జిందాబాద్ రాజ్ కపూర్

వెండితెర తండ్రికి నూరేళ్లు

Update: 2024-12-14 06:26 GMT

ఆవారా హూఁ...పాట ఈనాటికీ మనలోపల పలుకుతుంది. మేరా జూతా హై జాపానీ... మనతో కలిసి నడుస్తుంది. రామయ్యా వస్తావయ్యా ...అని రాగయుక్తంగా పిలుస్తుంది. అంతలోనే, దోస్త్ దోస్త్ నా రహాఁ... అంటూ గుండెల్ని పిండేస్తుంది.

జీనా యహాఁ, మర్నా యహాఁ...అంటూ భుజమ్మీద చెయ్యేసి ఓదారుస్తుంది. అది రాజ్ కపూర్ (14 డిసెంబర్1924 – 2 జూన్ 1988) మార్క్ పాట. అది చీకటిలో, వెన్నెల్లో తడుస్తున్న మంచుపూల తోట. రాజ్ కపూర్ సినిమాల్లోని పాటలు, రంగురంగులపూల సీతాకోకచిలుకలై మన భుజాల మీద వాలతాయి. వెంటపడి కవ్వించే ఆ సంగీతం, రాజ్ కపూర్ ని మనకి కానుకగా ఇచ్చే శంకర్ జైకిషన్ ల మాయాజాలం, ఊగించి వూరించే సాహిత్యం... భారతీయ సినిమాని కలలుగా కన్నీళ్లుగా వెన్నెల రాత్రులుగా మన దోసిలి నింపిన, ఆ మరపురాని బ్లాక్ అండ్ వైట్ కాలపు రుణం ఎలా తీర్చుకోగలం?

మరొక్క సారి రాజ్ కపూర్ ని ఇష్టంగా తలుచుకోవడం తప్ప! ఆ గంధర్వ కాంతలు నర్గీస నీ నిమ్మినీ, వైజయంతి మాలని మరొక్క సారి చూసి తరించడం తప్ప!

ఎలా కలలు కనాలి? ప్రేమించడం ఎలా? నిరాశ నిండిన, నిత్య జీవనయాతనకు ఎలా ఎదురీదాలి? కన్నీళ్లు ఉబికి వస్తున్నా పెదవులపై చిరునవ్వుల్నిఎలా మెరిపించాలి? బాధని ఎలా జయించాలి? కోట్ల మంది పేద, మధ్య తరగతి భారతీయ యువతీయువకులకు నేర్పించిన గురువు, తండ్రి, గ్రేటెస్ట్ షోమన్ ఆఫ్ ఇండియా (showman) -రాజ్ కపూర్, భావుకుడు, ప్రేమికుడు, తాత్వికుడు... ఆ మరిచిపోలేని, మానవుడి శతజయంతి నేడు.




1924 డిసెంబర్ 14న ఇపుడు పాకిస్తాన్ లో ఉన్న పెషావర్ లో పుట్టాడు. ఆయన తండ్రి పృథ్వీరాజ్ కపూర్ భారతీయ ధియేటర్ ని, వెండి తెరని రాజఠీవితో వెలిగించిన అలనాటి మహోన్నత నటుడు. నూరేళ్లు నిండు చందమామని తలుచుకుంటూ, ‘రాజ్ కపూర్ -100’ అనే మకుటంతో దేశమంతటా ఆయన టాప్ టెన్ సినిమాలు ప్రదర్శించి సంబరాలు చేయాలని నిర్ణయించారు. 40 నగరాల్లో 135 థియేటర్లలో ఈ ఉత్సవం జరుగుతోంది. ఆర్ కె ఫిల్మ్స్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, NFDC, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా కలసి ఈ కార్యక్రమం తలపెట్టాయి. డిసెంబర్ 13 నుంచి 15 దాకా మూడు రోజుల పాటు, సభలూ, చిత్ర ప్రదర్శన ఉంటాయి.

