నీ ఫ్లెక్సీ నువ్వే తీసేస్తే మంచిది, లేదంటే.!

"నువ్వసలు కమ్యూనిస్టువేనా? నీకు కడుపు తీపి తప్ప కమ్యూనిస్టు నీతి లేదా?" అని విరుచుకుపడ్డారు. మచ్చుకైనా మర్యాద లేదా? తట్టుకోలేకే ఈ ఉత్తరం రాస్తున్నా.. ఛీ ఛీ..

Update: 2023-12-02 18:28 GMT
సీపీఐ నారాయణ వర్సెస్ పువ్వాడ

(ది ఫెడరల్ ప్రతినిధి, హైదరాబాద్)

నా రూటే సెపరేట్‌ అంటాడు రజనీకాంత్‌ అదేదో సినిమాలో. అచ్చం అట్లాగే ఉంటది ఈయన స్టైల్‌ కూడా. అభిమానం వచ్చినా తట్టుకోలేడు, ఆగ్రహం వచ్చినా తట్టుకోలేడు. ఆయన్దో విచిత్ర తీరు. ఉన్నట్టుండి గోడల్ని తంతాడు, కాళ్లు విరగ్గొట్టుకుంటాడు. వైఎస్‌ అభిమానినంటాడు, జగన్‌ని వద్దంటాడు. చంద్రబాబూ మోదీ ఏజెంటేనని విరుచుకుపడతాడు, మళ్లీ అంతలోనే.. ఎంతైనా మా జిల్లా వాడు కదా అంటాడు. ఆయన ఎవరో మీకీ పాటికి తెలిసే ఉంటుంది. ఆయనే సీపీఐ నారాయణ. ఇప్పుడెందుకు ఆయన ప్రస్తావన అంటే.. సొంత పార్టీ నాయకుడిపైన్నే లెటర్ బాంబ్ వేశాడు. సీపీఐలో సీనియర్‌ నాయకుడు, రెండు సార్లు ఎమ్మెల్యే, ఓసారి ఎమ్మెల్సీ అయిన ఖమ్మం జిల్లా నేత పువ్వాడ నాగేశ్వరరావుకు ఘాటుగా లేఖ రాశారు. "నువ్వసలు కమ్యూనిస్టువేనా? నీకు కడుపు తీపి తప్ప కమ్యూనిస్టు నిబద్ధత లేదా?" అని విరుచుకుపడ్డారు. అంతటితో ఆగాడా అంటే తగ్గేలేదంటూ "పార్టీ కార్యాలయం ముందున్న నీ బొమ్మను నువ్వే తొలగించుకుంటే మంచిది.. లేకుంటే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలే తొలగిస్తారని" స్ట్రాంగ్‌ డోస్ కూడా ఇచ్చారు. 

ఇంత కోపం ఎందుకయ్యా...

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పోటీ చేశాడు. పంచపాండవులు మంచపు కోళ్ల మాదిరిగా సీపీఐకి కాంగ్రెస్‌ పార్టీ పొత్తుతో దొరికిన ఏకైక సీటు అది. ఎక్కడెక్కడి వాళ్లందరూ అక్కడికి ఎత్తరా మన ఎర్రజెండా అంటూ పాటలు పాడారు, కంకీ కొడవలి గుర్తుకు ఓటేయమని ప్రచారం చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కంకణాల నారాయణ కూడా ఎర్రజెండా కప్పుకుని బొగ్గుగనుల దారి పట్టారు. నిజానికి నారాయణకి ఈ ప్రాంతం కొత్తేమీ కాదు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడి పోయారు. సీపీఎం నేతలే తన ఓటమికి కారణమంటూ కూడా ఆవేళ పెద్ద రాద్ధాంతమే సృష్టించారు. సీపీఎం నేత తమ్మినేనికి నారాయణకి మధ్య సవాళ్ల పర్వం కూడా నడిచింది. దాన్ని పక్కన బెడితే ఇప్పుడొచ్చిన గొడవేంటంటే.. మొగుడు కొట్టినందుకు కాదు ఆడబిడ్డనవ్వినందుకన్నట్టుగా పార్టీ సీనియర్‌ నేతగా ఉన్న పువ్వాడ నాగేశ్వరరావు కనీసం మొహమాటానికైనా కొత్తగూడెం రాలేదేమిటని పక్క పార్టీల వాళ్లు అనడంతో నారాయణకు కోపం కట్టలు తెంచుకుంది. ఇక అంతే, నారాయణ రెచ్చిపోయి లేఖాస్త్రాన్ని సందించారు. 

