ఘాటెక్కిన గుంటూరు కారం

మరికొద్దిగంటల్లోనే సంక్రాంతి బరిలో ఉన్న రెండు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. భారీ బడ్జెట్ చిత్రం గుంటూరు కారం కాగా మరొకటి హనుమాన్

Update: 2024-01-11 14:09 GMT

సంక్రాంతి సినిమా పండుగ మొదలైంది. మరికొద్దిగంటల్లోనే సంక్రాంతి బరిలో ఉన్న రెండు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈసారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. అందులో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన గుంటూరు కారం, హనుమాన్‌- జనవరి 12 శుక్రవారం- విడుదలకానున్నాయి. అర్ధరాత్రి నుంచి గుంటూరుకారం స్క్రీన్స్‌పై సందడి చేయనుంది.

ఊరమాస్‌ క్యారెక్టర్లో మహేశ్‌ బాబు

సంక్రాంతి బరిలో మహేశ్‌బాబు గుంటూరు కారం ఉండడం, అందరి అంచనాలు ఈ సినిమాపైనే ఉన్నాయి. త్రివిక్రమ్‌, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. గుంటూరుకారంలో మహేశ్‌బాబు గతంలో ఎప్పుడూ కనిపించనంత కొత్తగా కనిపిస్తున్నాడు. మహేశ్ గత చిత్రాలు కాస్త మెసేజ్‌ ఓరియెంటెడ్‌గా తెరకెక్కాయి. గుంటూరుకారంలో సూపర్‌స్టార్‌ ఊర మాస్‌ క్యారెక్టర్‌లో కనిపించడంతో బొమ్మ బ్లాక్‌బ్లాస్టర్‌ అని అంటున్నారు. ఇక అర్ధరాత్రి నుంచే గుంటూరుకారం 23 థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో రేపు వెయ్యి థియేటర్లలో గుంటూరుకారం విడుదలవుతుంది. సౌత్‌ ఇండియాలో 14 వందల థియేటర్లలో సందడి చేయనుంది. నార్త్‌ ఇండియాలోనూ 800 థియేటర్లలో గుంటూరుకారం రిలీజ్‌ అవుతుంది. ఇక ఓవర్సీస్‌లోనూ స్క్రీన్‌ల సంఖ్య భారీగానే ఉంది.

 


రూ.42 కోట్ల ప్రీ బిజినెస్‌...

బిజినెస్ పరంగా హనుమాన్, సైంధవ్, నా సామిరంగ చిత్రాల కంటే గుంటూరు కారం టాప్‌లో ఉంది. ఒక్క నైజాంలోనే గుంటూరు కారం 42 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్‌ చేసిందని సమాచారం. ఇక సీడెడ్‌లో 13 కోట్ల 75 లక్షలు, ఉత్తరాంధ్రలో 14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 8 కోట్లు, వెస్ట్ గోదావరిలో 6 కోట్ల 5 లక్షలు, గుంటూరు 7 కోట్ల 65 లక్షలు బిజినెస్ చేసిందని టాక్‌. కృష్ణా జిల్లాలో ఆరున్నర కోట్లు, నెల్లూరులో నాలుగు కోట్లు ఇలా తెలుగురాష్ట్రాల్లో మొత్తంగా 102 కోట్ల వరకు బిజినెస్ చేసిందని సమాచారం. ఇతర రాష్ట్రాల్లోనూ 9 కోట్లు, ఓవర్సీస్‌‌లో 20 కోట్ల వరకు బిజినెస్ చేసింది గుంటూరుకారం. మొత్తంగా 132 కోట్లు ప్రీ బిజినెస్‌ చేసిందని సినీవర్గాల్లో వినిపిస్తున్న మాట.

సింగిల్‌ స్క్రీన్లలో టికెట్‌ రూ.65

గుంటూరుకారం సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి సింగిల్ స్క్రీన్లలో టికెట్‌ రేటు 65 రూపాయలు, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో 100 రూపాయలు పెరిగింది. బెన్ ఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతివ్వడంతో ఇవాళ అర్ధరాత్రి నుంచే గుంటూరుకారం షో పడనుంది. ఏపీలోనూ టికెట్‌పై 50 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉదయం నాలుగు నుంచి ప్రీమియర్స్ పడనున్నాయి.

Tags:    

Similar News