తిరువూరు తప్ప తక్కిన చోట్ల కూటమికే చాన్స్ ?
ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ తిరిగి పుంజుకోనుంది. అధిక స్థానాల్లో జెండా ఎగుర వేయనుంది. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న చర్చ
Byline : The Federal
Update: 2024-05-24 13:46 GMT
ఎన్టీఆర్ జిల్లాలో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, వైఎస్‌ఆర్‌సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కీలక చర్చగా మారింది. గత ఎన్నికల్లో కేవలం ఒక సీటు మాత్రమే తెలుగుదేశం పార్టీ దక్కించుకోగా తక్కిన ఆరు స్థానాలను వైస్‌ఆర్‌సీపీ గెలుచుకుంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆకసక్తికర చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక విజయవాడ తూర్పు తప్ప తక్కిన స్థానాలన్నీ వైఎస్‌ఆర్‌సీపీ ఖాతాల్లోకి వెళ్లాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అడ్డాగా ఉండేది. అధిక శాతం స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. ఇది రాష్ట్రం విభజన జరిగిన తొలి ఎన్నికల వరకు ఇదే కొనసాగుతూనే వచ్చింది. జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్ స్థానాల్లో టీడీపీ, తిరువూరు, విజయవాడ పశ్చిమ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది. అంటే 2014 ఎన్నికల్లో టీడీపీకి ఐదు స్థానాలు టీడీపీ దక్కించుకోగా, కేవలం రెండు స్థానాలకు మాత్రమే వైఎస్‌ఆర్‌సీపీ పరిమితమైంది.
2024 ఎన్నికల్లో కూడా ఇదే ఊపును తెలుగుదేశం పార్టీ కూటమి కొనసాగించే అవకాశం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అభ్యర్థులకు స్థానాలకు కేటాయించడంలోను, చివరి వరకు ప్రకటించక పోవడం, స్థానాలు మార్చడం, రాజధాని అమరావతి అంశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనుసరించిన విధానం, విజయవాడ నగర అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం, అక్రమ మైనింగ్ వంటి పలు అంశాలు 2024 ఎన్నికల్లో ప్రధాన అజెండగా మారాయని, ఇవి ఈ సారి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయని ఇవన్నీ వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు అవకాశాలపై పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
జగ్గయ్యపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సామినేని ఉదయభానుపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీరామ్ తాతయ్యకు ఇది సానుకూలంగా మారనుంది. ఇక్కడ స్థానిక సమస్యల పరిష్కారంలో కూడా ఉదయభాను వైఫల్యం చెందారనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ బలమైన కాపు, కమ్మ సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో చీలిన కాపు ఓటర్లు ఈ సారి కూటమి వైపు మొగ్గు చూపారు. దీనికి తోడు శ్రీరామ్ తాతయ్యపై స్థానికుల్లో సానుభూతి ఉంది. దీంతో ఇక్కడ టీడీపీకే చాన్స్ ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
మైలవరం నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైఎస్‌ఆర్‌సీపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరి అదే పార్టీ అభ్యర్థిగా రంగంలో నిలచారు. ఈయనకు టీడీపీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైనా క్రమంగా సర్థుమణగడం, ఎన్నికల సమయానికి సానుకూలంగా మారాయి. అప్పటి వరకు గ్రూపులుగా ఉన్న టీడీపీ నేతలు ఒక తాటిపైకి వచ్చి వసంత కృష్ణప్రసాద్ గెలుపు కోసం పని చేయడం ప్లస్‌గా మారింది. దీనికి తోడు సర్నాల తిరుపతి యాదవ్‌ను వైఎస్‌ఆర్‌సీపీ బరిలోకి దింపడం, ఆయనకు నియోజక వర్గంలో పెద్దగా పలుకుబడి లేక పోవడం, ఎన్నికల ముందు మంత్రి జోగ రమేష్ సొంత బందువులు టీడీపీలో చేరడంతో వైఎస్‌ఆర్‌సీపీకి మైనస్‌గా మారాయి. వసంత కృష్ణప్రసాద్ తొలి నుంచి ఈ నియోజక వర్గంలో అన్ని విధాలుగా స్థానికులకు దగ్గరవుతూ వచ్చారు. స్వతహాగా ఈ నియోజక వర్గంలో టీడీపీకీ మంచి పట్టుంది. ఎస్సీలు, కమ్మ, కాపు, గౌడ్స్ వంటి సామాజిక వర్గాల మద్దతు ఎక్కువుగా ఉంది. గత ఎన్నికల్లో చీలిన కాపు ఓట్లు ఈ సారి వసంత వైపు మొగ్గు చూపడంతో టీడీపీ గెలుపునకు సానుకూలత అధికంగా ఉందనే చర్చ స్థానికుల్లో ఉంది.
