బీర్ తాగి పడుకోకుండా వచ్చి ఓటేయండి: నిర్మాత అల్లు అరవింద్
ఉత్సాహంగా పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్లలో యువ ఓటర్లు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు జరిగినా, ప్రశాంతంగా కొనసాగుతోంది.
మధ్యాహ్నం 3 గంటల వరకూ జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే దాదాపుగా 60 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. హైదరాబాద్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది.
సినీ తారలు ఉత్సాహంగా పోలింగ్ పాల్గొంటున్నారు. జూబ్లిహిల్స్ లోని పలు కేంద్రాల్లో సినీతారులు ఓటు వేయడంతో పాటు ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినయోగించుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
"ఇంట్లో కూర్చున్న వారికి ఓ విజ్ఞప్తి. ఓటేయకపోతే ప్రభుత్వం అది చేయలేదు.. ఇది చేయలేదని అడిగే హక్కు మీకు ఉండదు. అలా ఉండొద్దు అనుకుంటే మీరు వచ్చి ఓటేయండి. ఇవాళ హాలిడే కదా అని బీరు తాగి పడుకోకుండా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి," అని పిలుపునిచ్చారు.
కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు వేసేందుకు మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. భార్య సురేఖ, కూతురు శ్రీజతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు విక్టరీ వెంకటేశ్ కూడా ఓటు వేశారు. షేక్ పేట ఇంటర్నేషనల్ స్కూల్లో దర్శకుడు రాజమౌళి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే నటులు రాజేంద్ర ప్రసాద్, కళ్యాణ్ రామ్, శివాజీ రాజా, యాంకర్ ఝాన్సీ, సింగర్ సునీత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రప్రసాద్ కోరారు. సాయంత్రం 5 గంటలలోగా భారత పౌరుడిగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్నజూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ లో భాగంగా నటులు ఎన్టీఆర్, అల్లు అర్జున్, సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి క్యూలైన్లో నిలుచుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఎన్టీఆర్ వచ్చారు. అల్లు అర్జున్ బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్లో సుమంత్ ఓటు వేశారు.
ఓటు వేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా గురువారం ఓటు హక్కు వినియోగించుకున్నారు పవర్ స్టార్ , జనసేనాని చీఫ్ పవన్ కళ్యాణ్. సినీ రంగానికి చెందిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, జూనియర్ ఆర్టిస్టులు సైతం ఓటు వేసేందుకు బారులు తీరి ఓటు వేశారు. సినీ స్టార్లలో కళ్యాణ్ రామ్ , దర్శకులు తేజ, శేఖర్ కమ్ముల, సింగర్ సునీత , తమ్మారెడ్డి భరద్వాజ, హరీశ్ శంకర్ , తదితరులు ఓటు వేశారు.
గతంలో లేని నీళ్లు, కరెంట్ రాష్ట్రానికి వచ్చాయి: విజయ్ దేవరకొండ
రాష్ట్రంలో గత 10 ఏళ్లలో అభివృద్ధి జరిగిందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. గతంలో లేని నీళ్లు, కరెంట్ రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. ఓటు వేయడం మన బాధ్యత అని.. అందరూ తమకు నచ్చిన నేతకు ఓటు వేయాలని సూచించారు. ఒకవైపు ప్రజలు తమకు నచ్చిన వారికి ఓటేయమంటూనే మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా మాట్లాడటాన్ని అక్కడున్న కాంగ్రెస్‌పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.