114 ఏళ్ల ఫౌజా సింగ్ 'పరుగు'ఆగిపోయింది

2012 లండన్ ఒలింపిక్స్‌కు టార్చ్ బేరర్‌గా వ్యవహరించిన మారథాన్ రన్నర్ ని వాహనం ఢీకొట్టింది;

Update: 2025-07-15 08:42 GMT
Click the Play button to listen to article

మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్(114) సోమవారం రోడ్డు ప్రమాదం(Road accident)లో చనిపోయారు. పంజాబ్‌ రాష్ట్రం జలంధర్ జిల్లాలోని తన స్వగ్రామం బియాస్‌లో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆయనను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే జలంధర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం కన్నుమూశారు. హిట్ అండ్ రన్ డ్రైవర్ కోసం గాలిస్తున్నామని జలంధర్‌లోని అడంపూర్ పోలీస్ స్టేషన్ SHO హర్దేవ్ ప్రీత్ సింగ్ చెప్పారు.

ప్రముఖుల సంతాపం..

ఫౌజా సింగ్ (Fauja Singh) మృతిపై పంజాబ్ గవర్నర్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గులాబ్ చంద్ కటారియా "తీవ్ర విచారం" వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫౌజా సింగ్‌తో కలిసి వేదిక పంచుకున్నానని గుర్తుచేసుకున్నారు. బీజేపీ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఫౌజా సింగ్‌ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అసాధారణ జీవితం తరతరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు.

ఎన్నో రికార్డులు..

1911లో రైతు కుటుంబంలో జన్మించిన ఫౌజా సింగ్ పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొని ఎన్నో రికార్డులు సృష్టించారు. పలు పతకాలను అందుకున్నారు. "టర్బన్డ్ టోర్నాడో" గా పేరుగాంచిన ఫౌజా సింగ్ .. సిక్కు సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ ఛారిటీ ద్వారా వచ్చే డబ్బును స్వచ్ఛంధ సంస్థలకు ఇచ్చేవారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో టార్చ్ బేరర్‌గా వ్యవహరించిన ఫౌజా సింగ్ జీవిత చరిత్రపై 114 పేజీల పుస్తకాన్ని నార్వుడ్ గ్రీన్‌కు చెందిన లార్డ్ ఆంథోనీ యంగ్ 2011 విడుదల చేశారు. 

Tags:    

Similar News