నందిగామలో టీడీపీ నుంచి బరిలోకి దిగిన తంగిరాల సౌమ్యకు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని స్థానికుల్లో చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో పాటు గత ఐదేళ్లల్లో ప్రభుత్వంపైన, సీఎం జగన్ తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన, ప్రజా సమస్యలపైన పోరాటాల ద్వారా నియోజక వర్గ ప్రజలకు దగ్గరయ్యారు. కార్యకర్తలు, నేతలతో ఎలాంటి విబేధాలు తలెత్తకుండా ముందుకు సాగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌లు నియోజక వర్గంలోని స్థానిక సమస్యలు పట్టించుకోక పోవడం, వాటి పరిష్కారంలో శ్రద్ధ చూపక పోవడంతో స్థానికుల్లో వ్యతిరేకత చోటు చేసుకుంది. ఇది తంగిరాల సౌమ్యకు సానుకూలంగా మారిందనే చర్చ స్థానికుల్లో ఉంది.
తిరువూరు అసెంబ్లీ వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉందనే టాక్ ఆ నియోజక వర్గంలో ఉంది. ఇక్కడ నల్లగట్ట స్వామిదాసును వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలో దింపడం, ఆయన గతంలో టీడీపీ నుంచి రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా ఉండటం, టీడీపీ కేడర్ సుపరిచయాలు ఉండటం, తనకు సీటు దక్కలేదనే అసంతృప్తిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి ఇండైరెక్టుగా టీడీపీకి సపోర్టు చేయడం వంటి అంశాలు వైఎస్‌ఆర్‌సీపీకి కలిసిరానున్నాయి. దీనికి తోడు టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావును బరిలోకి దింపడం, ఆయనకు ఈ నియోజక వర్గంలో ఎలాంటి పరిచయాలు లేక పోవడం, స్థానికత తెరపైకి రావడం, స్థానిక టీడీపీ కేడర్ ఆయనకు సపోర్టు చేయక పోవడం, అప్పటి వరకు టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న శ్యామల దత్ కూడా ముభావంగా ఉండటం వంటి అంశాలు ఇక్కడ టీడీపీకి మైనస్‌గా మారాయి.
ఇక విజయవాడ పశ్చిమలో టఫ్ ఫైట్ నెలకొంది. కూటమికి, వైఎస్‌ఆర్‌సీపీలు పోటా పోటీగా ఉంది. కూటమి నుంచి బీజెపీ అభ్యర్థిగా సుజనాచౌదరి రంగంలోకి దిగడంతో ముస్లిం ఓటర్లు వ్యతిరేకిస్తారని అంచనా వేసారు. అయితే ముస్లిం వర్గాలను కూడా ఆయన ముందుకు పోయారు. పోతిన మహేష్ వైఎస్‌ఆర్‌సీపీలో చేరడం వల్ల కూటమికి మైనస్ అవుతుందని భావించారు. అయితే దానిని సుజనా చౌదరి అధికమించారనే టాక్ కూడా ఉంది. ముస్లిం నేత ఆసిఫ్‌ను వైఎస్‌ఆర్‌సీపీ బరిలోకి దింపింది. ముస్లిం వర్గాలతో పాటు బీసీలు, ఎస్సీలు, వైశ్యుల మద్దతు ఉంటుందని అంచనా వేశారు. కానీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్ల ఆ వర్గాల నుంచి పెద్ద మద్దతు రాలేదనే టాక్ కూడా స్థానికుల్లో ఉంది. విజయవాడ సెంట్రల్‌లో టీడీపీ గెలిచే చాన్స్ ఉందని, బొండా ఉమా మరో సారి ఎమ్మెల్యే కానున్నారనే టాక్ స్థానికుల్లో బలంగా ఉంది. అని వర్గాల్లో బొండా ఉమాకు మంచి ఆదరణ ఉండటం, అమరావతి అంశాన్ని తెరపైకి తేవడం తదిర అంశాలు టీడీపీకి సానుకూలంగా మారగా స్థానికేతరుడైన వెల్లంపల్లిని ఇక్కడ బరిలో దింపడంపై స్థానికుల్లో వ్యతిరేకత ఉంది. విజయవాడ తూర్పులో కాస్త పోటీ పోటీ ఉంటుందని భావిస్తున్నా చివరకి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరో సారి గెలిచి చాన్స్ ఉందనే టాక్ స్థానికుల్లో వినిపిస్తోంది. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి బరిలో ఉన్న దేవినేని అవినాష్‌కు మంచి పేరే ఉన్నా అన్ని వర్గాల ఓటర్లకు రీచ్ కావడంలో వెనకపడ్డారనే టాక్ ఉంది.