లేఖలో ఏముందంటే...

‘‘వువ్వాడ నాగేశ్వరరావు కి..

ఇలాంటి ఉత్తరం ఎప్పుడో రాయాల్సి ఉన్నా మీ గత చరిత్ర, మీరు పార్టీ చేసిన సేవరీత్యా నా మనసంగీకరించక రాయలేదు. ఇంకా భరించడం నా వల్ల కాదు" అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చాక పువ్వాడలో చాలా మార్పు వచ్చాయని దుమ్మెత్తి పోశారు. "మీ కుమారుడు మంత్రి అజయ్ కుమార్ రాజకీయాలల్లో చురుకైన పాత్ర వహించింది మొదలు మీలో మౌలిక మార్పులు వచ్చాయి. తండ్రి కొడుకులు ఒకే పార్టీలో ఉండాలని నేను అనుకోను. కేరళ రాష్ట్రంలో మన పార్టీ భార్యా భర్తలుగా ఉన్నా గౌరీ, గౌరీ థామస్ చెరొక పార్టీలో ఉన్నారు. నీలం రాజశేఖర్‌రెడ్డి, నీలం సంజీవరెడ్డి సొంత అన్నదమ్ములైనా చెరొక పార్టీలో క్రియాశీలంగానే ఉన్నారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అయితే మీరు సీపీఐలో ప్రముఖ పాత్ర వహించి పార్టీకి చెడ్డ పేరు తెచ్చారు" అని నిప్పులు చెరిగారు.

ఎన్నో పదవులు అనుభవించారుగా..

పార్టీ ఇచ్చిన అవకాశంతో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పదవులు అనువభవించి.. ఇప్పుడు పడక కుర్చీకే పరిమితమైనా సీపీఐ సాధారణ సభ్యులుగా ఉండడం సంతోషమంటూనే కొడుక్కోసం ఎర్రజెండాను పక్కన ఎలా పెడతావు అంటూ చెలరేగి పోయారు నారాయణ. "ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయం ముందు మీ ఫ్లెక్సీ నేటికీ ఉంది. ఇంత గౌరవం పొందిన మీరు సీపీఐకి ఇస్తున్న మర్యాద ఏది? మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలు మారుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రతి సందర్భంలో మీ కుమారుడిని సమర్థించారు తప్ప సీపీఐ కాదు’’ అని నారాయణ ఆక్రోశం వెళ్లగక్కారు.

మచ్చుకైనా సాంబశివరావుని సమర్థించలేవా?

‘‘తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ, రాష్ట్ర రాజకీయ విధానాలపై సీపీఐ ఒకే విధానం తీసుకున్నది. అందులో భాగంగానే కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్ మనకు కేటాయిస్తే అక్కడ కూనంనేని సాంబశివరావును పోటీకి పెడితే మచ్చుకైనా వచ్చి పలకరించే స్థితిలో లేవా?" అని గుడ్లురిమారు. కదల్లేని స్థితిలో ఉన్న నువ్వు (పువ్వాడ) మీ అబ్బాయి, బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్ కుమార్‌ని బలపరుస్తూ వీధివీధి ఎలా తిరిగావంటూ దెప్పిపొడిచారు నారాయణ. మర్యాదకైనా కొత్తగూడెం స్థానం బలపడే విధంగా సీపీఐని సమర్థిస్తూ ఒక్క ప్రకటనైనా చేయకపోవడం సిగ్గన్పించలేదా? అంటూ నారాయణ ఓ యాష్టపడ్డారు. పార్టీకి చెడ్డ పేరు వస్తున్నా, చూస్తూ ఊరుకోలేక ఈ ఉత్తరాన్ని రాస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం ముందున్న మీ ఫ్లెక్సీని మీరే తీసేయించుకుంటే మంచిందని’’ పువ్వాడ నాగేశ్వరరావు నారాయణ సలహా ఇచ్చారు.

Tags:    

Similar News