20 యేళ్ల యువకుడిగా ఉన్నపుడే రాజ్ కపూర్ భారత స్వాతంత్య్రోద్యమ ఉధృతిని చూశాడు. ఆనాడు కోట్ల మంది ఆరాధించి నట్టుగానే, ఆ కుర్రాడి హృదయంలో జవహర్ లాల్ నెహ్రూ ఆదర్శంగా నిలిచి వెలిగాడు. దేశం స్వేచ్ఛ పొంది ఏడాది తిరగకుండానే, 24 యేళ్ల రాజ్ కపూర్ ఆగ్ తీశాడు. నిర్మాత, దర్శకుడు ఆ యువకుడే. హీరోయిన్ నర్గీస్. ప్రేమ కోసం పరితపించే ఒక నవయువకుడి ఆవేశపూరితమయిన అన్వేషణే ‘ఆగ్’. నర్గీస్ రాజ్ కపూర్ ల అమాయకమైన స్వచ్ఛమయిన ప్రేమ యువతరాన్ని వూగించింది. రాజ్ కపూర్ లోనూ ప్రేమ చిగురించింది. నర్గీస్ తో రాజ్ నిజ జీవిత ప్రే కొన్ని దశాబ్దాలు ఉద్రిక్తంగా నడిచింది. ‘ఆగ్’ పెద్దగా విజయం సాధించలేక పోయింది. 1951లో వచ్చిన ‘ఆవారా’ సూపర్ హిట్టయి నవభారతాన్ని ఊర్రూత లూగించింది. హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ సరిహద్దుల్ని దాటి మాస్కో మహానగరాన్ని కదిలించింది. లక్షలాది రష్యన్లు, తన్మయత్వంతో ‘ఆవారా హూఁ..’ అంటూ పాడి డ్యాన్సులు వేశారు.

1955 లో ‘శ్రీ 420’ అనే విచిత్రమయిన పేరుతో రాజ్ తీసిన సినిమా ఒక బ్లాక్ అండ్ వైట్ భూకంపం సృష్టించింది. మేరా జూతా హై జాపానీ... పాట జాతి జనుల గుండెల్లో మార్మ్రోగింది. ‘ఫిర్ భీ దిల్ హై హిందూస్తానీ’ అనే పంచ్ లైన్ పాడుకుని యువత పులకించిపోయింది. నెహ్రూ తలపెట్టిన దేశ పునర్నిర్మాణం ఒక పక్క, రోజు రోజుకి పెరిగిపోతున్న స్వార్థం, అవినీతిని ప్రశ్నిస్తూ రాజ్ కపూర్ సినిమాలు మరోపక్క. దేశ ఐక్యత,ఆదర్శమనే దారిదీపాలని జాతికి ప్రసాదించాయి.

తెరమీద నర్గీస్, రాజ్ ల జంట జనాలను వెర్రెత్తిస్తున్నది. ప్యార్ హువా ఇక్రార్ హువాఁ... దేశాన్ని పరవశింపచేస్తున్నది. ఆ మైకం నుంచి శ్రోతలు తెరుకునే లోగా ‘జిస్ దేశ్ గంగా బెహతీ హై’ విడుదలై చరిత్ర సృష్టించింది. పద్మినీ అందం, రాజ్ ఉద్వేగం, దేశాన్నిఒక కుదుపు కుదిపాయి. రాజ్ కపూర్, నర్గీస్, వైజయంతిమాల, నిమ్మి, పద్మినీ కలసి జీవించిన కళాత్మక చిత్రాలు మన సంస్కృతిలో భాగంగా నిలిచి ఉంటాయి. నిజాయితీతో, ఒక ఆవేశంతో పొంగి పొరలుతున్న భావుకత్వంతో రాజ్ వెండితెర మీద కవిత్వం రాసిన ఆ కాలాన్ని సిని విమర్శకులు ‘ఏజ్ ఆఫ్ ఇన్నో సెన్స్’ (Age of Innocence) అన్నారు. కమర్షియల్ సినిమాలే అయినా, ఒక కమిట్ మెంట్ తో చేసిన అపూర్వమయిన ప్రయోగాలవి. మనకి అంత గొప్ప సంపద మిగిల్చి వెళ్లిపోయిన మహానుభావుడు గనుక, రాజ్ కపూర్ ని ఇష్టంగా తలచుకుంటున్నాం. 'బర్సాత్' లో చూడాలి ఆ వానా, వెలుగూ, నర్గీస్ బుగ్గల మెరుపూ, రాజ్ కళ్లలో కురిసే ప్రేమా... సన్నజాజుల స్వచ్ఛత.. విరజాజుల పరిమళం. ఎంతో సహజంగా, కెరటాలు పాదాల్ని తాకినంత మురిపెంగా! వొట్టి ఊరిరాడనివ్వని ప్రేమ మాత్రమేనా, ఒక సామాజిక, రాజకీయ నేపథ్యం, తాత్విక పునాది వుంటేనే అది రాజ్ వూహలకు రెక్కలొచ్చిన సినిమా అవుతుంది. 



