వారేలేరు.
ఎన్నికలనిర్వహణలో రేవంత్ ప్రభుత్వంపై హైకోర్టు బాగా ఒత్తిడిపెంచేస్తున్నట్లే కనబడుతోంది. ప్రభుత్వం ఏమో 42శాతం రిజర్వేషన్ల అమలుకు అందుబాటులో ఉన్న మార్గాలను వెతకాలని అనుకుంటోంది. ఇదే విషయమై గురువారం జరిగిన క్యాబినెట్ సమవేశంలో కూడా రేవంత్ అండ్ కో చర్చించింది. అయితే ఎన్నిసార్లు చర్చించినా, ఎన్నిసార్లు న్యాయనిపుణులతో చర్చలు జరిపినా ప్రభుత్వానికి మార్గం అయితే కనబడటంలేదు. దీనివల్ల ఎన్నికల నిర్వహణలో ఆలస్యమవుతోంది తప్ప 42శాతం రిజర్వేషన్ల అమలుకు దారి తెలీటంలేదు. అందుకనే ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారనో తేదీ చెప్పాలని ఈరోజు హైకోర్టు అడిగింది. హైకోర్టు అడిగిన ప్రశ్నకు అడ్వకేట్ జనరల్ రెండువారాలు సమయం తీసుకున్నారు కాబట్టి అపుడు ఎన్నికలనిర్వహణ తేదీని చెప్పితీరాలి. చూడబోతే రెండువారాల్లోపు బీసీలకు చట్టబద్దంగా 42శాతం రిజర్వేషన్ల అమలు ఈఎన్నికల్లో సాధ్యంకాదని అర్ధమవుతోంది.