కేఏ పాల్ వేశాడండీ! బట్ట కాల్చి మంద కృష్ణ మొహంపైకి..
మంద కృష్ణ.. ఓనాటి నక్సలైట్. ఇప్పటి క్యాస్టిస్టు. పీపుల్స్ వార్ నుంచి బయలుదేరి క్యాస్ట్ వార్ దాకా వచ్చినవాడు. అటువంటి మంద కృష్ణపై కేఏ పాల్ చెలరేగి పోయారు.
K.A. PAL: కేఏ పాల్ వేశాడండీ! బట్ట కాల్చి మంద కృష్ణ మొహంపైకి..
(ది ఫెడరల్ ప్రతినిధి, హైదరాబాద్)
అదేదో సినిమాలో ‘వేశాడండీ’.. అనే పేలి పోయే డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు కేఏ పాల్ వేశాడు మంద కృష్ణ మాదిగపైన.. అదీ సరిగ్గా దీపావళినాడే. టపాసులా పేలి పోయాడు. మామూలుగానే కేఏ పాల్ ఏది చేసినా, ఏమి చేసినా తమషాగానే ఉంటుంది. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో ఆంధ్రజ్యోతి దినపత్రిక రాధాకృష్ణతో చెలరేగిపోయాడు. ఇటీవల పవన్ కల్యాణ్ ను దునుమాడారు. ఇప్పుడు ఏకంగా మంద కృష్ణపై పడ్డాడు. కేఏ పాల్ ఎవరో మీకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. ప్రపంచంలో ఆ మూల నుంచి ఈ మూలకు చుట్టబెట్టానంటాడు. అమెరికన్ ప్రెసిడెంట్ కు ఉండే వన్ ఎయిర్ ఫోర్స్ తనకూ ఉందంటాడు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మలుస్తానంటాడు. ముఖ్యమంత్రి పదవిస్తే ఏపీని అక్కడెక్కడో నిలబెడతానంటారు. అలాంటోడు ఉన్నట్టుండి మంద కృష్ణ (MANDA KRISHNA) జోలికి ఎందుకొచ్చాడో మరి.
నక్సలిజం నుంచి కులవాదం వరకు
మంద కృష్ణ.. ఓనాటి నక్సలైట్. ఇప్పటి క్యాస్టిస్టు. పీపుల్స్ వార్ నుంచి బయలుదేరి క్యాస్ట్ వార్ దాకా వచ్చినవాడు. లాస్ట్ బ్రాహ్మిన్ పుస్తక రచయిత, ఓనాటి నక్సలైట్ (NAXALITE) అభిమాని రాణి శివశంకర శర్మ లెక్క ప్రకారం మందకృష్ణ భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను మించిన గొప్పవాడు. నీ కులమెంటో చెబితే నువ్వేంటో చెబుతానంటారు బీఆర్ అంబేడ్కర్ (B.R. AMBEDKAR). అలా నేను.. మాదిగ, నన్ను అలాగే పిలవండని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన వాడు, పేరు చివర్న ఆ తోక తగిలించుకున్న వాడు మన మంద కృష్ణ మాదిగ. ఎస్సీల వర్గీకరణ కోసం మూడు దశాబ్దాల కిందటే చీరాల నుంచి వరంగల్ దాకా మహాపాద యాత్ర జరిపిన వాడు, పసి పిల్లల గుండెలకు చిల్లులు పడితే ఉచితంగా ఆపరేషన్ చేయించాలని హైదరాబాద్ నగర నడిబొడ్డులోని ట్యాంక్ బండ్ ను ముట్టడించి మందిని పోగేసి ఉచిత పథకాన్ని సాధించిన వాడు, వైఎస్ రాజశేఖరరెడ్డి (YS RAJASEKHAR REDDY)తో ఆరోగ్యశ్రీకి శ్రీకారం చుట్టించిన వాడు మంద కృష్ణ. ఆ తర్వాతి కాలంలో ఆయన ఉద్యమం చీలికలు పేలికలై పోయినా ఒకటికి మూడు ఎంఆర్పీఎస్ లు వచ్చినా ఆయన మాత్రం దాన్ని వదిలి పెట్టకుండా నడుపుతున్నాడు. చిత్రమేమిటంటే మంద కృష్ణ కింద పడ్డ ప్రతిసారీ ఫీనిక్స్ పక్షిలా పైకి ఎగురుతూనే ఉన్నాడు.
