మన ఆలోచనల నుంచి విడిపోని సినిమా ‘లీవింగ్ లాస్ వేగస్’

నన్ను వెంటాడిన సినిమాలు-3 (ఫిల్మ్ క్రిటిక్ రామ్ సి మూవీ కాలమ్);

Update: 2025-03-28 06:14 GMT

-రామ్ సి


ప్రతి మనిషికి ఓ ప్రత్యేక లక్ష్యం ఉంటుంది. దాన్ని ఛేదించడానికి అన్నింటినీ పణంగా పెట్టి ప్రయత్నిస్తారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. అది తప్పని నేను చెప్పడం లేదు, కానీ నాకు ఎందుకో అది చేత కాలేదు. అసలు నేను ఎంత ప్రయత్నం చెయ్యాలో, ఎంత కాలం ఎదురుచూడాలో కూడా తెలియకపోవడం ఓ కారణమైతే, "చాలా అవకాశాలు ఉన్నాయిగా" అంటూ ముందుకు సాగిపోవడం ఇంకో కారణం. ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు తట్టుకోవటానికి, ఒంటరితనాన్ని జయించడానికి ఓ వ్యసనాన్ని ఆసరాగా చేసుకోవడం, దానికి నెమ్మదిగా బానిసగా మారిపోవడం మాత్రం నన్ను భయపెడుతుంది. ఆ లక్ష్యం నెరవేరే సమయానికి ఈ ఆసరాగా తెచ్చుకొన్న అలవాటు, మనిషిని కబళించేసుంటుంది.

అటువంటి ఓ మనః స్థితిని పరిచయం చేసే సినిమా ‘లీవింగ్ లాస్ వేగస్’ (Leaving Las Vegas). నికోలాస్ కేజ్ (Nicolas Cage) ఉత్తమ నటుడి ఆస్కార్ అవార్డు పొందినప్పుడే ఇది నా దృష్టిలో పడింది. ఇది కేవలం ఒక సినిమా కాదు; ఇది నేను పైన చెప్పినట్టువంటి ఓ అనుభవం. మైక్ ఫిగిస్ (Mike Figgis) దర్శకత్వంలో, జాన్ ఓబ్రియన్ ( John O'Brien )స్వీయ జీవిత నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా బెన్ యాండర్సన్  (Ben Sanderson) అనే ప్రఖ్యాత screenwriter జీవితాన్ని అనుసరిస్తుంది. 16 ఎం. ఎం కెమెరా వాడకంతో, కదిలే కెమెరా షాట్లతో, సహజమైన లైటింగ్‌తో ఈ సినిమా మరింత ఒంటరితనాన్ని, భయానకతను అందిస్తుంది. లాస్ వేగస్ (Las Vegas), సాధారణంగా ప్రకాశంగా చూపబడే నగరం, ఇక్కడ ఖాళీగా, వెలితిగా కనిపిస్తుంది. నీయాన్ లైట్లు కాంతి పంచవు; వాటి వెనుక ఖాళీ వీధులు,cheap motels, తాగి తనను తాను నాశనం చేసుకుంటున్న బెన్ (Ben) మాత్రమే కనిపిస్తాడు. Mike Figgis స్వయంగా రాసిన జాజ్ మ్యూజిక్ సినిమా మొత్తం లోకాన్ని మరింత దిగులుగా, నిశ్శబ్దంగా మార్చేస్తుంది.

Ben మనకు పరిచయమయ్యే సరికి అవకాశాలు కోల్పోయి, తన జీవితాన్ని పూర్తిగా మద్యం వ్యసనానికి లొంగిపోయి, ఇక సాదించలేను అని స్ఫురించి, తాను తాగి తాగి చనిపోవాలని నిర్ణయించుకుని Las Vegas కు వెళ్తాడు.అక్కడ అతను సెరా ( Sera) (Elizabeth Shue) అనే వేశ్యను కలుస్తాడు. ఆమె కూడా తన జీవితంలో ఓ వేదనను మోస్తూ ఉంటుంది. వీరిద్దరి బంధం ప్రేమ మీదా, ఆశ మీదా కాకుండా, ఒంటరితనాన్ని పంచుకునే బంధంగా రూపుదిద్దుకోవడం నేను ఇంతకు ముందు చూడలేదు. సాధారణంగా ఇలాంటి సినిమాలు వ్యసనాలకు విముక్తిని చూపిస్తాయి, కానీ Leaving Las Vegas అలా కాదు. ఇది ఏదో ఒక చక్కటి ముగింపుకు తీసుకెళ్లదని అర్థం చేసుకున్నప్పుడు, అది మరింత కలవరపెడుతుంది. ఆదే సమయంలో Sera ఓ భయానకమైన సామూహిక అత్యాచారానికి గురికావడంతో ఈ కథ ఏమాత్రం మానవీయంగా అనిపించదు, ఒక చీకటి గూహలా అనిపిస్తుంది.

క్లైమాక్స్ తెలివైనదేగానీ, హృదయ విదారకమైనది. మద్యం ప్రభావంతో పూర్తిగా నీరసించి, ప్రాణం పోయే స్థితికి వచ్చిన Ben, ఒక మోటెల్ (motel) గదిలో చివరి శ్వాస తీసుకుంటాడు. Sera అతని పక్కనే ఉంటూ, కనీసం చివరి క్షణాల్లో అతనికి ఇష్టం లేకున్నా ఓదార్పునిచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎలాంటి భావోద్వేగ నాటకమూ లేకుండా, ఎలాంటి భారీ ఎమోషనల్ క్లైమాక్స్ లేకుండా, సినిమా అతన్ని నిశ్శబ్దంగా విడిచిపెడుతుంది. అతని మరణం కేవలం ఓ క్షణం, కానీ ఆ క్షణం తర్వాత ఉత్పన్నమయ్యే నిశ్శబ్దం, వెలితి, అది ప్రేక్షకుల మనసుపై మిగిలిపెట్టే భారం అంతకు మించి ఉంటుంది. ఆ సన్నివేశం తర్వాత మనం దాన్ని అడ్డుకోలేని స్థితిలో ఉండటం భయంకరంగా అనిపిస్తుంది.

నేను Ben లా జీవించను, అతని మార్గాన్ని ఎప్పుడూ అనుసరించను, కానీ ఈ సినిమా నాకు మరపురాని గాయం మిగిల్చింది. కొన్ని పోరాటాలు గెలుపుకోసం ఉండవు; కొన్ని కథలు చివరకు మనలను ఖాళీగా వదిలేస్తాయి. ఒకసారి చూడటం విచారంగా అనిపించిన ఈ సినిమా, రెండవసారి చూస్తే అస్సలు తట్టుకోలేనిది. ఎందుకంటే అప్పటికి మనం ప్రేక్షకులు కాదు, ఆ కథలో పాత్రలం. చివరి దశ ఏదో ఒక మార్గంలో మార్చేయాలని మనసులో తపన కలిగినా, అది అసాధ్యమని తెలిసే సమయానికి మనం పూర్తిగా దాని బాధను మోస్తూ ఉంటాం. కొన్ని సినిమాలు వినోదం కోసం ఉంటాయి, కొన్ని విజ్ఞానం అందిస్తాయి. కానీ Leaving Las Vegas మనలోనే మిగిలిపోయి, మన ఆలోచనలలో శాశ్వతంగా చేరిపోతుంది.



Tags:    

Similar News