పెద్దకొడుకు హీరోరణధీర్ కపూర్, తండ్రిని ఇలా గుర్తు చేసుకున్నాడు:"నేను రాజ్ కపూర్ కొడుకుని అయినందుకు ఆనందంగా ఉంది. గర్వంగా ఉంది. ఆయన ప్రేమాస్పదుడైన తండ్రి. సమయం దొరికినపుడల్లా పిల్లలతో గడిపేవాడు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని చెప్పేవాడు"

అమితాబచ్చన్, నూరేళ్లు ఉత్సవ సమయంలో రాజ్ ని గౌరవంగా స్మరించుకుంటూ, "'ఆవారా'లో ఆ కల సన్నివేశాన్ని విజువలైజ్ చేసి, వెండి తెర మీద ఆవిష్కరించిన తీరు అపూర్వం. క్లాసికల్ చిత్రాలు తిరిగి తెర మీదకి రావాలనే మా నిబద్ధతకి కొనసాగింపే, రాజ్ కపూర్-100 ఉత్సవ నిర్వహణ. సామాన్య మానవుడికి గొంతునీ, చైతన్యాన్ని ఇచ్చిన వాడికీ, సినిమా కోసం జీవితాన్ని అంకితం చేసిన వాడికీ మేం ఇచ్చే నివాళి ఇది"

మల్టీ కలర్ లో "సంగమ్"

ఆధునిక భారతీయ హిందీ సినిమా రంగులతో మన ముందుకి వచ్చింది. రాజ్ కపూర్ తీసిన ముక్కోణ ప్రేమ కథ 'సంగమ్' (1964) . ఇండియాని గడగడలాడించింది."యేమేరా ప్రేమ్ పత్ర్ పడ్ కర్, కే తుమ్ న రాజ్ నహోనా.." పాట ప్రతి ఇంట్లో, ప్రతి హోటల్లో, ప్రతి వీధిలో ఒకసారి కాదు, వందసార్లు వినిపించింది. సౌందర్యరాశి వైజయంతిమాలని ఇద్దరు హీరోలతో పాటు కుర్రవాళ్లంతా ప్రేమించారు. రెండు ఇంటర్వెల్స్ తో వొచ్చిన మూడున్నర గంటల సినిమా జనాల్ని సీట్లలో కూర్చోబెట్టగలిగింది. భగ్నప్రేమికులంతా, దోస్త్ దోస్త్ నా రహా అని రేయింబవళ్లు పాడుకున్నారు. రాజ్ కపూర్ కీర్తి ఖండాంతరాలను దాటి వెళ్లింది. 