72 కోట్లకు అమ్ముడు పోయినట్టు ఆరోపణ
సరిగ్గా అలానే నవంబర్ 9 న సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ(NARENDRA MODI)ని, ఉప్పు నిప్పుగా ఉండే రైటిస్ట్ ని పిలిచి హైదరాబాద్ నగరం మధ్యన కౌగిలించుకుని కన్నీరు పెట్టుకున్న మంద కృష్ణపై ఇప్పుడు కేఏ పాల్ (K.A.PAL)అనే మతబోధకుడు ఓ అస్త్రాన్ని సంధించాడు. మంద కృష్ణ అదేదో బాటా కంపెనీ రేటు మాదిరి 72 కోట్లకు అమ్ముడు పోయినట్టు ఆరోపించాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది.
ఇంతలో ఎందుకింత మార్పు
ఇంతకీ కేఏ పాల్ చెబుతున్నదేమిటంటే.. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరేడ్ గ్రౌండ్‌లో సభకు ముందు రూ.72 కోట్లు ముట్టాయి. అసలు మోదీయే బీసీ కాదు. మొన్నటి వరకు ఇష్టమొచ్చినట్టు తిట్టి ఇప్పుడు మోదీని వాటేసుకోవడం ఏమిటీ అన్నది కేఏ పాల్ అనుమానం.
మంద కృష్ణకి మయస్ఫూర్తి మెండు
రాజకీయ నాయకులు ఏ సమయంలో తన మాట వింటారో మంద కృష్ణకు బాగా తెలుసు. అందుకే అదును చూసి పదును పెట్టాడు. మోదీ దెబ్బకు దిగివచ్చాడు. అంతకు మూడు రోజుల ముందే హైదరాబాద్ వచ్చి పోయిన మోదీ 48 గంటలు తిరక్కమునుపే భాగ్యనగరం బాట పట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మంద కృష్ణ ఏ పార్టీకి మద్దుతు ఇస్తాడో చెప్పకనే చెప్పాడు. బీజేపీకి (BJP) మద్దతివ్వటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాదిగ విశ్వరూప మహా సభలో ప్రధాని మోదీ.. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నానంటూ హామీ ఇచ్చారు. దీంతో మంద కృష్ణ బాగా భావోద్వేగానికి గురై కళ్ల నీళ్లు పెట్టుకుంటే మోదీ గుండెలకు హత్తుకుని.. ఓరయ్యా, నీకు నేనున్నా, ఏడుపొద్దని సముదాయించారు. ఆ తర్వాత మోదీ ఢిల్లీ వెళ్లారు. మంద కృష్ణ మాదిగ పార్శీగుట్ట ఇంటికి పోయాడు. ఈకథ అంతటితో ముగిసిందనుకున్నారు అందరూ.,
నన్నూ అడిగారు డబ్బులు- కేఏ పాల్
అటువంటి సమయంలో కేఏ పాల్ మందకృష్ణ మాదిగపై లక్ష్మీబాంబు పేల్చాడు. 72 కోట్లకు అమ్ముడు పోయాడు మంద కృష్ణంటూ ఆరోపించాడు పాల్. అంతటితో ఆగకుండా దానికో నేపథ్యం చెప్పుకొచ్చారు. ప్రజాశాంతి పార్టీలో చేరమని అడిగితే రూ.25 కోట్లు అడిగారని, అంత నేను ఇచ్చుకోలేనని అన్నానని కేఏ పాల్ ఆరోపించారు. ప్రధాని మోదీకి మందకృష్ణ అమ్ముడు పోయారంటూ ఇంతెత్తున మండిపడ్డారు. నిజంగా మంద కృష్ణ ప్యాకేజీ తీసుకోకపోతే నవంబర్ 30న ఓటింగ్ పోకుండా (TELANGANA ELECTIONS) మాదిగలకు పిలుపివ్వాలని ఓ వింత కండిషన్ పెట్టడం కొసమెరుపు. కేఏ పాల్ అంతటితో ఆగడంట. మంద కృష్ణ విశ్వరూపాన్ని బయటపెడతానంటున్నాడు. డిసెంబర్ 3 లోగా ఏమవుతుందో చూద్దాం.