సెక్రటేరియట్ లోకి మీడియా ఎంట్రీ

ఎంతకాలమైందో సెక్రటేరియట్ లోకి మీడియా అడుగుపెట్టి. కొత్త సచివాలయంలోకి ఎంట్రీ లేదు. అక్రిడిటేషన్ ఉన్నా అల్లంత దూరంలోనే ఆగాలి. రేవంత్ రాకతో మీడియా సందడి మొదలైంది.

Update: 2023-12-07 12:17 GMT
media sandadi

మీడియా ప్రతినిధులు ఎట్టకేలకు సచివాలయంలోకి ప్రవేశించారు. సుదీర్ఘ విరామం తర్వాత సెక్రటేరియట్ లోకి మీడియాకి అనుమతి లభించింది. పాత సచివాలయాన్ని పడగొట్టడానికి ముందు నుంచే మీడియాపై ఆంక్షలు ఉండేవి. పాత సచివాలయంలో మీడియా రూమ్, కంప్యూటర్ సెంటర్ ఉన్నా లోపలికి పోవడానికి వీల్లేక పోయేది. ఆ తర్వాత పాత సచివాలయం స్థానంలో కొత్త సెక్రటేరియట్ వచ్చింది. అది నిర్మాణంలో ఉన్న మూడేళ్లు ఆ వైపు పోయిన వాళ్లు లేరు. ఒకవేళ వెళ్లినా అనుమతి లేదంటూ పోలీసులు, భద్రతా సిబ్బంది వెళ్లగొట్టేవాళ్లు. చివరకు సచివాలయం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైనా.. ఎంపిక చేసిన ఏ కొద్దిమందినో లోపలికి అనుమతించే వారు.

ఆ రోజూ రానివ్వలా...

ప్రారంభోత్సవం నాడైతే కేవలం 9 మీడియా సంస్థల్నే అనుమతించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందని సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి సందేశం వస్తే లోపలకు అనుమతించి కేటాయించిన ఏరియా వరకే పోనిచ్చే వారు. మీడియా రూమ్ నే లేకుండా చేశారు. అక్రిడిటేషన్ ఉన్నా లోపలికి అనుమతి ఉండేది కాదు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకే అనుమతి లేనప్పుడు మీడియా పరిస్థితిని ఊహించలేం కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీడియా వాళ్లకు ఓ గది ఇచ్చేందుకు అనుమతి లభించింది.

రేవంత్ రాకతో సందడే సందడి..

కొత్త సెక్రటేరియట్ ను, ప్రగతి భవన్ ను ప్రజల కోసం తెరుస్తామని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ నేరుగా సచివాలయానికి వెళ్లారు. ఆయనతో పాటే మీడియా ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో సచివాలయానికి వెళ్లారు. ఎంతకాలానికి సచివాలయానికి వచ్చామంటూ మీడియా ప్రతినిధులు మురిసిపోగా సీనియర్ జర్నలిస్టులు తమ పూర్వవైభవాన్ని గుర్తు చేసుకుంటూ కలియతిరిగారు. మొత్తం మీద కొత్త సెక్రటేరియట్ లో పాత్రికేయులు సందడి చేశారు.

Tags:    

Similar News