రెజ్లింగ్ ఫెడరేషన్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్(కుస్తీ) సమాఖ్యను(WFI) క్రీడా మంత్రిత్వశాఖ ఆదివారం సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.

Update: 2023-12-24 08:33 GMT
sanjay singh

తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ సస్పెన్షన్ ఉత్తర్వూలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.

అండర్-15, అండర్-20 జాతీయ పోటీల నిర్వహణలో క్రీడాకారులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హడావుడిగా ప్రకటించడంపై క్రీడా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కమిటీని రద్దు చేయలేదని, కేవలం సస్పెన్షన్ మాత్రమే విధిస్తున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

మంగళవారం రెజ్లింగ్(కుస్తీ) సమాఖ్యకు జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బలపరిచిన సంజయ్ సింగ్, అతని ప్యానెల్ ఘన విజయం సాధించారు. అయితే నూతనంగా ఎన్నికైన ప్యానెల్ రెజ్లింగ్ నిబంధనలు పట్టించుకోకుండా పోటీలపై ప్రకటన చేయడంతో సస్పెన్షన్ విధించినట్లు క్రీడా మంత్రిత్వశాఖ వెల్లడించింది. వారు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే అని వివరించింది. సస్పెన్షన్ విధించడానికి గల కారణాలను విపులంగా వివరించడానికి ప్రయత్నించింది.

సంజయ్ కుమార్ సింగ్ డిసెంబర్ 21 ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అదే రోజు అండర్-15, అండర్-19 కుస్తీ జాతీయ పోటీలను యూపీలోని నందిని నగర్ లో నిర్వహిస్తామని ప్రకటించారు. అది కూడా ఈ ఏడాది చివర్లోగా అని వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

క్రీడాకారులకు ఎలాంటి ముందస్తు సమాచారం,నోటీసు లేకుండా జాతీయ స్థాయి పోటీలు ఎలా ప్రకటిస్తారని ఫిర్యాదులు వచ్చాయి. రెజ్లింగ్(కుస్తీ) రాజ్యాంగం క్లాజ్ 3(ఇ) ప్రకారం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లో, కుస్తీ నియమాల ప్రకారం సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ జాతీయ పోటీలు నిర్వహించాలనే నియమం ఉంది. దీనిని పట్టించుకోక పోవడంతో ఈ నిర్ణయం వెలువడినట్లు భావిస్తున్నారు.

బ్రిజ్ భూషణ్ బలపరిచిన సంజయ్ సింగ్ ప్యానెల్ 15 స్థానాలకు గాను 13 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సన్నిహితులెవరూ ఎన్నికల్లోకి రాకూడదని షరతు విధించారు. అయితే రెజ్లర్లు బలపరిచిన వారెవరూ ఈ ఎన్నికల్లో గెలవలేకపోయారు.

సంజయ్ సింగ్ ఎన్నికను జీర్ణించుకోలేని కొంతమంది కుస్తీ పోటీదారులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఒలంపిక్ విజేత బజరంగ్ ఫూనియా తనకు వచ్చిన పద్మశ్రీని తిరిగి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. అలాగే ఒలంపిక్ పతక విజేత సాక్షి మాలిక్ సైతం రెజ్లింగ్ ను వదిలివేస్తున్నాని ప్రకటించింది.

Tags:    

Similar News