శబరిమలకు ఏమైందీ? అప్పుడే ఎందుకిలా!
శబరిమల.. అయ్యప్పస్వామి దేవాలయం..ఉన్నట్టుండి ఒక్కసారిగా నిండిపోయింది. . తొక్కిసలాట జరిగింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పాప కన్నుమూసింది. ఎందుకిలా జరిగింది?
శబరిమల.. అయ్యప్పస్వామి దేవాలయం.. ఉన్నట్టుండి ఒక్కసారిగా నిండిపోయింది. అయ్యప్ప స్వాములతో కిటకిటలాడిపోయింది. తొక్కిసలాట జరిగింది. బుధవారం సాయంత్రానికి అందిన సమాచారం ప్రకారం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పాప కన్నుమూసింది. మరో ఇద్దరు ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. ఎందుకిలా జరిగింది? కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా రంగంలోకి దిగారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎందుకింత రద్దీ పెరిగిందీ?
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలకు భారీగా చేరుకుంటుండడంతో విపరీతమైన రద్దీ పెరిగింది. దర్శనానికి సుమారు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. దర్శన సమయం పెరిగేకొద్ది భక్తుల తాకిడి కూడా ఎక్కువవుతోంది.
కనిపిస్తున్న కారణాలివీ!
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల తాకిడి పెరిగింది. శబరిమలలో క్యూలైన్ల నిర్వహణలో దేవాలయ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారన్నది శబరిమల వెళ్లిన హైదరాబాద్ వాసి వి.హనుమాన్ ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. రద్దీ పెరగడంతో భక్తులు కొందరు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారని మరో భక్తుడు ఏ.గోవిందయ్య చెప్పారు. ఆంధ్ర, కర్ణాటక భక్తులు పందళంలోని శ్రీధర్మశాస్త ఆలయంలో ఇరుముడి సమర్పించి, అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. డిసెంబర్ 13న భక్తుల రద్దీ బాగా పెరగడంతో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్ చర్యలను మెరుగుపరచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. యాత్రికులకు ఎటువంటి హానీ జరక్కుండా చూడాలని సీఎం ఉత్తర్వులు ఇచ్చారు.
భక్తుల రద్దీని అంచనా వేయలేకపోయారా?
భక్తుల రద్దీని అంచనా వేయలేకపోయారనే అనుమానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన భక్తులు రద్దీని తట్టుకోలేక వెనక్కు తిరిగివచ్చారు. వారిలో నెల్లూరు వాసి మల్లికార్జున్ ఒకరు. ఆయన చెప్పిన దాన్ని బట్టి... మండల పూజ ప్రారంభమైన మొదటి 19 రోజులలో సగటున రోజువారీ యాత్రికుల సంఖ్య 62,000 ఉంటుంది. డిసెంబర్ 6న మండల పూజ ప్రారంభమైంది. ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఆ సంఖ్య 88,000 చేరింది. స్పాట్ బుకింగ్ నిలిపివేశారు. ఎమర్జెన్సీ కేసులకే స్పాట్ బుకింగ్ పరిమితం చేశారు. దర్శన సమయాన్ని గంట పొడిగించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇలా రోజురోజుకూ పెరుగుతుండడంతో ఆలయ నిర్వాహకులు చేతులెత్తాశారు. క్యూలను గాలికి వదిలేశారు.
దర్శనాన్ని సులువు చేయాలనుకుంటే...
శబరిమల వద్ద దర్శనాన్ని సులభతరం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మండల పూజకు ముందు అటువంటి ప్రణాళికను ఖరారు చేశారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాటు కూడా చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ముందుగా నిర్ణయించిన పార్కింగ్ షెడ్యూళ్లను భక్తులు కూడా పాటించలేదు. ఫలితం ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. గతంతో పోలిస్తే ఈ సీజన్‌లో శబరిమల వద్ద పోలీసు బలగాలను పెంచినా ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు.
మైళ్ల కొద్ది నిలిచిన వాహనాలు...
శబరిమలకు వెళ్లే దారులన్నీ వాహనాలతో మూసుకుపోయాయి. చీమల బారుల్లా వాహనాలు నిలిచి ఉన్నాయి. ఐదు రోజులుగా రోడ్లపై ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శబరిమల చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు పలుచోట్ల నిరసనలు తెలుపుతున్నారు. పంబ చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని హైదరాబాద్ నుంచి కార్లో వెళ్లిన సీహెచ్ వెంకటేశ్ చెప్పారు. పోలీసులతో వాగ్వాదాలు షరా మామూలయ్యాయి. ‘రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందనిý‘ కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ అంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు మామూలేనన్నది మంత్రి వాదన.
తెలుగు రాష్ట్రాల వారి పరిస్థితి ఎలా ఉందంటే...
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు భారీ సంఖ్యలోనే భక్తులు వెళ్లారు. అందరిలాగే వీళ్లకీ తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారని వెంకటేశ్ అనే భక్తుడి కథనం. పంబ అనే ప్రాంతంలో దిగి నడిచి వెళ్లడానికి కూడా భక్తులకు దారి దొరకడం లేదన్నది ఆయన ఆవేదన.
శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు...
అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించింది. శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ఈ ప్రత్యేక రైళ్లు డిసెంబర్, జనవరి నెలల్లోని నిర్ణీత తేదీల్లో శబరిమలకు చేరుకుంటాయి. ప్రస్తుత రద్దీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆరా తీశారు. కేరళ అధికారులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేలా చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులను ఆదేశించారు.