ఇక తీసుకెళ్లండి మీ డబ్బుల్ని!

కాసినా కూసినా సుమారు 469 కోట్లు.. మరెంతో బంగారం, మందు, చీరెలు, సారెలు.. ఇలా ఏవేవో మొన్నటి ఎన్నికల్లో పట్టుబడ్డాయి.

Byline :  Amaraiah Akula
Update: 2023-12-04 16:47 GMT
తెలంగాణలో పోలీసులు పట్టుకున్న డబ్బు, బంగారం

కాసినా కూసినా సుమారు 469 కోట్లు.. మరెంతో బంగారం, మందు, చీరెలు, సారెలు.. ఇలా ఏవేవో మొన్నటి ఎన్నికల్లో పట్టుబడ్డాయి. ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉండడంతో పోలీసులు కొరఢా ఝళిపించారు. 50 వేల రూపాయలకు మించి ఏమాత్రం దొరికినా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడా డబ్బంతా కుప్పలు కుప్పలుగా, కట్టలు కట్టలుగా పేరుకుపోయి ఉంది పోలీసు స్టేషన్లలో, కోర్టు ఆవరణల్లో, ఆదాయపన్ను అధికారుల కస్టడీలో. పెళ్లిళ్లు పబ్బాలకు వెళుతున్నామన్నా ఆవేళ పోలీసులు వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఎన్నికల హడావిడి ముగిసింది. ఫలితాలు వచ్చాయి. ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎవరు గెలిచారో అధికారికంగా రాజముద్ర వేయించారు. ఆంక్షలు తొలగించారు. నిబంధనావళి ముగిసింది గనుక మీ డబ్బుల్ని, బంగారాన్ని తీసుకుపోండంటున్నారు పోలీసులు.

ఎన్నికల కోడ్‌ను ఎత్తేశారు...
తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌ 9న షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి ఈ కోడ్‌ అమల్లోకి వచ్చింది. నవంబర్‌ 3న ఎన్నికల ప్రకటన జారీ అయింది. 10వ తేదీ వరకు నామినేషన్లు, 30న పోలింగ్‌ జరిగింది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపూ పూర్తయింది. అధికారికంగా కోడ్‌ను ఎత్తేశారు.
కట్టలు కట్టలే...
తెలంగాణ ఎన్నికల్లో 241 కోట్ల రూపాయల డబ్బు, మరో వంద కోట్ల విలువైన బంగారం, ఫ్యాన్లు, చీరెలు, కార్లు, ఏవేవో దొరికాయి. 2018 ఎన్నికలతో పోలిస్తే, ఈసారి ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు 248 శాతం పెరిగింది. 2018 ఎన్నికల్లో 97 కోట్లు పట్టుబడగా, ఈసారి ఏకంగా 241 కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం డబ్బు మాత్రమే కాదు.. 176 కోట్ల రూపాయల విలువైన బంగారు–వెండి ఆభరణాల్ని కూడా సీజ్‌ చేశారు. ఇక రూ.13.36 కోట్ల విలువైన లిక్కర్, 22.17 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, 16.63 కోట్ల రూపాయల విలువైన బహుమతుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం విలువ 469 కోట్ల రూపాయల పైమాటే. ఏకంగా 11,859 కేసులు కూడా నమోదయ్యాయి.
రండి, వచ్చి తీసుకెళ్లండి...
ఇప్పుడీ డబ్బంతా తీసుకెళ్లండని చెబుతున్నారు. వచ్చేటప్పుడు పోలీసులు ఇచ్చిన రశీదులు, ఇతరత్రా పత్రాల్ని వెంట తెచ్చుకోమన్నారు. ఏ కాగితం లేకుండా దేన్నీ ఇవ్వబోమంటున్నారు, ఆసాములు ఇక జాగ్రత్తగా పోయి తెచ్చుకోండి మరి.


Tags:    

Similar News