మణిపూర్ నుంచి ముంబైకి: రాహూల్ గాంధీ ‘భారత్ న్యాయ్ యాత్ర’

భారత్ జోడో యాత్ర 2.0 మణిపూర్ నుంచి ముంబై వరకు చేపట్టడానికి రాహూల్ గాంధీ సిద్దమయ్యారు.

Update: 2023-12-27 11:21 GMT
రాహూల్ గాంధీ

జనవరి 14న ఈ యాత్ర ప్రారంభం అవుతుందని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ యాత్ర 14 రాష్ట్రాలు, 85 జిల్లాలను తాకుతూ 6, 200 కి,మీ సాగుతుందని, యాత్ర పేరును ‘భారత్ న్యాయ్ యాత్ర’గా నిర్ణయించినట్లు చెప్పారు. మార్చి 20 న ముంబైలో ఈ యాత్ర ముగుస్తుందని వెల్లడించారు.

2024 సార్వత్రిక ఎన్నికల ముందు రాహూల్ గాంధీ తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర ప్రారంభించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సూచించిందని, జాతుల విద్వేషాలతో రణరంగమైన మణిపూర్ నుంచి ఈ యాత్ర ప్రారంభించాలని ఏఐసీసీ సూచించిందని ఆయన వెల్లడించారు.

‘రాహూల్ గాంధీ కన్యాకుమారి నుంచి జమ్మూకాశ్మీర్ వరకూ 4,500 భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఇదోక చారిత్రాత్మక యాత్ర, భారత్ జోడో యాత్రలో తనకున్న అనుభవంతో రాహూల్ గాంధీ మరోసారి ఈ యాత్రను చేపట్టనున్నారు, దేశంలోని మహిళలు,యువత, అణగారిన సమాజంతో ఆయన మరోసారి మమేకం అవుతారు’ అని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వివరించారు.

మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహర్, జార్ఖండ్, ఒడిశా, చత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మీదుగా ‘భారత్ న్యాయ్ యాత్ర’ మహరాష్ట్ర చేరుకుంటుందని కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఇది చిన్నపాటి నడక, బస్సు యాత్రతో మిళితం అయి ఉంటుందని కేసీ వేణుగోపాల్ చెప్పారు.

భారతదేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని అందించాలనే లక్ష్యంతో ‘భారత్ న్యాయ్ యాత్ర’ అనే పేరు పెట్టినట్లు ఈ యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంఫాల్ లో జెండా ఊపి ప్రారంభిస్తారని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ‘ ఇది రాజకీయ యాత్ర కాదు, సామాన్యుల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకునే సందర్భం, వారి సమస్యలను సరైన వేదికలో లెవనెత్తుతాం’ అని చెప్పారు.

అయితే ఎన్నికల సన్నాహాలను ఇదీ ప్రభావితం చేయదని, అందుకోసం ప్రత్యేకంగా యంత్రాంగం మాకు ఉందని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో రాహూల్ గాంధీ కన్యాకుమారీ నుంచి జమ్మూ కాశ్మీర్ కు 4500 కిమీ భారత్ జోడో యాత్ర చేసి దేశ ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశారు. ఇప్పుడు కూడా సామాన్యుల కష్టాలను దగ్గర నుంచి చూస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం వల్ల కర్నాటక, తెలంగాణలో పార్టీ విజయతీరాలకు చేరింది. కర్నాటకలో బీజేపీ నుంచి అధికారం స్వాధీనం చేసుకున్న కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి అధికారం హస్తగతం చేసుకుంది.   

Tags:    

Similar News