మేడిగడ్డకు తక్షణం మరమ్మతులు చేపట్టకుంటే సాగునీటికి ముప్పే

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి మరమ్మతులు చేపడతారా? అంటే అవునంటున్నారు అధికారులు. రుతువపనాలు ప్రారంభం కాక ముందే పనులు చేపట్టాలని కోరుతూ ఎన్‌డిఎస్‌ఎకి లేఖ రాశారు.

Update: 2024-04-20 05:37 GMT
Madigadda Barrage (File Photo)

కుంగిపోయిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మలు చేపట్టేందుకు మార్గాన్ని నిర్దేశించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ)కి లేఖ రాసింది. రుతుపవనాలు ప్రారంభం కావడానికి ముందు మరమ్మతు పనులు చేయకపోతే 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు వరకు మరమ్మతులు చేపట్టే అవకాశం లేదని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు.

- మేడిగడ్డ బ్యారేజీకి తక్షణ మరమ్మతులు చేపట్టడమా లేదా దీని దీర్ఘకాలిక పునరుద్ధరణ పనులు చేయాలా అనే సంశయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే బ్యారేజీలో మునిగిపోతున్న మూడు పిల్లర్ల పునర్నిర్మాణంతో కూడిన శాశ్వత పునరావాస చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు, నీటిపారుదల నిపుణుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం బిజీగా ఉన్నా, మధ్యంతర చర్యలను ప్రారంభించడానికి వీలుగా సూచనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రాసిన లేఖలో అభ్యర్థించింది.
- మేడిగడ్డ బ్యారేజీలో గుర్తించిన నిర్మాణ సమస్యలపై దర్యాప్తు చేస్తున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంజినీరింగ్ నిపుణులు గత నెలలో రెండుసార్లు ఈ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఎన్డీఎస్ఏ నివేదిక జూన్ చివరి నాటికి మాత్రమే ఇవ్వనుంది. ఒక్కసారి రుతుపవనాలు ప్రారంభమైతే, 2025 ఫిబ్రవరి నెలాఖరు వరకు మేడిగడ్డ ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే అవకాశం ఉండదని నీటిపారుదల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా జూన్‌ నుంచి కురిసే భారీ వర్షాల వల్ల వరదలు సంభవించినప్పుడు, దీని ప్రభావం మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణాలు మరింత ప్రమాదకరంగా మారతాయని పేరు చెప్పడానికి ఇష్టపడని తెలంగాణ నీటిపారుదల శాఖకు చెందిన ఓ సీనియర్ ఇంజినీరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఎల్ అండ్ టీ, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీరుకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులు తక్షణం చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. ఈ మేర ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి ఎల్ అండ్ టీకి చెందిన హైడల్ అండ్ టన్నెల్ బిజినెస్ జనరల్ మేనేజర్ ఎస్ సురేష్ కుమార్, ఎల్ అండ్ టీ ఛైర్మన్, ఎండీ ఎస్ ఎన్ సుబ్రహమణ్యం, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డికి తాజాగా లేఖలు రాశారు. రిటైర్డు సివిల్ సర్వెంట్లు, జడ్జీలు, సోషల్ యాక్టివిస్టులతో కూడిన తెలంగాణ మేధావుల ఫోరం అయిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మేడిగడ్డ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేయాలని సూచించింది.

తెలంగాణ రైతుల ఆశలు అడియాసలు...
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం నీటిని అందించేందుకు రూ.1.47లక్షల కోట్ల ప్రజాధనంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంతో సాగు, తాగు నీటి సమస్య తీరుతుందని తెలంగాణ ప్రజలు ఎంతో ఆశ పడ్డారు. కానీ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 7వ బ్లాకులో మూడు పిల్లర్లు 2023వ సంవత్సరం అక్టోబరు 21వతేదీన కుంగిపోయాయి.దీంతో తెలంగాణ రైతులు ఆశలు అడియాసలయ్యాయి.
మేడిగడ్డ బ్యారేజీకి పలు చోట్ల పగుళ్లు కూడా ఏర్పడ్డాయి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ పలు ప్రాజెక్టులను నిర్మించిందని, వేలాదిమంది ఇంజినీర్లకు ఉపాధి కల్పించిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇలా మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీకి పగుళ్లు ఏర్పడటంతో ప్రాజెక్టు పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని సోమ శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

వర్షాకాలం లోపే మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టండి
వర్షాకాలం లోపే మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు వీలుగా మరమ్మతులు పూర్తి చేయాలని ఫోరం పర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి ఎల్ అండ్ టీ కంపెనీని కోరారు. గత ఏడాది అక్టోబరు 22వతేదీన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయాక దెబ్బతిన్న బ్లాక్ 7 పిల్లర్లను మరమ్మతులు చేస్తామని ఎల్ అండ్ టీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొందని, కానీ దీని మరమ్మతులు చేయడంలో కంపెనీ తాత్సారం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా వెంటనే ఎల్ అండ్ టీ కంపెనీ మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టాలని శ్రీనివాసరెడ్డి రాసిన లేఖలో కోరారు.
మేడిగడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల ఆరోపించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక అందిన తర్వాత మాత్రమే మేడిగడ్డ బ్యారేజీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక పునరావాస కార్యక్రమాన్ని చేపట్టాలని గతంలో నిర్ణయించింది. తక్షణ మరమ్మతులకు అనుమతించినప్పటికీ, బ్యారేజీ యొక్క స్థిరత్వం, భద్రతను నిర్ధారించడానికి దీర్ఘకాలిక పునరావాస చర్యలు చేపట్టాలని కొందరు ఇంజినీరింగ్ నిపుణులు సూచిస్తున్నారు.

కాంట్రాక్టు ఏజెన్సీలతో నీటిపారుదల శాఖ అధికారుల సమీక్ష
ఎన్‌డిఎస్‌ఎ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే రుతుపవనాల ప్రారంభానికి ముందు ప్రారంభించాల్సిన మరమ్మతు పనుల గురించి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కాంట్రాక్టు ఏజెన్సీలతో చర్చించింది. కనీసం వచ్చే సీజన్‌లోనైనా రైతులకు సాగునీరిచ్చి ఆదుకునేందుకు గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యామ్‌ను సత్వర మరమ్మతులు చేపట్టాలని ప్రతిపక్షనాయకుడు కే చంద్రశేఖర్‌రావు ఇటీవల డిమాండ్ చేశారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు వల్ల సాగునీరు అందించక పోవడంతో రైతులు ఇప్పటికే రబీ పంటను కోల్పోయారు. ఎన్‌డిఎస్‌ఎ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే యుద్ధప్రాతిపదికన మేడిగడ్డ మరమ్మతు పనులు చేపడతామని తెలంగాణకు చెందిన నీటిపారుదల శాఖ ఇంజినీరు ఒకరు వివరించారు.


Tags:    

Similar News