అధిష్ఠానం ఆశీస్సులు ఎవరికో...

తెలంగాణ కొత్త సీఎం ఎవరు.. డిప్యూటీ సీఎంలు ఎంతమంది.. అధిష్ఠానం సీనియార్టీటికి ప్రాధాన్యం ఇస్తుందా? లేక ఎమ్మెల్యేల అభిప్రాయానికి తలొగ్గుతుందా?

Update: 2023-12-04 14:02 GMT

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలన పూర్తయ్యింది. ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ 65 స్థానాలను కైవసం చేసుకోవడం..సీఎం కేసీఆర్‌ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపండం చకచకా జరిగిపోయాయి. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జోరందుకున్నాయి.

గెజిట్‌ రిలీజ్‌..

ఇటు తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గెజిట్‌ కాపీని తెలంగాణ చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ వికాస్‌ రాజ్‌, ఈసీ ముఖ్య కార్యదర్శి అవినాష్‌, బృంద సభ్యులు గవర్నర్‌ తమిళసైకు అందజేశారు. దీంతో పాత శాసనసభ రద్దయి కొత్త శాసనసభ ఏర్పాటు కానుంది. అంతకుముందు వికాస్‌రాజ్‌ కొత్త ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందించారు.

ఇంకా వీడని ఉత్కంఠ..

హస్తం గుర్తొళ్లు ప్రజాక్షేత్రంలో గెలవనైతే గెలిచారు. కాని వారికి ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడిరది. సీఎల్పీ నేత ఎవరని? సీఎం రేసులో ఇప్పటికే పార్టీ సీనియర్‌ లీడర్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌, రాజగోపాల్‌ రెడ్డి ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. సీఎల్పీ తీర్మాణాన్ని టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టగా దాన్ని ప్రస్తుత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మిగత నాయకులు బలపర్చారు. సోమవారం మధ్యాహ్నం ఏకవాక్య తీర్మాణాన్ని పంపిన డిప్యూటీ సీఎం శివకుమార్‌ తర్వాత అధిష్ఠానంతో కలిసి చర్చించేందుకు వెళ్లారు. సీఎం పేరును ఏఐసీసీ ప్రకటిస్తుందని కొందరు అంటుండగా.. డీకేనే ప్రకటిస్తారని మరికొందరంటున్నారు.

డిప్యూటీ సీఎంలు ఒక్కరా? ఇద్దరా?

సీఎం ఎవరన్నది పక్కన పెడితే..డిప్యూటీ సీఎం పదవి కోసం ఇద్దరు సీనియర్లు పోటీపడుతున్నారు. ఆ జాబితాలో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంగా రేవంత్‌ పేరు ప్రకటిస్తే.. కనీసం ఉపముఖ్యమంత్రి పదవి తప్పకుండా తమకే ఇస్తారని ధీమాతో ఉన్నారు.

ఎమ్మెలేల నుంచి అభిప్రాయ సేకరణ?

సీఎల్పీ ఎంపికపై ఒక్కో ఎమ్మెల్యే నుంచి కూడా డీకే సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. వారి అభిప్రాయాలను కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ముందుంచనున్నట్లు సమాచారం. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రేవంత్‌వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాగా పార్టీలో సీనియర్లను దృష్టిలో ఉంచుకుని సీఎం పేరును ప్రకటిస్తారా? లేక ఎమ్మెల్యేల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా అధిష్టానం నుంచే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.. సీఎం అభ్యర్థిపై కార్లిటీ వస్తే.. వెంటనే గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు.

రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు..

రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాటు చురుగ్గా జరుగుతున్నాయి. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆర్‌అండ్‌బీ, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లలో బీజీ అయ్యారు. అవసరమైన కుర్చీలు, టెంట్లు, సహా ఇతరత్రా సామగ్రిని ఇప్పటికే తరలించారు.అటు అసెంబ్లీని కూడా ముస్తాబు చేస్తున్నారు. రంగులు వేసి, పాత ఫర్నిచర్‌ స్థానంలో కొత్త వాటిని అమరుస్తున్నారు.

కొత్త మంత్రులకు వాహనాలు ..

కొత్త మంత్రుల కోసం వాహనాలను అధికారులు సిద్ధం చేశారు.  వాటిని దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌లో సిద్ధంగా ఉంచారు.  

Tags:    

Similar News