1970 లో మేరానామ్ జోకర్ విడుదలైంది. సర్కస్ లో ఒక జోకర్ గాడి కథ. దాదాపు నాలుగు గంటల సినిమా. ఒక కళాకారుడి జీవితం, ప్రేమా, నిరాశా, అవమానమూ, హేళనా.. కలిసి వికసించిన ప్రేమ కావ్యం. సిమీగరేవాల్ తో చిన్నప్పటి ఆకర్షణ, యవ్వనంలో రష్యన్ సర్కస్ కళాకారిణి సీనార్యబి యాంకినాతో ప్రణయం, మధ్యవయసులో పద్మినితో శృంగారం... అదో పెద్ద ప్రయాణం. నవ్వించే పిచ్చి జోకర్ గాడడి మానసిక ఘర్షణ. పిడికెడు ప్రేమ కోసం పాకులాట. ఏ భాయ్ జరదేఖే చలో,.. జీనా యహా మర్నా యహా.. అన్ని పాటలూ సూపర్ హిట్లు. సినిమా మాత్రం ఆడలేదు. ఎవరు మంచి సినిమా తీసినా మిగిలేవి నష్టాలే అనేది మన నిర్మాతలందరి అనుభవం. కడుపు మండిన రాజ్ కపూర్, ‘బాబీ’(1973) తీశాడు. తొలి యవ్వన తుళ్లిపాటుతో వెలిగిపోతున్న డింపుల్ కపాడియా కోట్లమంది కుర్రవాళ్లని మూర్చరోగులుగా మార్చేసింది. లేలేత రిషికపూర్ ఆడపిల్లల్ని కలవరపెట్టాడు. పిచ్చి మెలోడ్రామా, అతి, పచ్చిఫార్ములా... ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్. జోకర్ లో పోయిన కోట్లు రెట్టింపై తిరిగి వచ్చాయి. షోమన్ రాజ్ కపూర్ హేపీ. ఆనక అదే చవకబారు అలవరుసలలో ‘రామ్ తేరా గంగా మైలీ’ తీశాడు. జాకెట్ లేని జీనత్ అమన్ బ్రెస్ట్ ని పల్చని పవిట చెంగులోంచి ప్రపంచానికి చూపించి, కలెక్షన్లు రాబట్టుకొన్నాడు. ఎవరు తీసినా మన భారతీయ కమర్షియల్ సినిమాకి పట్టిన దుర్గతి ఇది. కొన్ని లోపాలున్నాయనీ, చాలా వేషాలు వేశాడనీ రాజ్ కపూర్ని నిందించలేం. ఆడదాని వొళ్లు ఎంత ఎఫెక్టివ్ గా అమ్మగలవు? అనేది మన సినీ వ్యాపార సూత్రం. కొన్ని వ్యాపార శృంగార చిల్లర సినిమాల వల్ల రాజ్ కపూర్ కంట్రిబ్యూషన్ మసకబారి పోదు.


భారతీయ సినిమా ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాడు రాజ్ కపూర్. రసహృదయుడు, కళ కోసం బతికినవాడు, మనుషుల్లా బతకండిరా అని మనల్ని మందలించిన వాడు, మన సొంత మనిషి, మన ఇంటి మనిషి రాజ్ కపూర్.

ఒక బిమల్ రాయ్, ఒక గురుదత్, ఒకే ఒక్క రాజ్ కపూర్ సినీ వినోదానికి కొత్త అర్థం చెప్పి, కొత్త దారుల్లో నడిపించిన ఉత్తమ కళాకారులు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కవిత్రయంగా నిలిచి వెలిగిన వాళ్లు.

సూపర్ హిట్ల కోసం, మరిన్ని లాభాల కోసం హీరోయిన్ల తడిచిన శరీర సౌందర్యాన్ని వెండి తెర మీద క్లోజప్పుల్లో హాట్ హాట్ గా అమ్మినా, ఈ నిరుపేద Sex Starved Nation శృంగార దాహాన్ని తీర్చిన వాడుగానే రాజ్ కపూర్ని చూడాలేమో!

"జీవితం ఆనందంగా జీవించడానికి..."

నలుగురికీ ఆనందం పంచడానికి- అని నమ్మిన వాడు రాజ్ కపూర్.

రాజ్ కపూర్ జిందాబాద్.

Tags:    

Similar News