మాజీ మంత్రి మల్లారెడ్డిపై అట్రాసిటీ కేసు
ఇక మాజీల మీద కేసులు బుక్ అవుతాయి. గిరిజన భూములు కాజేశారన్న ఫిర్యాదుతో కార్మిక శాఖ మాజీ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అధికారంలో ఉన్నపుడు కొందరు ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడతారు. అడ్డదార్లు తొక్కుతారు. బాధితులు వారిపై కంప్లైట్ ఇచ్చినా ఫలితం ఉండదు. వారు మాజీలయిపోయాక కథ మారిపోతుంది. అధికారంలో ఉన్నోళ్ల మీద బాధితులు కేసులుపెట్టినా ప్రయోజనం ఉండదు. పోలీసులు పట్టించుకోరు. సరికదా ఎదురు కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో లేదో బిఆర్ ఎస్ మాజీల మీద కేసులు బుక్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే...
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే మల్లారెడ్డి(Ex minister Malla Reddy)పై శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ కేసు ఫైలైంది. గిరిజనుల భూములు కబ్జా చేశారన్నది ప్రధాన ఆరోపణ.
మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లోని 47 ఎకరాల 18 గుంటల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేశారని శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారించిన పోలీసులు మల్లారెడ్డి, ఆయన అనుచరులు, బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డీసీఏంఎస్) జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, చీటింగ్ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన ఎమ్మార్వోపై కూడా కేసు ఫైల్ చేశారు పోలీసులు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ జరిగిపోయిందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.